చిట్టీల వ్యాపారీ పరార్?
Published Fri, Jan 20 2017 12:24 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM
ఆదోని: పట్టణానికి చెందిన చిట్టీల వ్యాపారీ పరార్ కావడంతో బాధితులు లబోదిబో మంటున్నారు. ఎంఐజీలో నివాసమున్న వ్యాపారీ ఇంటికి మూడు రోజులుగా తాళం వేలాడుతోంది. ముందు కుటుంబంతో ఊరెళ్లి ఉండొచ్చని భావించారు. అయితే ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో కొందరు బాధితులు గురువారం అతని ఇంటికెళ్లి కిటికీలోంచి లోపల చూడగా విలువైన సామగ్రి కనిపించక పోవడంతో ఇరుగు పొరుగువారిని విచారించారు. రాత్రికి రాత్రే ఊడాయించినట్లు తెలుసుకొని బోరుమంటున్నారు. అతని బ్యాంక్ ఖాతాలు కూడా కొందరు పరిశీలించగా డబ్బు నిల్వ లేకపోవడంతో మోసపోయామని తెలుసుకొని గొల్లుమంటున్నారు. పిల్లల పెళ్లిళ్లు, చదువులకు, ఇళ్లు, స్థలాలు కొనుగోలు కోసం చాలా మంది ప్రతి నెలా చిట్టీల రూపంలో పొదుపు చేసుకుంటున్నారు. వ్యాపారీ చాలా ఏళ్లుగా చిట్టీలు నడుపుతూ అందరిని నమ్మించాడు. మొదట చిన్ని చిన్న చిట్టీల వేసి ఆతర్వాత రూ. లక్షల చీటీలు వేయించాడు. మొత్తం డబ్బును చేత పట్టుకొని కుటుంబంతో సహ పారిపోవడంతో ఎన్నో ఆశలతో చిట్టీలు వేసుకున్న వారికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. బాధితుల్లో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Advertisement
Advertisement