పోలీస్ కావాలనుకున్నా
పుట్టపర్తి అర్బన్ : పోలీస్ శాఖలో ఉద్యోగం సంపాదించాలనుకున్నాను..అనుకోకుండా సినీ పరిశ్రమవైపు వచ్చి దర్శకుడిగా మారానని ప్రముఖ దర్శకుడు చంద్రమహేష్ పేర్కొన్నారు. శనివారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన ప్రశాంతి నిలయంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వస్థలం కాకినాడ సమీపంలోని శంఖవరం గ్రామమన్నారు.తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులని, తాను ఇంటర్‌లో ఉండగా నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి కళాశాలకు వచ్చారని, అతన్ని చూసిన తరువాత సినీరంగంపై మక్కువ ఏర్పడిందన్నారు.
1994లో డాక్టర్ రామానాయుడు నిర్మించిన సూపర్‌పోలీస్ చిత్రానికి సహాయ దర్శకునిగా సినీ రంగప్రవేశం చేశానన్నారు. ఇప్పటి వరకు తెలుగు, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో 12 చిత్రాలకు దర్శకత్వం వహించానన్నారు. ప్రేయసిరావే, హనుమంతు చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా ప్రభుత్వం నంది అవార్డులు ప్రదానం చేసిందన్నారు. త్వరలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహిస్తానన్నారు. 2009లో మొదటిసారి సత్యసాయిని దర్శించుకున్నానని, అప్పటి నుంచి తరచూ ప్రశాంతి నిలయానికి వస్తున్నాన్నారు. డాక్టర్ వరప్రసాద్, జెన్ రాజు,యూఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.