మీ పార్టీలో మాడాలున్నారని ఒప్పుకోండి..
''మీ పార్టీలో ఆడా మగా కాని మాడాలున్నారని ఒప్పుకొంటే.. మీ పార్టీని కూడా జగనే నడిపిస్తారు.. అంతే తప్ప సంతలో పశువులను కొన్నట్లుగా ఎమ్మెల్యేలను కొనడం సరికాదు'' అని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఎద్దేవా చేశారు. కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులకు నిరసనగా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన జలదీక్ష మూడోరోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బతికున్న వ్యక్తి పేర్లను పథకాలకు పెట్టుకుంటున్న దౌర్భాగ్యం ఇక్కడ తప్ప ఎక్కడా చూడలేదని చెవిరెడ్డి అన్నారు. చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న మజ్జిగ.. ఇలా అన్నింటికీ ఆయన పేర్లే పెట్టుకుంటున్నారని, ఇక శిలావిగ్రహాలు పెట్టుకోవడం ఒక్కటే మిగిలిందని విమర్శించారు. ఆయన సొంత ఊరు నారావారిపల్లెలో కూడా జనం ఆయనను నమ్మడం లేదని.. జగన్ నాయకత్వాన్నే నమ్మారని, అందుకే తనను అక్కడి ఎమ్మెల్యేగా ఎన్నుకొన్నారని చెవిరెడ్డి చెప్పారు.
చంద్రబాబు ప్రతి ఒక్కరినీ మోసం చేస్తూనే ఉన్నారని, తొలుత పిల్లనిచ్చిన మామను, తర్వాత సొంత తమ్ముడిని, ఆపై తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును, 2009 ఎన్నికల్లో వాడుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ను అందరినీ మోసం చేశారని గుర్తు చేశారు. ఇలా అందరూ చంద్రబాబు చేతిలో మోసపోతే మీరెందుకు అక్కడికి పోతున్నారని ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. తాత్కాలికంగా వాళ్లిచ్చిన డబ్బులు ఎంతకాలం ఉంటాయని అడిగారు. టీడీపీలోకి వెళ్లిన ఒక ఎమ్మెల్యే తనకు ఫోన్ చేశారని, ఆయన చెప్పిన మాటలను ప్రస్తావించారు. ''జగనన్నతో ఒక మాట చెప్పు, నేను పార్టీలో చేరినప్పుడు నా చుట్టూ నాయకులు, మంత్రులు, పారిశ్రామిక వేత్తలు అంతా ఉండి చాలా గౌరవించారు. కండువా కప్పి పార్టీలోకి తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం నా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా ఉంది. నాలుగు ఫైళ్లు పట్టుకుని కలెక్టర్ దగ్గరకు వెళ్తే మంత్రులతో చెప్పిస్తే పనిచేస్తా అన్నారు. మంత్రుల వద్దకు వెళ్తే నువ్వు చంద్రబాబు కొనుక్కున్న మనిషివి, ఆయన దగ్గరకే వెళ్లమన్నారు. ఆయన దగ్గరకు వెళ్తే కలెక్టర్ వద్దకు వెళ్లు, చెబుతా అన్నారు. ఇలా నా పని వాళ్ల చుట్టూ వీళ్ల చుట్టూ తిరగడమే అవుతోంది. వాళ్లిచ్చిన డబ్బు మళ్లీ తిరిగి వాళ్లకే ఇచ్చేస్తా.. మళ్లీ పార్టీలోకి వస్తా'' అన్నారని, అయితే.. అలా వెళ్లినవారిని తిరిగి తీసుకోవడం భావ్యం కాదని వైఎస్ జగన్ అన్నారని భాస్కర్ రెడ్డి తెలిపారు.
ఒకప్పుడు రాత్రి పూట తాగే వ్యక్తి మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేయడంతో పగలు, రాత్రి అంతా తాగుతూనే ఉన్నారని, రాజ కుటుంబంలో పుట్టిన ఓ వ్యక్తి ఇటీవల వైజాగ్ విమానాశ్రయంలో కనిపించారని, ఆయన ముందుకు, వెనక్కి వెళ్లలేక మిన్నకున్నారని అన్నారు. వైఎస్ఆర్‌సీపీ నుంచి వెళ్లిన వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా ఉందని, వాళ్లకు జ్ఞానోదయం అయినా భవిష్యత్తు మాత్రం లేదని అన్నారు. జాతరలో బలిచ్చే దున్నపోతు పరిస్థితి శుక్రవారం నుంచి సోమవారం వరకు బ్రహ్మాండంగా ఉంటుందని, దానికి దండలు వేసి, పూజలు చేస్తారని.. కానీ మంగళవారం ఒకే వేటుకు గంగానమ్మ వద్ద నరికేస్తారని చెవిరెడ్డి అన్నారు. అలా మొదట వీళ్లను బాగా మేపి, ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నారని చెప్పారు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా ప్రజల పక్షానే ఉంటానంటూ జగన్ నడుస్తున్నారని, ఇది మనమంతా కళ్లతో చూస్తున్నామని అన్నారు.