ప్రలోభాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పోలింగ్ దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెర లేపుతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు, మద్యాన్ని పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రచారానికి ఒకరోజే గడువు ఉంది. ఈనెల 28న సాయంత్రం 5గంటలతో ప్రచార పర్వం ముగియనుంది. పోలింగ్‌కు కేవలం మూడు రోజులే ఉండడంతో ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన అభ్యర్థులు ఇకపై ప్రలోభాలపై దృష్టి సారించారు.
పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు పలుచోట్ల బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించారు. తమ బలాన్ని చాటేందుకు ఈ సభలకు, రోడ్‌షోలకు భారీ సంఖ్యలో జనాన్ని తరలించారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించారు. పోలింగ్ దగ్గర పడడంతో నాలుగు ఓట్లు రాల్చుకునేందుకు ఇప్పుడు పడరాని పాట్లు పడుతున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కులసంఘాలు, యువజన, మహిళ సంఘాల్లో కీలకంగా పనిచేసే వారి ద్వారా పంపిణీ వ్యవహారాలను నడుపుతున్నారు.
ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు..
గెలుపే లక్ష్యంగా ఒక్కో ఓటరుకు రూ.500 నుంచి రూ.వెయ్యి రకు పంపిణీ చేసేందుకు కూడా కొందరు అభ్యర్థులు వెనుకాడటం లేదు. నగదుతో పాటు మహిళలకు చీరల పంపిణీపై దృష్టి సారించారు. గంపగుత్తగా మహిళల ఓట్లు పొందేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు.
తాము గెలిస్తే కులసంఘాల భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీలు ఇవ్వడంతో పాటు, ముందస్తుగానే కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నారు. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లోని ఆయా కులసంఘాల పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. యువజన సంఘాలకు కూడా డబ్బులు ఏరవేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ఆయా సంఘాల కొందరు నాయకులు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులందరి వద్ద తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు.
మరోవైపు పోలింగ్‌కు ఒకట్రెండు రోజుల ముందు ఓటర్లను మద్యం మత్తులో ముంచేందుకు సన్నద్ధమవుతున్నారు. మద్యం దుకాణదారులతో నేరుగా ఒప్పందాలు చేసుకొని ఆయా మద్యం షాపులకు వచ్చిన మద్యం నిల్వల్లోని కొంత భాగాన్ని గ్రామాలకు తరలిస్తున్నారు.
రహస్య ప్రాంతాల్లో మద్యం
రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచి అక్కడినుంచి ఓటర్లకు పంపిణీ చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌కు భోజనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. తనిఖీలు, చెక్‌పోస్టుల పేరుతో హడావిడి చేస్తున్న అధికారులు అభ్యర్థుల ప్రలోభాలను ఏమాత్రం అరికట్ట లేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణ పౌరుల వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు వ్యక్తిగత, వ్యాపార అవసరాల కోసం తరలిస్తున్న డబ్బును మాత్రం పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకుంటున్నారు. కానీ అభ్యర్థులు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసుకుంటున్న సొమ్మును మాత్రం పట్టుకోలేక పోతున్నారనే విమర్శలున్నాయి.