మంచం పట్టిన మన్యం
►మలేరియా, జ్వరాలతో అడవి బిడ్డల ఆక్రందన
►రోజురోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్య
►గ్రామాల్లో కానరాని వైద్య శిబిరాలు
►260 మలేరియా కేసుల నమోదు
బుట్టాయగూడెం : ‘పశ్చిమ’ ఏజెన్సీ జ్వరం గుప్పిట్లో విలవిలలాడుతోంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో సీజనల్ జ్వరాలతో పాటు మలేరియా, టైఫాయిడ్, కామెర్ల విజృంభిస్తున్నాయి. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రైవేట్ హాస్పటళ్లలో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సీజన్‌లో సుమారు 260 మలేరియా కేసులు, 33,140 జ్వరాలు కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. అయితే ఇవి కేవలం ప్రభుత్వ ఆస్పత్రిలో నమోదైన కేసులు మాత్రమే. ఏజెన్సీలోని మారుమూల కొండరెడ్డి గ్రామాల్లో మలేరియా జ్వరాలు ఎక్కువగా నమోదైనట్టు తెలుస్తోంది.
బుట్టాయగూడెం మండలం లోని మారుమూల ప్రాంతాలైన గొట్టాలరేవులో బాలికలు గురుగుంట్ల రోజా, గురుగుంట్ల ప్రగతి, బాలుడు కెచ్చెల రాజు మలేరియాతో బాధపడుతున్నారు. కెచ్చెల లక్ష్మి తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. కెచ్చెల రాజు దొరమామిడి ఆస్పత్రిలో వైద్యం పొందాడు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అతడిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కామవరానికి చెందిన వంజం నాగేంద్ర, అంజలి జ్వరాలతో బాధపడుతుం డగా, దాడి వీర్రాజు, మంగా దుర్గారావు జ్వ రంతో బుట్టాయగూడెం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో రెట్టింపు కేసులు నమోదవుతున్నాయని పలువురు చెబుతున్నారు.ఏజెన్సీలోని ప్రతి గ్రామంలోనూ జ్వర పీడితులు కనిపిస్తున్నారు. పలు గ్రామాల్లో వైద్య శిబి రాలు లేవ ని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
చాపరాయి ఘటనతో.. తూర్పుగోదావరి జిల్లా చాపరాయి ఘటన తర్వాత అధికారులు ఏజెన్సీ ప్రాంతంలోని ప్రతి గ్రామంలో సర్వేలు చేపట్టి జ్వరాల నివారణకు కృషి చేస్తున్నారు. అయినా మలేరియా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. వర్షాల వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణించడం, దోమలు బెడదతో వ్యాధులు ప్రబలుతున్నట్టు తెలుస్తోంది.
రహదారులు అధ్వానం
ఏజెన్సీలో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 86 ఆరోగ్య ఉపకేంద్రాలు, బుట్టాయగూడెంలో మలేరియా కార్యాలయం ఉన్నాయి. ఏటా మలేరియా వ్యాప్తి చెందే సమస్యాత్మక 266 గ్రామాలను అధికారులు గుర్తించారు. పలు గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో కనీసం 108, 104 వాహనాలు కూడా వెళ్లడం లేదు.