దమ్ముంటే రారా.. తేల్చుకుందాం
- మళ్లీ రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని
- అటవీశాఖ ఏసీఎఫ్‌కు ఫోన్‌లో బెదిరింపులు
కైకలూరు: అధికారపార్టీకి చెందిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఓ అటవీ అధికారిపై ప్రతాపం చూపారు. ‘నీకు దమ్ముంటే రారా... కావాలంటే సిబ్బందిని తెచ్చుకోరా... నువ్వో.. నేనో ఇక్కడే తేల్చుకుందాం..’ అంటూ ఆయన అటవీశాఖ ఏసీఎఫ్ వినోద్‌కుమార్‌పై ఫోన్‌లో తిట్లపురాణానికి దిగారు. కృష్ణా జిల్లా మండవల్లి మండలం చింతపాడు వద్ద పశ్చిమగోదావరి జిల్లా పెదయాగనమిల్లి గ్రామవాసులు చింతమనేని సూచనలతో సోమవారం ఆందోళనకు దిగారు. చింతపాడు నుంచి తమ గ్రామానికి రోడ్డు నిర్మాణానికి అటవీ అధికారులు అడ్డుపడుతున్నారంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడికొచ్చిన చింతమనేని ఫోన్‌లో అటవీశాఖ ఏసీఎఫ్‌ను బెదిరిస్తూ పత్రికల్లో రాయలేనివిధంగా తిట్టారు.
పూర్వాపరాలివీ..
చింతమనేని ప్రాతినిధ్యం వహిస్తున్న దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదయాగనమిల్లి నుంచి కొమటిలంక పరిధిలో ఇటీవల అక్రమ చేపల చెరువులు తవ్వారు. వీటికి మేత సరఫరా చేయడానికి కృష్ణా జిల్లా చింతపాడు నుంచి మార్గం దగ్గరవుతుందనే ఉద్దేశంతో రోడ్డు పనులు చేపట్టారు. కొల్లేరు అభయారణ్యం పరిధిలో కొత్త రోడ్లు వేయరాదు. ప్రజావసరాలు సాకుచూపుతూ అనుమతుల్లేకుండానే రోడ్డు పనులకు దిగారు. దీనికి చింతపాడు గ్రామస్తులు అభ్యంతరపెట్టారు.
వారిని రెండు జిల్లాల్లోని టీడీపీ ప్రజాప్రతినిధులు నయానోభయానో ఒప్పించారు. అయితే అటవీశాఖ ఒప్పుకోకపోవడంతో ఎమ్మెల్యే చింతమనేని మండిపడ్డారు. తన వర్గీయులతో సోమవారం చింతపాడు వద్ద ధర్నా చేయించారు. ఈ సందర్భంగా అక్కడికొచ్చిన చింతమనేని అటవీశాఖ ఏసీఎఫ్‌పై ఫోన్‌లో చిందులు తొక్కారు. అసభ్యపదజాలంతో దూషించారు.రోడ్డు వేసుకోండి.. ఎవరడ్డు వస్తారో తాను చూసుకుంటానని పెదయాగనమిల్లి గ్రామస్తులతో అన్నారు.