‘పచ్చ’ నోట్ల పరవళ్లు! | tdp offers for opposition members | Sakshi
Sakshi News home page

‘పచ్చ’ నోట్ల పరవళ్లు!

Published Thu, Feb 25 2016 2:57 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

‘పచ్చ’ నోట్ల పరవళ్లు! - Sakshi

‘పచ్చ’ నోట్ల పరవళ్లు!

ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై ప్రలోభాల వల
* వెర్రి తలలేస్తున్న అధికార పార్టీ ఆఫర్లు
* రూ. 20 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు నగదు
* పదవులు.. చర, స్థిరాస్తులు.. కాంట్రాక్టులు  
* కేసులు ఎత్తివేస్తాం.. ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని హామీ
* అవినీతి సంపాదనతో బరితెగించిన టీడీపీ నాయకత్వం
* పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుయుక్తులు
* రాష్ట్రంలో పార్టీని బతికించుకొనేందుకు పచ్చ కుట్రలు


 సాక్షి, ప్రత్యేక ప్రతినిధి
 ‘‘మా పార్టీలో చేరిపో.. నీకు ఎంత  కావాలి? చరాస్తా... స్థిరస్తా? నగదా... విలువైన ప్రాంతాల్లో స్థలాలా, పొలాలా? కాంట్రాక్టులా, గనులా? ఏ పదవైతే సరే అంటావు? పోనీ నూతన రాజధానిలో వ్యాపారాలు ఏమైనా చేసుకుంటావా? మీపై ఏవైనా కేసులుంటే ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాం’’
 - రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అత్యంత ఖరీదైన ఈ ఆఫర్లు ఇస్తున్నది ఎవరో కాదు, సాక్షాత్తూ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన అనుచర బృందం.


 అధికారం ఉందనే అహంకారంతో, అవినీతి సొమ్ముతో టీడీపీ నాయకత్వం రెచ్చిపోతోంది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రలోభ వల విసురుతోంది. ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తోంది. ప్రారంభ ధరే రూ.20 కోట్లు. సంతలో బేరంలా, వేలం పాటలో పెంపులా ధరను పెంచుకుంటూ పోతోంది. ప్రజాప్రతినిధులకు కొనేయడానికి అధికార పక్షానికి రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రతిపక్ష సభ్యులను తమవైపునకు తిప్పుకోవడానికి కారణమేంటి? ప్రస్తుతం రాష్ట్ర ప్రజల మదిని తొలస్తున్న ప్రశ్నలివే.
 
 పబ్బం గడుపుకునేందుకే ఫిరాయింపులు

 అనతి కాలంలోనే ప్రజాదరణను కోల్పోయిన టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులను చేర్చుకునే కుట్రలకు తెరతీసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపుల పర్వం బేరసారాలతో మొదలై బెదిరింపుల వరకూ వెళుతోంది. అంతటితో ఆగకుండా దగ్గరి బంధువులు, ఆయా సామాజిక వర్గాలు, ప్రాంతాలు, మతాలను కూడా తమ సంత బేరసారాల్లో భాగస్వాములను చేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలనే ఆతృతతో ఇష్టానుసారంగా హామీలన్నీ గుప్పించిన తెలుగు దేశాధినేత వాటిని అమలు చేయడంలో పూర్తిగా చతికిలపడ్డారు. అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అన్ని పనుల్లో అవినీతి రాజ్యమేలుతోంది.

పదేళ్ల తర్వాత అధికారం దక్కడంతో తెలుగు తమ్ముళ్లు జేబులు నింపుకొనే పనిలో పడ్డారు. పైస్థాయి నుంచి కింది దాకా ఇదే పరిస్థితి. ప్రజాదరణను పూర్తిగా కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న చంద్రబాబు ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు భారీ ఆఫర్లు ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు. తద్వారా తన చేతగానితనాన్ని, పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నారు. తన అవినీతి, అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కుహకాలకు పాల్పడుతున్నారు.  ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకం తెస్తున్నారు. పబ్బం గడుపుకునేందుకు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. జాతీయ పార్టీగా ప్రకటించుకున్న టీడీపీ తెలంగాణలో ఇప్పటికే చాపచుట్టేసింది. ఆంధ్రప్రదేశ్‌లోనైనా పార్టీని బతికించుకోవడానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రక్రయకు శ్రీకారం చుట్టారు.  
 
 భారీగానే ప్యాకేజీల బరువు
ఉత్తరాంధ్రలోని ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యేపై వల విసురుతున్నారు. రూ.20 కోట్లకుపైగా నగదు, రాజధాని ప్రాంతం వద్ద రెండెకరాల భూమిని నజరానాగా ఇస్తామని కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి  బేరసారాలను సాగిస్తున్నారు.
♦  ఉత్తరాంధ్రలోని మరో జిల్లా ఎమ్మెల్యేకు మంత్రి పదవిని ఆఫర్‌గా ఇస్తున్నారు. ఆయనతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను తీసుకురావాలనే షరతు పెడుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యేకుకార్పొరేషన్ పదవితోపాటు రూ.20 కోట్లకు పైగా ముట్టచెబుతామని ఆ ప్రాంత మంత్రి ఊరిస్తున్నారు. మరో ఎమ్మెల్యేకు కూడా పెద్ద మొత్తంలో క్యాష్ ఆఫర్ ప్రకటించారు.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధికి మంత్రి పదవితోపాటు మరెన్నో ప్రయోజనాలను ఎర వేస్తున్నారు. ఆయనతో టీడీపీ సీనియర్ నేత, మరో ఎంపీ టచ్‌లో ఉన్నారు. తనతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా తీసుకురావాలనే అధికార పార్టీ ఒత్తిళ్లకు ఆ ప్రజాప్రతినిధి లొంగడం లేదు.
ముఖ్యమంత్రి తిష్టవేసి వ్యవహారాలు నడుపుతున్న జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ముగ్గులోకి దింపే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మీవారిపై కేసులు ఎత్తివేస్తాం, ఎన్నో విధాలుగా ఆదుకుంటాం అని ఓ కేంద్ర మంత్రి ద్వారా రాయబేరాలు నడుపుతున్నా.. తమ పార్టీని వీడబోమంటూ ఆ ఎమ్మెల్యేలు తేల్చిచెబుతున్నారు.  
 + నూతన రాజధాని వస్తున్న జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకు కార్పొరేషన్ చైర్మన్ పదవితోపాటు భారీ ప్యాకేజీని ఆఫర్ చేసినా ఆ ప్రజాప్రతినిధి లొంగడం లేదు. పార్టీ ఫిరాయింపు ద్వారా మచ్చ తెచ్చుకునేందుకు ఆ ఎమ్మెల్యే సిద్ధపడడం లేదు.
వ్యాపార పరమైన సమస్యలు, ఇతర ఇబ్బందులను ప్రస్తావిస్తూ పార్టీ మారాలని మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై ఓ మంత్రి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు.
రాజధానిలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్న ఓ మంత్రి తన జిల్లాలోని ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కోరినంత డబ్బు ఇస్తానని అంటున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్పించాలనే లక్ష్యాన్ని ముఖ్యమంత్రి తనకు నిర్దేశించారని ఆ మంత్రి చెబుతున్నారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. చంద్రబాబు గురించి అన్నీ తెలిసిన తాము పప్పులో కాలేయబోమని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తేల్చి చెప్పినట్లు సమాచారం.
టీడీపీకి దిక్కూమొక్కూ లేని జిల్లా నుంచి సీనియర్ నేతలను చేర్చుకునేందుకు ఎంత మొత్తమైనా, ఏ పదవినైనా ఇవ్వడానికి ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఎమ్మెల్యేకు భారీ మొత్తంలో నగదు, కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆఫర్ చేశారు.
మరో జిల్లాలో ఓ ఎమ్మెల్యేని చేర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను అక్కడి టీడీపీ ఇన్‌చార్జి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ చేర్చుకుంటే తరువాత జరగబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని టీడీపీ నాయకత్వానికి సంకేతాలు పంపారు.
కర్నూలు జిల్లా నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలను తీసుకొస్తేనే మంత్రి పదవి ఇస్తామని ఇటీవలే టీడీపీలో చేరిన ఈ జిల్లా ఎమ్మెల్యేకు టీడీపీ అధిష్టానం షరతు విధించినట్లు సమాచారం.
 
ఇంతలోనే అంత డబ్బా?
అధికార పార్టీ ఇస్తున్న ఆఫర్లను చూస్తే కళ్లు తిరగడం ఖాయం. రెండేళ్ల క్రితమే అధికారం చేపట్టిన పార్టీకి ఇంతలోనే అంత డబ్బెక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోవడం ప్రజల వంతవుతోంది. ఈ ఆఫర్లు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని నిత్యం వాపోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కోటరీ అంతూపొంతూ లేని బేరసారాలకు దిగుతున్నారంటే అవినీతి, అక్రమాలకు ఎంతగా బరితెగించి ఉంటారో అంచనాలకు అందడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

పార్టీలో చేరిన వారికి మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్‌లతో పాటు రూ.20 నుంచి రూ.40 కోట్ల వరకు అందజేస్తామని హామీ ఇస్తుండడం గమనార్హం. ఇసుక విక్రయాలు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం మొదలు గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు, విద్యుత్తు ఒప్పందాలు, ప్రైవేట్  సంస్థలకు రాయితీలు.. ఇలా అన్నింటిలో చంద్రబాబు, ఆయన తనయుడు, అనుచర గణం రూ.వేల కోట్లు పిండుకుంటున్నారు. ఒక్క చెమట చుక్కయినా చిందించకుండా సంపాదించిన ఈ అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement