పటాన్‌చెరు: పశుమాంస ఉత్పత్తి సంస్థ అల్‌కబీర్‌లో మంగళవారం అర్థరాత్రి సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రతినిధులు నలుగురు ఆకస్మిక తనిఖీలు చేశారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా ప్రతినిధులుగా చెప్పుకుంటున్న ఐఏఎస్ అధికారులిద్దరితో పాటు మరో ఇద్దరు సభ్యులు తనిఖీల్లో పాల్గొన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.
మొత్తం పరిశ్రమలో వారు కలియ తిరిగి ఫొటోలు, వీడియోలు తీసుకొని వెళ్లారు. సంస్థ ప్రతినిధులను కంపెనీ యాజమాన్యం లోపలికి వెళ్లనీయలేదు. దాంతో వారి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. అనంతరం ఆ సంస్థ ప్రతినిధులు తమ గుర్తింపును చెప్పుకుంటూ పోలీసులను ఆశ్రయించి పరిశ్రమలోకి వెళ్లారు.
పోలీసులు పరిశ్రమలోకి రావడంతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు. అది కూడా రాత్రి పూట రావడం పరిశ్రమలోని కార్మికులు కొంత అయోమయానికి గురయ్యారు. వారు సేకరించిన సమాచారం, ఇతర వివరాలను గోప్యంగా ఉంచారు. జయరాజ్, రవి అనే ఇద్దరు అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారని తెలిసింది.