బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్
-
ఉత్తర్వులు జారీచేసిన గుంటూరు రేంజ్ ఐజీ
నెల్లూరు(క్రైమ్): వి«ధ నిర్వహణలో అనేక అపవాదులను మూటగట్టుకున్న బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ చెంచురామారావును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరిన తొమ్మిది నెలల వ్యవధిలోనే ఆయన సస్పెండ్ కావడం గమనార్హం.
ఆది నుంచి వివాదాస్పదుడే..
దుగరాజపట్నం మెరైన్ సీఐగా పనిచేస్తున్న చెంచురామారావు ఈ ఏడాది జనవరి 21న బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచే అనేక అవినీతి, ఆరోపణలను మూటగట్టుకున్నారు. స్టేషన్లో కేసుల నమోదు నుంచి పరిష్కారం వరకు పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.
-
నకిలీ పత్రాలతో బ్యాంకులను బురిడీకొట్టించిన ఘటన నగరంలో సంచలనం రేకెత్తించింది. కేసు విచారణలో నిందితులకు ఇన్‌స్పెక్టర్ సహకరించారని, ప్రధాన నిందితుడ్ని అరెస్ట్ చేయకుండా రూ.లక్షల్లో నగదును తీసుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. అప్పట్లో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆయన్ను కేసు విచారణ నుంచి తప్పించి నగర డీఎస్పీ వెంకటరాముడుకు అప్పగించారు.
-
వ్యభిచారం కేసులో నిందితుల వద్ద భారీ స్థాయిలో ముడుపులు తీసుకొని తప్పించే యత్నం చేశారు. అయితే పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి రావడంతో చివరికి వారి అరెస్ట్ చూపించి బెయిల్ మంజూరు చేశారనే విమర్శలు ఉన్నాయి.
-
ఓ సివిల్ వివాదంలోనూ భారీస్థాయిలో ముడుపులు స్వీకరించారనే ఆరోపణలు ఉన్నాయి.
-
ఈ నెల 20న బాలాజీనగర్ కానిస్టేబుల్ గోపీ పద్మావతి రియల్‌ఎస్టేట్ సమీపంలో ఓ వైద్య విద్యార్థినిని బెదిరించి నగదు దోచుకున్నారు. 21న ఆమెను పిలిచి లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధిత విద్యార్థిని విషయాన్ని ఎస్పీ విశాల్‌గున్నీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు చెంచురామారావు సదరు కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు. అయితే విచారణలో కేసును నీరుగార్చేందుకు యత్నించారని, అందుకు కానిస్టేబుల్ నుంచి భారీగా నగదు తీసుకొని కేసును ఉపసంహరించుకోవాలని విద్యార్థిని ఒత్తిడి తెచ్చిన ఘటన పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
-
స్టేషన్ పరిధిలో స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులను తన అనుయాయులుగా ఏర్పర్చుకొని వారి ద్వారా పంచాయితీలు చేసి రూ.లక్షలు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. సిబ్బంది సైతం అతని చర్యలతో విసిగిపోయారు. శాంతిభద్రతలను గాలికొదిలేశారనే విమర్శల నేపథ్యంలో ఎస్పీ దృష్టికి ఫిర్యాదులు అందాయి. ప్రత్యేక బృందంతో విచారణ జరిపించి నివేదికను రేంజ్ ఐజీకి సమర్పించారు.
రెండోసారి సస్పెన్షన్
చెంచురామారావు గతంలో పనిచేసిన అన్నీ చోట్లా పలు ఆరోపణలను ఎదుర్కొన్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. విధుల నుంచి సస్పెండ్ కావడం ఇది రెండోసారి. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చిట్టమూరు మండలం మల్లాంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి మోజెన్ నగదు పంపిణీని అడ్డుకొని రూ.43 వేలను స్వాధీనం చేసుకున్నారు. నగదుతో స్క్వాడ్ అధికారులు స్టేషన్ వస్తుండగా మార్గమధ్యలో అప్పట్లో వాకాడు సీఐగా పనిచేస్తున్న చెంచురామారావు వారి వాహనాన్ని అడ్డుకున్నారు. ఏ అధికారంతో నగదును స్వాధీనం చేసుకున్నావంటూ మోజెస్‌తో పాటు సిబ్బందిపై చిందులేసి వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి నిర్భందించారు. వారిపై కేసు నమోదుచేయాలని అప్పటి చిట్టమూరు ఎస్సైను ఆదేశించగా, ఆయన నిరాకరించడంతో అతనిపై దాడికి యత్నించినట్లు సమాచారం. ఈ ఘటనలపై అప్పటి ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ విచారణ జరిపి నివేదికను అప్పటి ఐజీ సునీల్‌కుమార్‌కు సమర్పించగా, ఆయన్ను సస్పెండ్ చేశారు.
అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు: ఎస్పీ
అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ చెప్పారు. చెంచురామారావు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, దీంతో సస్పెండ్ చేశామని చెప్పారు.