ఆరు చిరుతల కథ.. | Cheetahs coming tirumala Neighbor Hood | Sakshi
Sakshi News home page

ఆరు చిరుతల కథ..

Published Tue, Jul 26 2016 3:26 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

ఆరు చిరుతల కథ.. - Sakshi

ఆరు చిరుతల కథ..

తిరుమలలో ఎన్నడూ లేనివిధంగా చిరుతల సంచారం పెరిగిపోయింది. దీనిపై టీటీడీ, అటవీ, వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారుల్లో ఏమాత్రం చలనం కనిపించ లేదు. జనం మొరపెట్టుకున్నా ఎలాంటి స్పందనా లేదు. సమస్య మాత్రం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఓ చిరుత సంచారంతో ప్రారంభమై ప్రస్తుతం ఏకంగా ఆరు చిరుతలు సంచరిస్తున్నాయి. వీటిలో రెండు చిరుతలు కాలిబాట మార్గాల్లోనే ఉన్నాయి. మరో నాలుగు చిరుతలు గోగర్భం డ్యాము నుంచి జీఎన్‌సీ టోల్‌గేట్ వరకు సంచరిస్తున్నాయి. ప్రతిరోజూ చీకటి పడిన తర్వాత ఏదో ఒకమార్గంలో స్థానికులు, భక్తులు ఉండే బాలాజీనగర్ నుంచి జీఎన్‌సీ టోల్‌గేట్ అటవీమార్గాల నుంచి జనం సంచారం ఉండే చోట్ల, నివాస ప్రాంతాల్లోకి చొరబడుతున్నాయి. ఇప్పటి వరకు అవి కేవలం జంతువుల వేట మాత్రమే సాగిస్తున్నాయి.


సోమవారం రాత్రి...
సోమవారం రాత్రి ఓ చిరుత ఏకంగా నర్సింగ్ సదన్‌లోకి చొరబడింది. ముగ్గురు సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అది నిష్ర్కమించేదాకా బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరో మూడు కుటుంబాల భక్తులు గదుల్లోనూ గడిపి క్షేమంగా బయటపడ్డారు.


సమస్యను ఎత్తిచూపిన ‘సాక్షి’
అపారమైన జంతు సంతతితో కూడిన శేషాచలం క్రూరమృగాలకు ఆవాసం. అయితే, ఎన్నడూ లేని విధంగా తిరుమల ప్రాంతంలో చిరుతల సంచారం పెరిగిందన్న విషయాన్ని ఎత్తిచూపే ప్రయత్నాన్ని సాక్షి బృందం సాహసోపేతంగా చేపట్టింది. అవి సంచరించే మార్గాలను ముందుగానే ఎంచుకుని వాహనంలో కాపు కాసింది. బాలాజీనగర్ ప్రాంతంలో ఓ దుప్పిని వేటాడుతూ వేగంగా పరుగులు తీస్తూ వచ్చిన ఓ చిరుతను క్షణాల్లోనే కెమెరాలో బంధించారు. పోలీస్‌క్వార్టర్స్ ప్రాంతంలో చొరబడిన జంట చిరుతల్లో వాహనం దిగి వాటిని వెంబడిస్తూ ఒక చిరుతను తమ కెమెరాలో బంధించారు. మరోసారి బాలాజీనగర్‌లో కుప్పతొట్టి వరకు వచ్చిన చిరుతను సజీవంగా ఫొటోలు తీసి చూపించారు. అయినప్పటికీ సంబంధిత విభాగాల్లో చలనం రాలేదు.


నిర్లక్ష్యం వల్లే..
ఆరు చిరుతల సంచారాన్ని కట్టడి చేసే పనులు పట్టించుకోలేదు. కంటి తుడుపుగా రెండు బోన్లు పెట్టి చేతులు దులుపేసుకున్నారు. చిరుతలు బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేయలేమని అటవీశాఖ సిబ్బంది తేల్చేశారు. దాని ఫలితంగానే సోమవారం రాత్రి ఏకంగా ఓ చిరుత అతిథిగృహంలోకి చొరబడింది. గాలింపు చర్యలు తీవ్రం కావటంతో అది కాస్త గోడ దూకి వెనుక నుంచి అడవిలోకి వెళ్లిపోయింది.


మూల్యం తప్పదు..
ఇకనైనా చిరుత సంచారం కట్టడిపై సంబంధిత విభాగాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే పరిస్థితులు చేయిదాటి ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది. చిరుతలు రాకుండా ఇనుప కంచె నిర్మాణం చేపట్టడం వల్ల కొంత మేర కట్టడి చేసే అవకాశం ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో టీటీడీ యంత్రాంగం పునరాలోచించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


చిరుత తప్పించుకుంది..:జేఈవో శ్రీనివాసరాజు
చిరుత నర్సింగ్‌హోంలోకి దూరింది. అక్కడి ముగ్గురు సిబ్బంది, పక్కనే ఉన్న అతిథిగృహం సిబ్బంది కూడా చూశారు. చిరుతను బంధించేందుకు అటవీశాఖ, జూ సిబ్బంది రంగంలోకి దిగారు. అతిథి గృహంలోకి వెళ్లారు. అణువణువునా గాలించారు. ఆ చిరుత అతిథిగృహం వెనుక నుంచి అడవిలోకి వెళ్లింది. చిరుత సంచారం కట్టడి చేసే చర్యలు వేగవంతం చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement