బాధితుడు సూరిపోగు మాల్యాద్రి
జలదంకి: పేదల కోసం ప్రభుత్వం మంజూరుచేసే గృహాల నిర్మాణంలో కాంట్రాక్టర్లు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జలదంకి అరుంధతీయ కాలనీకి చెందిన సూరిపోగు అంజయ్య కుమారుడు మాల్యాద్రికి అధికారులు ఇల్లు మంజూరు చేశారు. కాలనీలో నిర్మాణాలను టీడీపీ నాయకుడు కాంట్రాక్టర్‌గా మారి చేపట్టాడు. ఇల్లు మంజూరైన మాల్యాద్రికి నిర్మించకుండా కాలనీలో అదే పేరుతో ఉన్న మరొక వ్యక్తికి నిర్మించారు. మంజూరైన వ్యక్తి అకౌంట్‌లో రెండు దఫాలుగా రూ.1.20 లక్షలు జమచేశారు. దీంతో అధికారులు, కాంట్రాక్టర్ మాల్యాద్రిని రూ.70 వేలు పెద్దమనుషుల వద్ద పెట్టి న్యాయం చేస్తామని చెప్పడంతో నగదు ఇచ్చాడు. తిరిగి మరో బిల్లు రూ.50 వేలు అకౌంట్‌లో పడటంతో ఆ నగదును కూడా ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
అయితే మరో మాల్యాద్రి మాత్రం తనకు ఇల్లు మంజూరైనట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ఇప్పుడు నగదును మొత్తం మీరు తీసుకుంటే తనకు ఎప్పటికీ ఇల్లు వచ్చే అవకాశంలేదని, నేను పూరి గుడిసెలో ఉన్నానని రూ.50 వేలు ఇవ్వనని చెప్పాడు. దీంతో అతనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో మాల్యాద్రి పోలీసుల వద్ద విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం అడుగుతానని తెలిపాడు. జలదంకి మండలంలో హౌసింగ్ నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోందని, 7, 8 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఇళ్లకు కూడా బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment