- సీపీఐ నేత రామకృష్ణ
విజయవాడ బ్యూరో: కేంద్రంలో అధికారం ఉందని విర్రవీగుతున్న బీజేపీకి జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యను చూస్తే భయమెందుకని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. కమ్యూనిజంలో నిజాలు లేవని, వారి గురించి మాట్లాడడం అనవసరమని రెండు రోజుల క్రితం విజయవాడ సభలో వెంకయ్య వ్యాఖ్యానించడంపై రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తప్పుబట్టారు. కన్హయ్యకుమార్ సభలను చూసి జడిసి సిద్ధార్థ అకాడమీలో సభకు అనుమతిని వెంకయ్యనాయుడు రద్దు చేయించారని ఆరోపించారు.
దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఏనాడు త్యాగాలు చేయని ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు దేశభక్తులని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బ్రిటీష్ వారితో లాలూచీపడిన ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు ఎలా దేశభక్తులు అవుతారని ప్రశ్నించారు. అప్జల్‌గురు అంశానికి జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్‌కు సంబంధంలేదని, అవి నకిలీ వీడియో టేపులని ఫోరెన్సిక్ డిపార్టుమెంటు బయటపెట్టినా అదే వాదన విన్పించడం దివాళాకోరుతనం అవుతుందని మండిపడ్డారు. రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చేసిన వాగ్దానం మరిచి ప్రజలను మోసం చేసిన కేంద్రమంత్రి వెంకయ్య అవాస్తవాలను ప్రచారం చేయడం సరికాదని రామకృష్ణ పేర్కొన్నారు.
'కన్హయ్యను చూస్తే బెదురెందుకు?'
Published Sun, Mar 27 2016 7:50 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM
Advertisement