మేయర్ ను చంపింది చింటూనే..! | Chintu killed the mayor | Sakshi
Sakshi News home page

మేయర్ ను చంపింది చింటూనే..!

Published Thu, Nov 19 2015 1:10 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

మేయర్ ను చంపింది చింటూనే..! - Sakshi

మేయర్ ను చంపింది చింటూనే..!

♦ సూత్రధారి, పాత్రధారి అతనేనని నిర్ధారణ
♦ మేయర్ దంపతులు సహా ఐదుగురు టార్గెట్
♦ దుండగుల టార్గెట్‌లో మేయర్ కొడుకు, ఓ కార్పొరేటర్
♦ గంట నుంచి మేయర్ వెంటే రెక్కీలో పాల్గొన్న వైనం
♦ పోలీసుల విచారణలో వెల్లడైన వాస్తవాలు
 
 సాక్షి, చిత్తూరు: చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్యలో ప్రధాన నిందితుడు మోహన్ మేనల్లుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూగా పోలీసులు నిర్ధారించారు.  మేయర్ దంపతులను మట్టుబెట్టేందుకు చేసిన హత్యాకాండలో సూత్రధారి, పాత్రధారి చింటూనే అని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసుల వద్ద ఇద్దరు లొంగిపోగా, ప్రధాన నిందితుడు చింటూను పోలీసులు వెంటాడి పట్టుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. విచారణలో నిందితులు వెల్లడించిన విషయాలకు పోలీసులే దిగ్భ్రాంతికి గురైనట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు.. మేయర్ దంపతులను హత్య చేయాలని వ్యూహరచన చేసిన చింటూ తన సన్నిహితులు మంజునాథ్, వెంకటేష్‌తో పాటు ఇద్దరు కిరాయి హంతకుల సాయం తీసుకున్నాడు.

కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్‌తో పాటు ఆమె భర్త కఠారి మోహన్, కుమారుడు ప్రవీణ్, సంతపేటకు చెందిన కార్పొరేటర్ కమల ప్రసాద్ అలియాస్ కంద, మోహన్‌కు నమ్మినబంటుగా ఉంటున్న ప్రసన్నను హతమార్చాలని స్కెచ్ వేశాడు. అయితే మంగళవారం ప్రవీణ్, ప్రసన్న వేర్వేరు పనుల్లో బయటకు వెళ్లడంతో వారి ప్రాణాలు నిలిచాయి. మేయర్‌ను ఆమె చాంబర్‌లోనే హత్య చేసేటప్పుడు తానెవరో తెలిసేందుకే ముఖానికి ఉన్న బురఖాను తొలగించాడు. చింటూను చూసి నిశ్చేష్టురాలైన మేయర్ కుర్చీలో నుంచి కిందకు దిగి, నేలపై కూర్చుని, ‘వద్దురా.. నన్ను చంపొద్దురా..’ అని రోదిస్తూ ప్రాధేయపడినా కర్కశంగా పిస్టల్‌తో ఆమెను కాల్చేశాడు.

అనంతరం కఠారి మోహన్‌పై కిరాయి హంతకులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. అలాగే, చింటూ ఆయనపై కాల్పులు జరిపాడు. తరువాత ‘ వాడెక్కడరా..? కందా ఎక్కడ..?’ అంటూ రెండు గదుల్లో వెతుకుతూ దుండగులు పారిపోయారు. అప్పటికే కార్పొరేటర్ కందా పరుగులు పెడుతూ కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న మరో గదిలో దాక్కోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ మారణకాండకు గంట ముందు నుంచే దుండగుల్లో ఇద్దరు ముసుగులు ధరించి మేయర్ వెంటే ద్విచక్రవాహనాల్లో వెంబడించారు. ఈ ప్రణాళికలో దుండగులు రెండు పిస్టళ్లను వాడినట్లు తెలుస్తోంది. ఒకటి సంఘటన స్థలంలోని మరుగుదొడ్డిలో పడేసి పారిపోగా, మరో పిస్టల్‌ను పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసుల అదుపులో ముగ్గురు దుండగులు ఉండగా, కిరాయికి వచ్చిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

 మేయర్ తలలో బుల్లెట్
 చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ భౌతిక కాయానికిబుధవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆ వివరాలను వైద్యులు వెల్లడించారు. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో మేయర్ తలపై పిస్టల్‌తో కాల్చడం వల్ల బుల్లెట్ అనురాధ తలలో ఉండిపోయిందని పోస్టుమార్టం చేసిన వైద్యులు తెలిపారు. దీనివల్ల తలలో రక్తం గడ్డ కట్టడంతోబాటు పుర్రె ఎముకలు పగిలిపోయి, తీవ్ర రక్తస్రావం సంభవించి ఆమె చనిపోయినట్లు వెల్లడించారు. శవపరీక్ష పూర్తయిన తరువాత అనురాధ భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

 ప్రశాంతంగా చిత్తూరు బంద్
 చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్యకు నిరసనగా జిల్లా కాపునాడు చిత్తూరు బంద్‌కు పిలుపునిచ్చింది. నగరంలో వ్యాపారులంతా స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు బయటకు కదల్లేదు.

 పోలీసుల అదుపులో ఉన్న నిందితులు వీరే
 హత్య కేసులో పోలీసుల ఎదుట లొంగిపోయిన వారు వెంకటాచలం, మంజుగా తెలుస్తోంది.  ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చింటూకు వీళ్లిద్దరూ అనుచరులు. చిత్తూరు సమీపంలోని ఓ పోలీసు స్టేషన్‌లో నిందితులను విచారణ చేస్తున్నారు. పారిపోతూ పట్టుబడ్డ వ్యక్తి చింటూగా భావిస్తున్నారు. హత్యాకాండలో మొత్తం ఐదుగురు పాల్గొన్నట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

 సీఎం సీరియస్
 కఠారి దంపతుల దారుణ హత్యకు సంబంధించి పోలీసులు, ఇంటెలిజెన్స్ వైఫల్యంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నం చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ భౌతిక కాయాలను సందర్శించి నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement