temptations
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలు.. టీడీపీ నేత ఇంట్లో డబ్బుల గుట్టలు..
సాక్షి, విశాఖపట్నం: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ధన ప్రవాహం భారీగా సాగుతోంది. విశాఖలో టీడీపీ ప్రలోభాలకు తెరతీసింది. వెంకోజీపాలెంలోని అమ్మ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఓ అపార్ట్మెంట్లో పోలీసులు శనివారం సోదాలు నిర్వహించారు. టీడీపీ నేత రమేష్ నాయుడు ఇంట్లో రూ.27 లక్షలు నగదు పోలీసులు పట్టుకున్నారు. నగదును ఎంవీపీ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. చదవండి: చినబాబుకు షాక్.. అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి.. -
2 కోట్లు.. ఓ పెట్రోల్ బంకు
కోల్‌కతా: కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకొని తమ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బెదిరిస్తోందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. తమ పార్టీలో చేరాలని, లేకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి చిట్‌ఫండ్ కుంభకోణంలో జైలుకు పంపిస్తామని టీఎంసీ ప్రజాప్రతినిధులను బీజేపీ భయపెడుతోందని మండిపడ్డారు. ఆదివారం కోల్‌కతాలో అమరవీరుల దినాన్ని పురస్కరించుకొని టీఎంసీ భారీ ర్యాలీ నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు భారీగా హాజరైన ఈ ర్యాలీలో ఆమె ప్రసంగించారు. కర్ణాటకలో అనుసరిస్తున్న వైఖరినే రాష్ట్రంలోనూ ప్రయోగించాలని బీజేపీ చూస్తోందని ఆమె విమర్శించారు. దీనికోసం తమ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ.2 కోట్లతోపాటు పెట్రోల్ బంక్ ఇస్తామని ప్రలోభపెడుతోందని ఆరోపించారు. తమ పార్టీ గ్రామ నేతలకు రూ.20 లక్షలు ఇస్తామని ఆశ చూపుతోందన్నారు. డబ్బుతో ఎవరినైనా కొనేయగలమనే అహంకారంలో బీజేపీ ఉందని మండిపడ్డారు. ఇలాగైతే మరో రెండేళ్లే.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసి బీజేపీ గెలిచిందని మమత ఆరోపించారు. ప్రస్తుత తీరుగానే వారి వ్యవహారం ఉంటే మరో రెండేళ్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటుందని హెచ్చరించారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి టీఎంసీ నాయకులు వసూలు సొమ్మును తిరిగిచ్చేయాలని తాను అన్నట్లుగా తన గత ప్రకటనను బీజేపీ వక్రీకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల అమలుపై ఓ కన్నేసి ఉంచాలని తమ పార్టీ నాయకులకి తాను చెప్పానని, అయితే తన మాటలని వక్రీకరించి తమ నాయకులను బీజేపీ భయపెడుతోందని మండిపడ్డారు. ముందు బీజేపీ తరలించిన నల్లధనాన్ని వెనక్కి తీసుకురావాలని, అలాగే ఆ పార్టీ నాయకులు ఉజ్వల పథకంలో వసూలు చేసిన సొమ్మును వెనక్కి ఇవ్వాలన్నారు. ఇదే డిమాండ్‌తో 26వ తేదీన నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ఉచిత ఎల్పీజీ పేరుతో బీజేపీ నేతలు డబ్బు వసూలు చేయడంపై దర్యాప్తు జరుపుతామన్నారు. 18 లోక్‌సభ స్థానాలు గెలిచి.. మొత్తం రాష్ట్రాన్ని గెలిచేసినట్లుగా బీజేపీ భావిస్తోందని ఎద్దేవా చేశారు. గంటపాటు ర్యాలీలో ఆమె.. ఏ ఒక్క బీజేపీ నాయకుడి పేరు కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. -
పచ్చనేతల.. ప్రలోభాలు..
ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మద్యం, నగదు విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. నెల్లూరు నగరంలో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది వార్డుల్లో తిరుగుతూ ఓటర్లకు నగదు అందజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల టీడీపీ అభ్యర్థుల తరఫున మద్యం పంపిణీ యథేచ్ఛగా సాగుతోంది. నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలో టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారు. ఎన్నికల నిబంధనలను పట్టించుకోకుండా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద ఎత్తున నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థి నారాయణకు చెందిన విద్యాసంస్థల సిబ్బంది, పార్టీ నాయకులు నగదు పంచుతుండగా ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారులు, పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. తాజాగా నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని నవాబుపేట చిన్నబాలయ్యనగర్లో ఆదివారం నారాయణ విద్యాసంస్థలకు సంబంధించిన కె.రమేష్‌బాబు, భాస్కర్, మల్లేష్, నరసింహారావు, పుండరీకాక్షయ్యలు ఓటర్లకు నగదు పంపిణీ చేయసాగారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారి దామోదర్, నవాబుపేట ఇన్స్పెక్టర్ కట్టా శ్రీనివాసులు, ఎస్సై వీరప్రతాప్‌లు తమ సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నారాయణకు సంబంధించిన కరపత్రాలు, ఓటరు స్లిప్పులు, రూ.2.74 లక్షల నగదును స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారి ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నగదు పట్టుకున్న విషయంపై సమాచారం అందుకున్న స్థానిక టీడీపీ నేతలు స్టేషన్‌కు చేరుకుని తమ వారిని వదిలిపెట్టాలని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఈ విషయం మీడియాకు తెలియడంతో కనీసం తమవారిని మీడియాలో రాకుండా చూడాలని కోరారు. దీంతో అధికారులు వారిని మీడియా కంటపడకుండా లోపల కూర్చోబెట్టారు. మరో రెండుచోట్ల.. నెల్లూరులోని రంగనాయకులపేట రైలువీధిలో ఆదివారం రాత్రి జనార్దన్‌రెడ్డికాలనీకి చెందిన టీడీపీ నాయకులు ఎస్కే లుక్మాన్ తన అనుచరులతో కలిసి ఓటర్లకు నగదు పంపిణీ చేయసాగాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సంతపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.10 వేల నగదు, ఓటరు స్లిప్పులను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎం.వెంకటేశ్వర్లు తన అనుచరులతో కలిసి ఆదివారం ఎన్టీఆర్ నగర్లో ఓటర్లకు నగదు పంపిణీ చేపట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఫ్లయింగ్‌స్క్వాడ్ ఇన్చార్జి జీబీపీ ప్రవీణ తన సిబ్బందితో కలిసి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్వర్లు నుంచి రూ.36 వేల నగదు, తెలుగుదేశం పార్టీ కరపత్రాలు, ఓటరు స్లిప్పులను వారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వెంకటేశ్వర్లును బాలాజీనగర్ పోలీసులకు అప్పగించారు. మద్యం తరలిస్తుండగా.. సంగం: ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం తరలిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను శనివారం అర్ధరాత్రి రెండు చోట్ల పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకున్నారు. అధికారుల కథనం మేరకు.. సంగం మండలంలోని పడమటి అరవపాళెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు పర్వతాల వెంకటరత్నం, తాండ్ర రాము, పర్వతాల అశోక్‌లతోపాటు మరికొందరు శనివారం అర్ధరాత్రి మండల కేంద్రమైన సంగంకు వచ్చారు. అక్కడ ఓ బ్రాందీలో 1,959 క్వార్టర్ మద్యం బాటిళ్లను బస్తాల్లో కట్టుకుని ట్రక్కు ఆటోలో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ముందస్తు సమాచారంతో సంగం ఎస్సై గోపాల్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసులను చూసి కొందరు పారిపోగా వెంకటరత్నం, రాము, అశోక్‌లను అదుపులోకి తీసుకుని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన వారికి సంబంధించిన 11 మోటార్‌బైక్‌లను, ట్రక్కు ఆటోను స్టేషన్‌కు తరలించారు. అలాగే మండలంలోని పడమటిపాళెం, పల్లిపాళెంలో రెండు బైక్‌లపై మద్యం తరలిస్తున్న అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు పఠాన్, షేక్ రసూల్, ఫయాజ్ బాషా, తమలపాకుల ప్రశాంత్, పర్సుబోయిన పెంచలప్రసాద్, ప్రసాద్‌లను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 154 క్వార్టర్ బాటిళ్లను, రెండు మోటార్‌బైక్‌లను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు మాఫీకి విఫలయత్నాలు తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నాయకులు భారీ ఎత్తున మద్యం తరలిస్తూ పట్టుబడడంతో ఆ పార్టీ మండల నాయకులు ఆదివారం పోలీసు స్టేషన్‌కు పరుగులు తీశారు. వారిని వదిలేయాలంటూ పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు చేశారు. కేసు నమోదు చేశామని బుచ్చిరెడ్డిపాళెం సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్‌బాబు, ఎస్సై గోపాల్ వారికి చెప్పారు. ఎలాగైనా కేసు లేకుండా చూడాలని కొందరు నాయకులు మంత్రులు, రాష్ట్రస్థాయి నేతలతో ఒత్తిడి చేయించినట్లు తెలిసింది. అయితే పోలీసులు వారి పట్టించుకోలేదు. ఈ దాడుల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి రమేష్, సిబ్బంది రవీంద్రబాబు, శంకరయ్య, హరిబాబు, ఎస్సై గోపాల్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా సమాచారం అందుకున్న బుచ్చిరెడ్డిపాళెం సీఐ సురేష్‌బాబు సంగం వచ్చి మద్యం బాటిళ్లను పట్టుకున్న పోలీసులను అభినందించారు. టీడీపీ నాయకులను కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై తెలిపారు. గూడూరులో 371 బాటిళ్ల స్వాధీనం గూడూరు రూరల్: రూరల్ మండలంలోని చెంబడిపాళెం గ్రామంలో ఓటర్లకు పంచేందుకు టీడీపీకి చెందిన కట్టా శివయ్య అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 371 మద్యం బాటిళ్లను ఆదివారం గూడూరు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో రూరల్ ఎస్సై శ్రీనివాసరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. బోగోలు మండలంలో భారీగా మద్యం పంపిణీ బిట్రగుంట: బోగోలు మండలంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు టీడీపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఐదురోజుల నుంచి గ్రామాలకు పెద్దఎత్తున చీప్‌లిక్కర్ తరలిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు పోలీసులు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నా తరలింపు మాత్రం ఆగడం లేదు. దగదర్తి మండలం ఉలవపాళ్లలోని ఒక మద్యం దుకాణం, బోగోలులోని మరో మద్యం దుకాణం, ఇస్కపల్లిలోని మద్యం దుకాణాల ద్వారా గ్రామాలకు భారీ స్థాయిలో మద్యం చేరవేస్తున్నారు. బోగోలులోని టీడీపీ మండల పార్టీ కార్యాలయం నుంచి స్లిప్పులు రాసిస్తే ఆయా దుకాణాల్లో మద్యం కేసులు అందజేస్తున్నారు. కేసుల కొద్దీ మద్యాన్ని గ్రామాలకు తరలించడంతోపాటు ఓటర్లకు నేరుగా మద్యం స్లిప్పులు కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికలకు మరో మూడురోజులు మాత్రమే గడువుండటంతో ఓటర్లను మద్యం మత్తులో ముంచేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న ఈ చౌకబారు పనులపై మహిళలు మండిపడుతున్నారు. టీడీపీ నాయకులు భారీ స్థాయిలో మద్యం పంపిణీ చేస్తున్నా పోలీసులు, ఎన్నికల నిఘా అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి. మర్రిపాడులో రూ.10 లక్షల పట్టివేత మర్రిపాడు: మండలంలో టీడీపీ నాయకులు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన రూ.10 లక్షల నగదును ఆదివారం ఫ్లయింగ్‌స్క్వా డ్ అధికారులు, మర్రిపాడు పోలీసులు పట్టుకున్నారు. అధికారుల కథనం మేరకు.. కంపసముద్రం గ్రామంలో టీడీపీ నేత మల్లు రమణారెడ్డి ఇంట్లో రూ.10 లక్షలు నగదు నిల్వ చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో కలిసి నాయకుడి ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. నగదుకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఈ నగదును ఉంచినట్లు చెబుతున్నారు. నగదును ట్రెజరీలో జమ చేస్తామని మర్రిపాడు ఎస్సై కొండపనాయుడు పేర్కొన్నారు. కాగా మండలంలో రెండురోజుల నుంచి టీడీపీ నాయకులు విచ్చలవిడిగా మద్యం, నగదు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో కాలనీకి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారు. మద్యం ఏరులై పారిస్తున్నారు. -
టీడీపీ ప్రలోభాలకు, బెదిరింపుకు చెక్
- రంగంలోకి దిగిన కీలక నేతలు - కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ నంద్యాల: ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని ప్రలోభాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న అధికార పార్టీ ఆగడాలను అడ్డుకొని, కార్యకర్తలకు అండగా నిలబడటానికి వైఎస్ఆర్సీపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. ప్రభుత్వం ప్రలోభాలకు దిగడం, రోజుకు ఇద్దరు మంత్రులు పర్యటించడం, కౌన్సిలర్ సుబ్బరాయుడిపై పోలీసుల దౌర్జన్యం తదితర వాటిని గమనించిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, కడప, కమలాపురం, నందికొట్కూరు, పాణ్యం, రైల్వే కోడూరు, రాయచోటి ఎమ్మెల్యేలు అమ్జాద్‌బాషా, రవీంద్రారెడ్డి, ఐజయ్య, గౌరుచరితారెడ్డి, శ్రీనివాసులు, గండికోట శ్రీకాంత్‌రెడ్డి, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, కడప, కర్నూలు జిల్లాల పార్టీ అధ్యక్షులు అమర్నాథరెడ్డి, గౌరు వెంకటరెడ్డి, జమ్మలమడుగు ఇన్చార్జి డాక్టర్ సుధీర్‌రెడ్డి, కర్నూలు సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, అనంతపురం ఇన్చార్జి మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, పత్తికొండ, ధర్మవరం, శ్రీశైలం ఇన్చార్జిలు చెరుకులపాడు శ్రీదేవి, వెంకటరామిరెడ్డి, బుడ్డా శేషారెడ్డి బుధవారం నంద్యాలకు చేరుకున్నారు. వీరికి పార్టీ సీఈసీ సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పార్టీ యువ నేత శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, సీనియర్ నేత కల్లూరి రామలింగారెడ్డి స్వాగతం పలికారు. తర్వాత పార్టీ అగ్రనేత బొత్స సత్యనారాయణ నంద్యాలకు వచ్చారు. ఆయనకు, గౌరువెంకటరెడ్డి, బీవై రామయ్యలకు పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. వీరితో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి, చైర్పర్సన్ దేశం సులోచన, పార్టీ కౌన్సిలర్లు, నాయకులు సమావేశమయ్యారు. అనంతరం వీరు శిల్పా ఇంట్లో బస చేశారు. కార్యకర్తలకు భరోసా పోలీసులు భయభ్రాంతులకు గురి చేసిన కౌన్సిలర్ సుబ్బరాయుడు ఇంటిని వైఎస్ఆర్సీపీ నేతలు సందర్శించారు. ఆయనకు, చుట్టుపక్కల ఉన్న రజకులకు «ధైర్యం చెప్పారు. టీడీపీ ఆగడాలకు భయపడవద్దని ధైర్యంగా ఎదుర్కోవాలని తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
‘పచ్చ’ నోట్ల పరవళ్లు!
ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై ప్రలోభాల వల * వెర్రి తలలేస్తున్న అధికార పార్టీ ఆఫర్లు * రూ. 20 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు నగదు * పదవులు.. చర, స్థిరాస్తులు.. కాంట్రాక్టులు * కేసులు ఎత్తివేస్తాం.. ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని హామీ * అవినీతి సంపాదనతో బరితెగించిన టీడీపీ నాయకత్వం * పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుయుక్తులు * రాష్ట్రంలో పార్టీని బతికించుకొనేందుకు పచ్చ కుట్రలు సాక్షి, ప్రత్యేక ప్రతినిధి ‘‘మా పార్టీలో చేరిపో.. నీకు ఎంత కావాలి? చరాస్తా... స్థిరస్తా? నగదా... విలువైన ప్రాంతాల్లో స్థలాలా, పొలాలా? కాంట్రాక్టులా, గనులా? ఏ పదవైతే సరే అంటావు? పోనీ నూతన రాజధానిలో వ్యాపారాలు ఏమైనా చేసుకుంటావా? మీపై ఏవైనా కేసులుంటే ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాం’’ - రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అత్యంత ఖరీదైన ఈ ఆఫర్లు ఇస్తున్నది ఎవరో కాదు, సాక్షాత్తూ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన అనుచర బృందం. అధికారం ఉందనే అహంకారంతో, అవినీతి సొమ్ముతో టీడీపీ నాయకత్వం రెచ్చిపోతోంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రలోభ వల విసురుతోంది. ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తోంది. ప్రారంభ ధరే రూ.20 కోట్లు. సంతలో బేరంలా, వేలం పాటలో పెంపులా ధరను పెంచుకుంటూ పోతోంది. ప్రజాప్రతినిధులకు కొనేయడానికి అధికార పక్షానికి రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రతిపక్ష సభ్యులను తమవైపునకు తిప్పుకోవడానికి కారణమేంటి? ప్రస్తుతం రాష్ట్ర ప్రజల మదిని తొలస్తున్న ప్రశ్నలివే. పబ్బం గడుపుకునేందుకే ఫిరాయింపులు అనతి కాలంలోనే ప్రజాదరణను కోల్పోయిన టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులను చేర్చుకునే కుట్రలకు తెరతీసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపుల పర్వం బేరసారాలతో మొదలై బెదిరింపుల వరకూ వెళుతోంది. అంతటితో ఆగకుండా దగ్గరి బంధువులు, ఆయా సామాజిక వర్గాలు, ప్రాంతాలు, మతాలను కూడా తమ సంత బేరసారాల్లో భాగస్వాములను చేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలనే ఆతృతతో ఇష్టానుసారంగా హామీలన్నీ గుప్పించిన తెలుగు దేశాధినేత వాటిని అమలు చేయడంలో పూర్తిగా చతికిలపడ్డారు. అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అన్ని పనుల్లో అవినీతి రాజ్యమేలుతోంది. పదేళ్ల తర్వాత అధికారం దక్కడంతో తెలుగు తమ్ముళ్లు జేబులు నింపుకొనే పనిలో పడ్డారు. పైస్థాయి నుంచి కింది దాకా ఇదే పరిస్థితి. ప్రజాదరణను పూర్తిగా కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న చంద్రబాబు ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు భారీ ఆఫర్లు ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు. తద్వారా తన చేతగానితనాన్ని, పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నారు. తన అవినీతి, అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కుహకాలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకం తెస్తున్నారు. పబ్బం గడుపుకునేందుకు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. జాతీయ పార్టీగా ప్రకటించుకున్న టీడీపీ తెలంగాణలో ఇప్పటికే చాపచుట్టేసింది. ఆంధ్రప్రదేశ్‌లోనైనా పార్టీని బతికించుకోవడానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రక్రయకు శ్రీకారం చుట్టారు. భారీగానే ప్యాకేజీల బరువు ♦ ఉత్తరాంధ్రలోని ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యేపై వల విసురుతున్నారు. రూ.20 కోట్లకుపైగా నగదు, రాజధాని ప్రాంతం వద్ద రెండెకరాల భూమిని నజరానాగా ఇస్తామని కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి బేరసారాలను సాగిస్తున్నారు. ♦ ఉత్తరాంధ్రలోని మరో జిల్లా ఎమ్మెల్యేకు మంత్రి పదవిని ఆఫర్‌గా ఇస్తున్నారు. ఆయనతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను తీసుకురావాలనే షరతు పెడుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యేకుకార్పొరేషన్ పదవితోపాటు రూ.20 కోట్లకు పైగా ముట్టచెబుతామని ఆ ప్రాంత మంత్రి ఊరిస్తున్నారు. మరో ఎమ్మెల్యేకు కూడా పెద్ద మొత్తంలో క్యాష్ ఆఫర్ ప్రకటించారు. ♦ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధికి మంత్రి పదవితోపాటు మరెన్నో ప్రయోజనాలను ఎర వేస్తున్నారు. ఆయనతో టీడీపీ సీనియర్ నేత, మరో ఎంపీ టచ్‌లో ఉన్నారు. తనతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా తీసుకురావాలనే అధికార పార్టీ ఒత్తిళ్లకు ఆ ప్రజాప్రతినిధి లొంగడం లేదు. ♦ ముఖ్యమంత్రి తిష్టవేసి వ్యవహారాలు నడుపుతున్న జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ముగ్గులోకి దింపే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మీవారిపై కేసులు ఎత్తివేస్తాం, ఎన్నో విధాలుగా ఆదుకుంటాం అని ఓ కేంద్ర మంత్రి ద్వారా రాయబేరాలు నడుపుతున్నా.. తమ పార్టీని వీడబోమంటూ ఆ ఎమ్మెల్యేలు తేల్చిచెబుతున్నారు. + నూతన రాజధాని వస్తున్న జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకు కార్పొరేషన్ చైర్మన్ పదవితోపాటు భారీ ప్యాకేజీని ఆఫర్ చేసినా ఆ ప్రజాప్రతినిధి లొంగడం లేదు. పార్టీ ఫిరాయింపు ద్వారా మచ్చ తెచ్చుకునేందుకు ఆ ఎమ్మెల్యే సిద్ధపడడం లేదు. ♦ వ్యాపార పరమైన సమస్యలు, ఇతర ఇబ్బందులను ప్రస్తావిస్తూ పార్టీ మారాలని మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై ఓ మంత్రి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ♦ రాజధానిలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్న ఓ మంత్రి తన జిల్లాలోని ఇద్దరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కోరినంత డబ్బు ఇస్తానని అంటున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్పించాలనే లక్ష్యాన్ని ముఖ్యమంత్రి తనకు నిర్దేశించారని ఆ మంత్రి చెబుతున్నారు. ♦ ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. చంద్రబాబు గురించి అన్నీ తెలిసిన తాము పప్పులో కాలేయబోమని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తేల్చి చెప్పినట్లు సమాచారం. ♦ టీడీపీకి దిక్కూమొక్కూ లేని జిల్లా నుంచి సీనియర్ నేతలను చేర్చుకునేందుకు ఎంత మొత్తమైనా, ఏ పదవినైనా ఇవ్వడానికి ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఎమ్మెల్యేకు భారీ మొత్తంలో నగదు, కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆఫర్ చేశారు. ♦ మరో జిల్లాలో ఓ ఎమ్మెల్యేని చేర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను అక్కడి టీడీపీ ఇన్చార్జి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ చేర్చుకుంటే తరువాత జరగబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని టీడీపీ నాయకత్వానికి సంకేతాలు పంపారు. ♦ కర్నూలు జిల్లా నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలను తీసుకొస్తేనే మంత్రి పదవి ఇస్తామని ఇటీవలే టీడీపీలో చేరిన ఈ జిల్లా ఎమ్మెల్యేకు టీడీపీ అధిష్టానం షరతు విధించినట్లు సమాచారం. ఇంతలోనే అంత డబ్బా? అధికార పార్టీ ఇస్తున్న ఆఫర్లను చూస్తే కళ్లు తిరగడం ఖాయం. రెండేళ్ల క్రితమే అధికారం చేపట్టిన పార్టీకి ఇంతలోనే అంత డబ్బెక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోవడం ప్రజల వంతవుతోంది. ఈ ఆఫర్లు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని నిత్యం వాపోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కోటరీ అంతూపొంతూ లేని బేరసారాలకు దిగుతున్నారంటే అవినీతి, అక్రమాలకు ఎంతగా బరితెగించి ఉంటారో అంచనాలకు అందడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలో చేరిన వారికి మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు రూ.20 నుంచి రూ.40 కోట్ల వరకు అందజేస్తామని హామీ ఇస్తుండడం గమనార్హం. ఇసుక విక్రయాలు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం మొదలు గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు, విద్యుత్తు ఒప్పందాలు, ప్రైవేట్ సంస్థలకు రాయితీలు.. ఇలా అన్నింటిలో చంద్రబాబు, ఆయన తనయుడు, అనుచర గణం రూ.వేల కోట్లు పిండుకుంటున్నారు. ఒక్క చెమట చుక్కయినా చిందించకుండా సంపాదించిన ఈ అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నారు. -
అడ్డదారిలో అందలం
శ్రీకాకుళం కలెక్టరేట్: మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు శుక్రవారం దాదాపు ప్రశాంతంగా జరిగాయి. మెజారిటీ మండలాలు దక్కించుకునే స్థితిలో ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ మరిన్ని స్థానాలు దక్కించుకోవాలన్న యావతో అధికార జులుం ప్రదర్శించింది. అనైతిక చర్యలు, ప్రలోభాలు, బెదిరింపులతో కొన్ని మండలాలను అదనంగా చేజిక్కించుకోగలిగినా.. మరికొన్ని మండలాల్లో ఆ పార్టీ ఎత్తులు పారలేదు. జిల్లాలో 38 మండలాలు ఉన్నాయి. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల ప్రకారం 22 మండలాల్లో టీడీపీ, 16 మండలాల్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యం సాధించాయి. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే సహజంగా అధ్యక్ష పీఠాలను సైతం ఇదే సంఖ్యలో గెలుచుకోవాల్సి ఉంది. కానీ అధికార దర్పం, అనైతిక చర్యలతో మరో నాలుగు పీఠాలను అదనంగా చేజిక్కించుకుంది. మొత్తం మీద టీడీపీ 26, వైఎస్ఆర్సీపీ 12 మండలాల్లో విజయం సాధించాయి. తనకు తగిన బలం లేని, అభ్యర్ధులు లేని మండలాల్లో టీడీపీ రెండు రోజులు ముందుగానే వ్యూహం ప్రకారం బలహీనవర్గాలకు చెందిన ఎమ్పీటీసీలను, ఇండిపెం డింట్లను ప్రలోభాలకు గురి చేసి తమకు అనుకూలంగా మలచుకున్నారు. రాజాం మండలంలో వైఎస్ఆర్సీపీకి 8, టీడీపీకి 6గురు సభ్యులు ఉన్నారు. ఒక ఇండిపెండెంట్ ఉన్నా రు. ఈ లెక్కన ఎక్కువమంది ఎంపీటీసీలు ఉన్న వైఎస్ఆర్సీపీకి అధ్యక్ష పదవి దక్కాలి. కానీ టీడీపీ నేతలు ఇండిపెండెంట్‌ను బెదిరించి, ఒక వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీని ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకొన్నారు. వారి సహకారంతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. వంగర మండలంలో టీడీపీ గ్రూప్ రాజకీయాలు ఎంపీపీ ఎన్నికల్లో వెలుగుచూశాయి. కళావెంకటరావు, ప్రతిభా భారతి వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఈ మండలంలో టీడీపీకి బలం ఉన్నప్పటికీ ఎంపీపీ అభ్యర్ధి విషయంలో ఈ రెండు వర్గాలు చివరకు పరస్పరం పోటీ పడ్డాయి. పలాసలో వైఎస్ఆర్సీపీకి మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఎలాగైనా విజయం సాధించాలన్న ఉద్దేశంతో టీడీపీ నేతలు కొద్దిరోజులుగా ఇండిపెండింట్‌ను ప్రలోభ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వైఎస్ఆర్సీపీకే ఇండిపెండెంట్ మద్దతు ప్రకటించడంతో టీడీపీ ఎత్తులు చిత్తయ్యాయి. హిరమండలంలో వైఎస్ఆర్సీపీ ఎమ్పీటీసీలను టీడీపీ నేతలు బెదిరించారు.ఆమదాలవలసలో టీడీపీ ప్రలోభాలు ఫలించాయి. కొందరు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు చివరి క్షణంలో టీడీపీకి మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ అధ్యక్ష పీఠాన్ని ఎగరేసుకుపోయింది. కాగా పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తింంచారు. సమావేశం ఆవరణలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఫోన్లో మాట్లాడుతుండగా ఫోన్లు లాక్కున్నారు. అదే పోలీసులు, అధికారులు సమావేశ మందిరంలో నిబంధనలకు విరద్ధంగా టీడీపీ నేతలు ఫోన్లలో మంతనాలు సాగించినా పట్టించుకోలేదు. సీతంపేటలో వైఎస్ఆర్సీపీకే ఆధిక్యం ఉండగా, ఆ మండలాధ్యక్ష పదవి చేజిక్కించుకునేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వారి ప్రలోభాలకు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ఏమాత్రం లొంగలేదు.బూర్జ మండలాధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ విఫలయత్నం చేసింది. నిండు గర్భిణితో బలవంతంగా ఓటు వేయించే ప్రయత్నం చేసి, భంగపడింది. కాంగ్రెస్, టీడీపీలు ఫిక్సింగ్ రాజకీయాలకు పాల్పడినా..చివరకు న్యాయమే గెలిచి..పీఠాన్ని వైఎస్సార్సీపీ దక్కించుకుంది. జి.సిగడాంలో టీడీపీ ఎమ్పీటీసీలు అధికంగా ఉన్నప్పటికీ ఎంపీపీ పదవికి అవసరమైన ఎస్సీ అభ్యర్ధి లేకపోవడంతో వారు వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిని సూరీడమ్మను ప్రలోభపెట్టి ఆమె చేత ఇండిపెండెంట్‌గా పోటీ చేయించారు. ఆమెకు మద్దతుగా ఓటేశారు. పార్టీ విప్‌ను ధిక్కరించి సూరీడమ్మ పోటీ చేసినందున ఆమె ఎన్నికను రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. -
ప్రలోభాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పోలింగ్ దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెర లేపుతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు, మద్యాన్ని పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రచారానికి ఒకరోజే గడువు ఉంది. ఈనెల 28న సాయంత్రం 5గంటలతో ప్రచార పర్వం ముగియనుంది. పోలింగ్‌కు కేవలం మూడు రోజులే ఉండడంతో ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన అభ్యర్థులు ఇకపై ప్రలోభాలపై దృష్టి సారించారు. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు పలుచోట్ల బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించారు. తమ బలాన్ని చాటేందుకు ఈ సభలకు, రోడ్‌షోలకు భారీ సంఖ్యలో జనాన్ని తరలించారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించారు. పోలింగ్ దగ్గర పడడంతో నాలుగు ఓట్లు రాల్చుకునేందుకు ఇప్పుడు పడరాని పాట్లు పడుతున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కులసంఘాలు, యువజన, మహిళ సంఘాల్లో కీలకంగా పనిచేసే వారి ద్వారా పంపిణీ వ్యవహారాలను నడుపుతున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు.. గెలుపే లక్ష్యంగా ఒక్కో ఓటరుకు రూ.500 నుంచి రూ.వెయ్యి రకు పంపిణీ చేసేందుకు కూడా కొందరు అభ్యర్థులు వెనుకాడటం లేదు. నగదుతో పాటు మహిళలకు చీరల పంపిణీపై దృష్టి సారించారు. గంపగుత్తగా మహిళల ఓట్లు పొందేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. తాము గెలిస్తే కులసంఘాల భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీలు ఇవ్వడంతో పాటు, ముందస్తుగానే కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నారు. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లోని ఆయా కులసంఘాల పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. యువజన సంఘాలకు కూడా డబ్బులు ఏరవేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ఆయా సంఘాల కొందరు నాయకులు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులందరి వద్ద తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మరోవైపు పోలింగ్‌కు ఒకట్రెండు రోజుల ముందు ఓటర్లను మద్యం మత్తులో ముంచేందుకు సన్నద్ధమవుతున్నారు. మద్యం దుకాణదారులతో నేరుగా ఒప్పందాలు చేసుకొని ఆయా మద్యం షాపులకు వచ్చిన మద్యం నిల్వల్లోని కొంత భాగాన్ని గ్రామాలకు తరలిస్తున్నారు. రహస్య ప్రాంతాల్లో మద్యం రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచి అక్కడినుంచి ఓటర్లకు పంపిణీ చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌కు భోజనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. తనిఖీలు, చెక్‌పోస్టుల పేరుతో హడావిడి చేస్తున్న అధికారులు అభ్యర్థుల ప్రలోభాలను ఏమాత్రం అరికట్ట లేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ పౌరుల వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు వ్యక్తిగత, వ్యాపార అవసరాల కోసం తరలిస్తున్న డబ్బును మాత్రం పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకుంటున్నారు. కానీ అభ్యర్థులు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసుకుంటున్న సొమ్మును మాత్రం పట్టుకోలేక పోతున్నారనే విమర్శలున్నాయి.