JNU student
-
జేఎన్‌యూ విద్యార్థి ఇమామ్‌పై దేశద్రోహం కేసు
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి షర్జీల్ ఇమామ్‌పై దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ఇమామ్ రెచ్చగొట్టే ప్రసంగం చేశాడని పేర్కొంది. జామియా మిలియా ఇస్లామియాలో 2019 డిసెంబర్ 13న, అలీఘర్ ముస్లిం వర్సిటీలో 2019 డిసెంబర్ 16న ఇమామ్ మాట్లాడుతూ.. అస్సాంను, ఈశాన్య భారతాన్ని భారత్ నుంచి వేరు చేస్తామని బెదిరించారని విచారణలో తేలిందంది. అంతకుముందు ఇమామ్ తానేం ఉగ్రవాదిని కాదని కోర్టుకు విన్నవించాడు. 2020 జనవరి నుంచి ఇమామ్ జుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో ద్వేషం, ధిక్కారం పెరిగేలా ఇమామ్ ప్రసగించాడని, ప్రజలను రెచ్చగొట్టాడని, దీని వల్ల 2019 డిసెంబర్లో హింస జరిగిందని ఢిల్లీ పోలీసులు అతనిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. -
పార్లమెంటు పేలుళ్ల దోషి అమాయకుడు!
-
పార్లమెంటు పేలుళ్ల దోషి అమాయకుడు!
న్యూఢిల్లీ: సీఏఏ, ప్రతిపాదిత ఎన్నార్సీపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు చల్లారటం లేదు. పలుచోట్ల ఈ దాడులు హింసాత్మకంగా మారగా కొందరు విద్యార్థులు రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగుతున్నారు. ఈ క్రమంలో 2001లో పార్లమెంట్‌పై దాడికి దిగబడ్డ ముష్కరుడు అఫ్జల్ గురును ఓ జేఎన్‌యూ విద్యార్థిని అమాయకుడిగా అభివర్ణించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా సోమవారం ట్విటర్లో షేర్ చేశారు. అందులో ఆ యువతి ప్రసంగిస్తూ.. ‘మనమందరం సీఏఏ, ఎన్నార్సీ గురించి పోరాడుతున్నాం. కానీ మనం దేనిపై నమ్మకం పెట్టుకోలేమని అర్థమవుతోంది. ఇటు ప్రభుత్వాన్ని, అటు సుప్రీంకోర్టును కూడా విశ్వసించలేం. ఎందుకంటే ఈ న్యాయస్థానం భారతీయులను సంతృప్తి పరిచేందుకు అఫ్జల్‌గురును ఉరితీయమని ఆదేశించింది. కానీ చాలా సంవత్సరాల అనంతరం తెల్సిన విషయమేంటంటే.. పార్లమెంటు దాడుల్లో అఫ్జల్‌గురుకు ఎలాంటి ప్రమేయం లేదు. ఇక ఇదే సుప్రీం కోర్టు.. బాబ్రీ మసీదు కింద గుడి ఉందని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవంది. దీంతో గుడి తాళాలు పగలగొట్టడం, దాన్ని కూల్చివేయడం అంతా అబద్ధమే అని నిరూపితమైంది. కానీ న్యాయస్థానం అనూహ్యంగా తిరిగి అదేచోట ఆలయం నిర్మించుకోడానికి అనుమతినిచ్చింది. దీన్నిబట్టి సుప్రీం కోర్టును నమ్ముకోవడం కూడా దండగే’ అని ఆమె పేర్కొంది. కాగా అల్లర్లకు కారణమయ్యే వ్యాఖ్యలు చేసినందుకుగానూ పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఆమెను జేఎన్యూకు చెందిన విద్యార్థిని అఫ్రీమ్ ఫాతిమాగా తేల్చారు. ఇక దీనిపై సంబిత్ పాత్రా స్పందిస్తూ ఆమె సుప్రీంకోర్టునే ప్రశ్నిస్తూ విషాన్ని, ద్వేషాన్ని చిమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక భారత్ నుంచి అసోంను వేరు చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రజలను రెచ్చగొడతున్న ఇమామ్‌కు సైతం ఆమె మద్దతు పలికిందని ఆయన మండిపడ్డారు. అయితే ఆమె ఎక్కడ మాట్లాడిందన్నది తెలియరాలేదు. చదవండి: అఫ్జల్ గురు ‘ఉరి’రోజు ఏం జరిగింది? ఈ అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేను: ఆజాద్ -
‘నా కొడుకెక్కడ చౌకీదార్?’
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ‘చౌకీదార్’(కాపలదారు) ప్రచారాన్ని ఉదృతం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్యాంపెయిన్ పట్ల సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం కన్పించకుండా పోయిన ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ తల్లి ఫాతిమా నఫీస్ మోదీని ఉద్దేశించి ‘కాపలాదారు నా కుమారుడు ఎక్కడ’ అంటూ ప్రశ్నించారు. యూనివర్సిటీ హస్టల్లో ఉంటున్న నజీబ్ మూడు సంవత్సరాల క్రితం అనుమానాస్పద రీతిలో మాయమయ్యాడు. ఈ కేసును పరిష్కరించేందుకు ఢిల్లీ హై కోర్టు సిట్‌ను కూడా నియమించింది. కానీ ఇప్పటి వరకూ అతని ఆచూకీ లభించలేదు. నజీబ్ తల్లి ఫాతిమా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘కాపలాదారుగా చెప్పుకుంటున్నావ్ కదా.. మరి నా కుమారుడు నజీబ్ ఎక్కడ. తను కనిపించకుండా పోవడానికి కారణమైన ఏబీవీపీ అవివేకులను ఇంతవరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదు. నా బిడ్డను వెతకడంలో మూడు అత్యున్నత శాఖలు ఎందుకు విఫలం చెందాయి’ అంటూ ‘#WhereIsNajeeb’ అనే హాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు ఫాతిమా. చదవండి.. (పేరుకు ముందు ‘చౌకీదార్’) 27 ఏళ్ల నజీబ్ అహ్మద్ ఢిల్లీ జేఎన్‌యూలో బయో టెక్నాలజీ చదవుతున్నాడు. ఈ క్రమంలో 2016, అక్టోబర్ 15న నజీబ్‌కు, ఏబీవీపీ విద్యార్థులకు మధ్య చిన్న వివాదం చోటుచేసుకుంది. ఆ తరువాత నుంచి నజీబ్ కనిపించకుండా పోయాడు. దాంతో ఫాతిమా 9 మంది విద్యార్థుల మీద ఫిర్యాదు చేశారు. అంతేకాక ఆమె అభ్యర్థన మేరకు ఢిల్లీ హై కోర్టు ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సిట్‌ను కూడా నియమించింది. కానీ ఇప్పటివరకూ నజీబ్ ఆచూకీ తెలియలేదు. ఈ కేసు విషయంలో సీబీఐ కూడా ఎటువంటి పురోగతి సాధించలేకపోయింది. -
క్యాంపస్‌లో పకోడాలు.. 20 వేలు ఫైన్!
ఢిల్లీ : క్యాంపస్‌లో పకోడాలు(మన భాషలో పకోడి) చేసినందుకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన ఓ ఎం.ఫిల్ విద్యార్ధిపై 20 వేల రూపాయల జరిమానా విధించడమే కాక హస్టల్ నుంచి వెళ్లి పోమ్మని ఆదేశాలు జారీ చేసింది విచారణ కమిషన్. వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన మనీష్ కుమార్ మీనా జెఎన్యూలో ఎం.ఫిల్ చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ పకోడాలు అమ్మి కూడా డబ్బులు సంపాదించవచ్చంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మోదీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలపడం కోసం మనీష్, అతనితో పాటు చదువుతున్న మరో నలుగురు విద్యార్ధులు వెరైటిగా యూనివర్సిటీలోనే పకోడాలు తయారు చేసి అమ్మడం ప్రారంభించారు. అయితే విద్యార్ధుల చేసిన చర్యలు క్యాంపస్ నియమాలకు వ్యతిరేకం అని చెప్పి వర్సిటీ అధికారులు వీరి చర్యలపై ఒక విచారణ కమిషన్‌ను వేశారు. ఆ కమీషన్ క్యాంపస్‌లో పకోడాలు వేయడం నేరం అని, ఇందుకు గాను మనీష్ కుమార్ 20 వేల రూపాయలు ఫైన్ కట్టాలని ఆదేశించింది. హస్టల్ నుంచి వెళ్లిపోవాలని తెలిపింది. అయితే ఈ నిరసన కార్యక్రమాలు అన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగాయి. కానీ విచారణ కమిషన్ మాత్రం ఇప్పుడు విద్యార్ధులు థీసిస్ పేపర్లు సమర్పించే ముందు చర్యలు తీసుకుని వారిని హస్టల్ నుంచి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే మనీష్ వర్సిటీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ‘స్వయంగా ప్రధాని మోదీనే పకోడాలను అమ్మి డబ్బు సంపాదించమని చెప్పారు. ఆయన చెప్పిన దానినే నేను పాటించాను. ప్రధాని మాటను విన్నందుకు నాకు జరిమాన విధించడమే కాక నన్ను హస్టల్ నుంచి వెళ్లిపొమ్మంటున్నారు. ఈ నెల 21 నాటికి నేను నా థీసిస్ పేపర్లను సబ్మిట్ చేయాలి. నా దగ్గర డబ్బు లేదు. ఈ సమయంలో ఇలాంటి చర్యలు తీసుకోవడం చూస్తే వర్సిటీ కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఉంది. ఈ విషయంలో నేను కోర్టును ఆశ్రయించి చట్టపరంగా ముందుకు వెళ్తానని’ తెలిపారు. ఈ విషయం గురించి విచారణ కమిషన్ ‘మనీష్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరి 5న నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా సబర్మతి బస్ స్టాండ్ వద్ద ఆటంకం కలిగించాడు. ఫిబ్రవరి 9న కూడా రోడ్డు మీద పకోడాలను తయారు చేస్తూ రాకపోకలకు అంతరాయం కల్గించాడు. అందుకే అతని మీద ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింద’ని తెలిపింది. నిరసన కార్యక్రమాల్లో పాల్గోన్న విద్యార్ధుల మీద చర్యలు తీసుకోవడం ఇదే ప్రథమం కాదు. గతంలో సుభాన్షు సింగ్ అనే పీహెచ్డీ విద్యార్ధి నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నాడనే నేపంతో అతనికి 40 వేల రూపాయల జరిమానా విధించారు. ఈ విషయం గురించి సుభాన్షు ‘నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి విద్యార్ధికి జరిమానా విధించారు. దీని వల్ల సమయం వృథా కావడమే కాక థీసిస్ పేపర్లను కూడా త్వరగా సబ్మిట్ చేయలేకపోతున్నాం. తప్పకుండా జరిమానా కట్టాల్సి రావడంతో డబ్బుల్లేక చాలా మంది విద్యార్ధులు బాధపడుతున్నారు. జేఎన్‌యూ చర్యలు మా గొంతును నొక్కివేసేలా ఉన్నాయని’ తెలిపారు. -
జేఎన్‌యూ విద్యార్థినిపై విదేశీయుల గ్యాంగ్‌రేప్
దక్షిణ ఢిల్లీలోని గ్రీన్ పార్క్ ప్రాంతంలో 21 ఏళ్ల జేఎన్‌యూ విద్యార్థినిపై ఇద్దరు అఫ్ఘానిస్థాన్ దేశీయులు సామూహిక అత్యాచారం జరిపారు. జేఎన్‌యూలో బీఏ (ఆనర్స్) రెండో సంవత్సరం చదువుతున్న ఆ బాధితురాలు.. గత వారం తన స్నేహితురాలితో కలిసి హౌజ్ ఖాస్ గ్రామంలోని ఒక పబ్‌కు వెళ్లింది. అక్కడ ఆమెకు అఫ్ఘానిస్థాన్‌కు చెందిన త్వాబ్ అహ్మద్ అలియాస్ సలీం (27)తో పరిచయం అయ్యింది. తన స్నేహితుడు, అఫ్ఘాన్కే చెందిన సులేమాన్ అహ్మదీ (31)తో కలిసి ఉంటున్న సలీం.. బాధితురాలిని, ఆమె స్నేహితురాలిని తమ ఇంట్లో పార్టీ ఉంది రమ్మని పిలిచాడు. ఆమె అక్కడకు వెళ్లేసరికి సలీం స్నేహితులు సులేమాన్, సిద్ధాంత్, ప్రత్యూష ఉన్నారు. ఆమె స్నేహితురాలు తిరిగి జేఎన్యూకు వెళ్లిపోగా, ఆమె మాత్రం సలీం ఇంటికి మళ్లీ వచ్చి అక్కడ మద్యం తాగిందని పోలీసులు తెలిపారు. తెల్లవారి లేచేసరికి సులేమాన్ తనపై బలవంతం చేస్తున్నట్లు ఆమెకు తెలిసింది. తాను మత్తులో పడి ఉన్నప్పుడు సలీం, సులేమాన్ తనపై అత్యాచారం చేసినట్లు అర్థమైంది. ఆమె జేఎన్‌యూ హాస్టల్‌కు తిరిగి వెళ్లిపోయి, జరిగిన విషయాన్ని తన స్నేహితులకు చెప్పగా, వెంటనే వారు ఆమెను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. తర్వాత వైద్య పరీక్షల కోసం ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న సలీంతో పాటు సులేమాన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. -
డ్రగ్స్ ఇచ్చి.. విద్యార్థినిపై అత్యాచారం
దేశ రాజధానిలో మరో ఘోరం జరిగింది. ప్రతిష్ఠాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఓ పీహెచ్డీ విద్యార్థినికి డ్రగ్స్ ఇచ్చి, హాస్టల్ గదిలోనే అత్యాచారం చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అన్మోల్ రతన్ అనే ఆ విద్యార్థి.. తాను చూడాలనుకుంటున్న సినిమా ఉందని మెసేజ్ ఇచ్చాడని, తనతో పాటు బ్రహ్మపుత్ర హాస్టల్‌కు రావాల్సిందిగా కోరాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అంతకుముందు ఆమె ఎవరిదగ్గరైనా ఆ సినిమా ఉందా అని ఫేస్బుక్లో మెసేజ్ పెట్టడంతో అతడు తన దగ్గర ఉందని చెప్పాడు. పెన్‌డ్రైవ్‌లోకి సినిమా కాపీ చేసుకోడానికి తాను అన్మోల్ రతన్ గదికి వెళ్లినప్పుడు అతడు తనకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చాడని బాధితురాలు ఫిర్యాదుచేసింది. కాసేపటికే తాను స్పృహ కోల్పోయానని, తాను స్పృహలో లేనప్పుడే అతడు తనమీద అత్యాచారం చేశాడని తెలిపింది. తనకు మెలకు వచ్చిన తర్వాత గట్టిగా అరిచేందుకు ప్రయత్నించానని, కానీ రతన్ తన నోరు నొక్కేశాడని చెప్పింది. జరిగిన విషయం గురించి ఎవరికైనా చెబితే బాగోదంటూ ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్‌కు చెందిన అతడు బెదిరించాడు. ఎట్టకేలకు ఆమె వసంత్ కుంజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వాళ్లు 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్యపరీక్షలకు పంపారు. ఎఫ్ఐఆర్ దాఖలు కాగానే ఏఐఎస్ఏ రతన్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దుచేసింది. అయితే ఈ వ్యవహారంపై తనకు ఫిర్యాదు ఏమీ రాలేదని జేఎన్‌యూ రిజిస్ట్రార్ ప్రమోద్ కుమార్ తెలిపారు. యూనివర్సిటీకి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, యూనివర్సిటీ సెక్యూరిటీ విభాగాన్ని కూడా తాను అడగ్గా వాళ్ల నుంచి ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. -
తల్లిదండ్రుల వద్దకు కన్హయ్య
పాట్నా: దేశ ద్రోహం ఆరోపణల కేసులో అరెస్టయి అనంతరం విడుదలయిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ తన సొంత గ్రామానికి వెళ్లనున్నాడు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పాట్నాలో అడుగుపెట్టిన అతడు బెగుసరాయ్‌లోని తన స్వగ్రామం బిహాత్కు వెళ్లి తన తల్లిదండ్రులను కలవనున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం పాట్నా విమానాశ్రయంలో కన్హయ్య కుమార్ కు భారీ స్వాగతం లభించింది. ఈ పర్యటనలో భాగంగా అతడు బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ నేత శద్రఘ్న సిన్హాతో భేటీ అవనున్నాడు. మే 1న పలుచోట్ల బహిరంగ సమావేశాల్లో పాల్గొననున్నారు. -
మరో సంచలనానికి కన్హయ్య రెడీ
న్యూఢిల్లీ: జాతీయవాదం, స్వేచ్ఛవాదంపై జాతీయస్థాయిలో తీవ్రమైన చర్చకు కారకుడైన జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. తనకెదురైన అనుభవాలను అక్షర బద్ధం చేయనున్నాడు. తన జీవితానుభవాలను పుస్తకంగా తీసుకురానున్నాడు. స్కూల్ నుంచి స్టూడెంట్ పాలిటిక్స్ దాకా సాగిన ప్రయాణం గురించి ఇందులో పొందుపరచనున్నాడు. బిహార్ నుంచి తీహార్ వరకు తన జీవితంలో జరిగిన ఘటనలను పుస్తకంలో రాయనున్నాడు. బిహార్ లో గడిచిన స్కూల్ జీవితం, విద్యార్థి రాజకీయాల్లో తాను పోషించిన పాత్ర, జాతిద్రోహంలో అరెస్ట్, జైలు నుంచి బయటివచ్చిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను పుస్తకంలో ప్రస్తావించనున్నాడు. ఈ పుస్తకానికి 'బిహార్ టు తీహార్' అని పేరు పెట్టాడు. 'వ్యక్తులను చంపగలరు కానీ వాళ్ల ఆశయాలను చంపలేరని భగత్ సింగ్ అన్నారు. మేం చేస్తున్న పోరాటం మమ్మల్ని ఎక్కడివరకు తీసుకెళుతుందో తెలియదు. కానీ మా ఆశయాలు పుస్తక రూపంలో చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నామ'ని 28 ఏళ్ల కన్హయ్య కుమార్ అన్నాడు. తరతరాలుగా భారతీయ సమాజంలో కొనసాగుతున్న వైరుధ్యాలను, యువత ఆశ-నిరాశలు, పోరాటాల గురించి రాస్తానని చెప్పాడు. అతడి పుస్తకాన్ని జాగర్ నట్ ప్రచురించనుంది. -
'కన్హయ్యను చూస్తే బెదురెందుకు?'
- సీపీఐ నేత రామకృష్ణ విజయవాడ బ్యూరో: కేంద్రంలో అధికారం ఉందని విర్రవీగుతున్న బీజేపీకి జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యను చూస్తే భయమెందుకని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. కమ్యూనిజంలో నిజాలు లేవని, వారి గురించి మాట్లాడడం అనవసరమని రెండు రోజుల క్రితం విజయవాడ సభలో వెంకయ్య వ్యాఖ్యానించడంపై రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తప్పుబట్టారు. కన్హయ్యకుమార్ సభలను చూసి జడిసి సిద్ధార్థ అకాడమీలో సభకు అనుమతిని వెంకయ్యనాయుడు రద్దు చేయించారని ఆరోపించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఏనాడు త్యాగాలు చేయని ఆర్ఎస్ఎస్ వాళ్లు దేశభక్తులని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బ్రిటీష్ వారితో లాలూచీపడిన ఆర్ఎస్ఎస్ వాళ్లు ఎలా దేశభక్తులు అవుతారని ప్రశ్నించారు. అప్జల్‌గురు అంశానికి జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్కు సంబంధంలేదని, అవి నకిలీ వీడియో టేపులని ఫోరెన్సిక్ డిపార్టుమెంటు బయటపెట్టినా అదే వాదన విన్పించడం దివాళాకోరుతనం అవుతుందని మండిపడ్డారు. రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చేసిన వాగ్దానం మరిచి ప్రజలను మోసం చేసిన కేంద్రమంత్రి వెంకయ్య అవాస్తవాలను ప్రచారం చేయడం సరికాదని రామకృష్ణ పేర్కొన్నారు. -
కన్హయ్యకు నో ఎంట్రీ
హైదరాబాద్: జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కు హెచ్‌సీయూ అధికారులు వర్సిటీలో ప్రవేశానికి అనుమతి నిరాకరించారు. బుధవారం ఆయన హైదరాబాద్ రానున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ‘రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సదస్సు’లో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం రోహిత్ వేముల తల్లిని పరామర్శించిన తర్వాత నగరంలో నిర్వహించే బహిరంగ సభ, హెచ్‌సీయూలో సభ జరిపేందుకు విద్యార్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు అనుమతించకున్నా సభ జరిపి తీరుతామని విద్యార్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
సారీ చెప్పే కాలం కాదిది
జాతిహితం జేఎన్‌యూ-కన్హయ్య-ఢిల్లీ పోలీసులు... సరిగ్గా 35 ఏళ్ల క్రితం నాటి భయా నకమైన 1981 రోజులను గుర్తుకు తెస్తున్నాయి. అప్పట్లో నేను, ఒకేసారి ఐదు చోట్ల తిరుగుబాట్లు చెలరేగుతున్న ఈశాన్యం వార్తా కథనాలను వెలువరిస్తూ ఉండే వాడిని. అధికారిక ప్రకటనల్లో జాతి వ్యతిరేక శక్తులు(ఏఎన్ఈ) అని మాత్రమే చెబుతూ తిరుగుబాటుదార్లను లేదా అజ్ఞాతంలో ఉన్నవారిని ఎంద రినైనా బంధించేవారు, విచారించేవారు, తరచుగా ఏదో ఒక పద్ధతిలో హత మార్చే వారు. రాజద్రోహ నేరం కేసు పెట్టడం అంటే మహా జంఝాటం, అంతకంటే ఇవన్నీ చేయడమే తేలిక. అయితే అది ఒక్కోసారి నమ్మశక్యం కానంతటి మూర్ఖత్వానికీ దారి తీసేది. అమాయక ప్రాణాలకు హానిని కలుగ జేయకపోతే అలాంటి సందర్భాలు గొప్ప హాస్యస్ఫోరకంగా కూడా ఉండేవి. అలనాటి మంచిరోజుల కథ ఆనాటి పరిస్థితుల్లో సైన్యం, పోలీసు, నిఘా విభాగాలలో పనిచేసేవారికి, విలేకరులకు మధ్య ఒక్కోసారి మైత్రీపూర్వకమైన, తరచుగా వైషమ్యపూరి తమైన అసాధారణ అనుబంధం ఉండేది. అయితే అనివార్యంగానే వారి మధ్య ఇచ్చిపుచ్చుకోవడం, సహకరించుకోవడం అనే అనుబంధం కూడా ఉండేది. ఈశాన్యంలో పనిచేసిన అత్యుత్తమ ఇంటెలిజెన్స్ అధికారులలో అజిత్ దోవల్ కాక, కోషీ కోషీ కూడా నాకు మిత్రులు. తిరుగుబాటుకు వార్తల సేకరణ గురించి తెలిసిన వారెవరికైనా విలేకరులు, ఇంటెలిజెన్స్ అధికారులు వాస్తవాలను సరిపోల్చి చూసుకుంటారని తెలిసి ఉంటుంది. అలాగే మేమి ద్దరం తరచుగా మా నోట్స్‌ను ఇచ్చిపుచ్చుకుంటూ ఉండేవాళ్లం. మరీ ముఖ్యంగా ప్రమాదరహితమైన ఉబుసుపోక కబుర్లు చెప్పుకునే వాళ్లం. ఏ బంద్ రోజునో నేను ఆయన కార్యాలయానికి వెళుతుండేవాడిని లేదా ‘‘బౌద్ధ భిక్షువు’’కు (ఓల్డ్ మాంక్ రమ్‌కు మేం పెట్టుకున్న పేరు) రోజువారీ నివాళు లర్పించడానికి కేపీఎస్ గిల్ ఇంట్లో సాయంకాలాలు కలుస్తూ ఉండేవాళ్లం. ఒక సాయంత్రం మహా ఉద్వేగంగా కోషీ, నన్ను ఉన్న పళాన తన కార్యాలయానికి రమ్మని పిలిచారు. గొప్ప కథనం ఉందని, కల్నల్ ఎక్స్‌కు (సైనిక నిఘా విభాగంలో కోషీకి సమాన స్థాయి వారు) పెద్ద తీవ్రవాది దొరి కాడని, కాకపోతే ‘‘జాతి వ్యతిరేక శక్తులలో అతని హోదా’’ ఏమిటో కనిపెట్ట డానికి నా మేధస్సును ఉపయోగించాలన్నారు. అదేదో నన్ను అడగమని ఆయనకు చెప్పారు. తామెన్నడూ విని ఉండని గ్రూపునకు చెందిన ఒక స్వయం ప్రకటిత నాగా లెఫ్టినెంట్ కల్నల్‌ను తమ కుర్రాళ్లు ‘‘పట్టుకు న్నార’’ని, కానీ తమ వద్ద ఉన్న జాబితాలో అతనెవరో గుర్తించలేకపోతు న్నామని ఆయన చెప్పారు. ఆ తీవ్రవాది మాత్రం తాను సాల్వేషన్ ఆర్మీ (పేదల సంక్షేమానికి కృషి చేసే క్రైస్తవ సంస్థ) లాంటి ఏదో గ్రూపునకు చెందినవాడినని పదేపదే చెబుతున్నాడన్నారు. దీంతో, సిరియన్ క్రిస్టియన్ ఆయిన కోషీ నిస్సహాయమైన ఓ నవ్వు నవ్వి, సదరు కల్నల్‌కు ఆ సాల్వేషన్ ఆర్మీ ఎంత నిరపాయకరమైనదో వివరించి, నిర్భాగ్యుడైన ఆ దైవ సైనికునికి క్షమాపణలు చెప్పి తక్షణమే విడుదల చేయమని చెప్పారు. తర్వాత ఓ గంటకల్లా ఆ పని జరిగిపోయింది. జీవితాంతం ఇతరులకు చెప్పాల్సిన కథగా అది మిగిలిపోయింది. అయితే, అవి మంచిరోజులు కాబట్టి అంత సమస్యాత్మక ప్రాంతంలోనూ ఆ కథ వెంటనే మర్యాదకరమైన, తార్కికమైన ముగింపునకు వచ్చేసింది. నేటి హాస్యాస్పద గాథ కన్హయ్య కుమార్ అరెస్టు విషయంలో జరిగింది కూడా సరిగ్గా అలాం టిదే, అంతగానూ హాస్యాస్పదమైనదే. కాకపోతే ప్రభుత్వమో లేదా కోర్టులో అతనిని విడుదల చేయమని చెప్పేవరకు వేచి ఉండాల్సి ఉంటుంది. హఫీజ్ సయీద్ పేరిట వెలువడ్డ ఒక నకిలీ ట్వీట్ , దేశంలోనే అత్యుత్తమమైన ఢిల్లీ పోలీసు యంత్రాంగాన్ని చవటాయలను చేసింది. అంతకంటే మరింత నకిలీ వీడియో దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఎన్నుకున్న అధ్యక్షునిపై రాజద్రోహ నేరం అభియోగాన్ని మోపేలా చేసింది. రాజద్రోహం అంటే దేశంపై యుద్ధం చేయడమని అర్థం. ఇప్పుడు, ఆయన్ను ఏం చేయాలో వాళ్లకు అర్థం కావడం లేదు. సామాజిక, సంప్రదాయక మీడియాలో ఢిల్లీ పోలీసు అధినేత సహా అత్యున్నత స్థాయిలలోని వారంతా కన్హయ్య దేశద్రోహా నికి పాల్పడ్డాడని చెప్పారు. కాబట్టి, గువాహతిలో నాడు సైనిక కల్నల్ ‘సారీ’ చెప్పి ఆ అభాగ్యుడ్ని వదిలి పెట్టేసినంత తేలిక వ్యవహారం కాదిది. పైగా అది దయాదాక్షిణ్యాలున్న కాలం. కాగా, నేడు మనం దేశ మస్తిష్కాన్ని సన్నీ డియో లైజేషన్ (దేశభక్తి అంటూ రంకెలేయడం) చేస్తున్న కాలంలో ఉన్నాం. ఈ సంస్కృతి నేడు నగ్నంగా నర్తిస్తోంది. కాబట్టి రోహిత్ వేముల ఆత్మహత్యపై వచ్చిన ఒత్తిడికి గురై ఉన్నప్పుడు, మొదట అతను దళితుడు కాదంటూ దాటవేయాలని చూసి, ఆ మీదట మొత్తం చర్చనంతా కులం మీదకు మరల్చారు. తర్వాత జేఎన్‌యూపై దాడితో చర్చను జాతీయవాదం కొరవడటంపైకి తిప్పారు. వామపక్ష చింతనకు కేంద్రంగా ఉన్న జేఎన్ యూలో గత పలు సంవత్సరాలుగా వామపక్ష విద్యార్థి సంఘాలకు, అఖిల భారత విద్యార్థి పరిషత్ వంటి మితవాద విద్యార్థి సంఘాలకు మధ్య సంఘ ర్షణ పెరుగుతోంది. ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎప్పుడు చూసినా విస్పష్ట రాజకీయాలు, భావజాల సంఘర్షణ దర్శనమిస్తూ ఉంటాయి. వాటిలోకెల్లా నాకు ఇష్టమైన పెద్ద గోడ చిత్రం... అటూ ఇటూ మార్క్స్, లెనిన్‌లూ మధ్య భగత్‌సింగ్ ఉన్నది. అది ఇప్పటికీ అక్కడే ఉన్నా ఎన్నడూ హింసకు దారితీయలేదు. భావజాల ఘర్షణ ఉన్నా ఆ విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమ విద్వద్వంతులను తయారుచేసింది. ఈ మేధోపరమైన, భావజాలపరమైన ఘర్షణా అందుకు కారణమూ అయి ఉండవచ్చు. బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలోకి రావడంతో ఏబీవీపీ కూడా కాంగ్రెస్ అంతగానూ అసహనంగా తయారైంది. ప్రధానంగా వామపక్ష భావాల సానుభూతిపరులపట్ల అది అసహనంతో ఉంది. ప్రియుడు కొత్వాలయితే... ప్రభుత్వాధికారాన్ని ఉపయోగించుకుని ఎక్కువగా ‘‘వామపక్షీకరణ’’ చెందిన విశ్వవిద్యాలయాలపై ఏబీవీపీ ఆధిపత్యాన్ని సాధించాలని కోరుకుంటోంది. ‘ప్రియుడు కొత్వాలయితే (పోలీసు కమిషనర్) ఎవరైతే నాకేం లెక్క’ అన్నట్టు (హిందీ మాట్లాడే దేశ ప్రధాన భూభాగంలో ప్రాచుర్యంలో ఉన్న నానుడి) వ్యవహరిస్తోంది. హైదరాబాద్‌లోనూ, జేఎన్‌యూలోనూ ప్రభుత్వం దురదృష్టవశాత్తూ పక్షపాతియైన కొత్వాల్లా వ్యవహరిస్తోంది. ఫలితం ఒక దళిత విద్యార్థి విగత జీవి కావడం, పేద కుటుంబానికి చెందిన మరో విద్యార్థి కటకటాల పాలవడం. ఇంతా జరిగాక ఇప్పుడు వాళ్లకు ఏం చేయాలో తోచడం లేదు. మేం గందరగోళపడ్డామంటూ సారీ చెప్పాలి. లేదంటే ఎవరినో తప్పుపట్టి బలిపశువును చేసి, ఇతరుల సంగతి మరచిపోయి కన్హయ్యను విడుదల చేయాలి. అయితే అది హైదరాబాద్ తర్వాత వరుసగా రెండో ఓటమిని అంగీకరించినట్టవుతుంది. లేదంటే, రాజద్రోహ నేరానికి అతనిపై విచారణ జరిపించినట్టయితే ఉదారంగా పెద్ద వివాదాన్ని రాజేసినట్టవుతుంది. మొత్తా నికి కాస్త త్వరగానో లేక ఆలస్యంగానో ఏదో ఒక కోర్టు ఆయన్ను విడుదల చేయక తప్పదు. ప్రత్యేకించి రాజద్రోహ నేరం నిలిచే అవకాశం లేదు. ఏం చేసినా కన్హయ్య పొలిటికల్ స్టార్ అయిపోతాడు. కాబట్టి బీజేపీకి ఎంచుకోవ డానికి ఉన్న అవకాశాలు సరళమైనవే. ఇప్పుడిక వినమ్రంగా తప్పును అంగీకరించి నష్టాలను తగ్గించుకోవడం చేయాలి. లేదా సమర్థించుకోడానికి వీలే లేని దాని కోసం పోరాడి చివరికి అన్ని తప్పులకూ కలిసి ఒకేసారి లెంపలు వేసుకోవాల్సి ఉంటుంది. ఓపీ శర్మ లాంటి వాళ్లు విద్యార్థులను చితక బాదుతుంటే, పదవీ విరమణ చేయనున్న పోలీసు బాసులు వారికి రక్షణ కల్పించ నిరాకరించడాన్ని చూస్తుంటే... ఛాంద సులైన మామలు చెప్పినట్టు వినని పిల్లలపై యుద్ధం ప్రకటించినట్టుంది. పెద్దలకు, యువతరానికి మధ్య పోరాటం చివరకు అనివార్యంగా ఎలా ముగుస్తుందో మానవజాతి చరిత్ర బోధిస్తోంది. వాజపేయి అయితే ఏం చేసేవారు? ఒక మంచి ఆలోచన చెబుతా. సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు, ప్రత్యేకించి బీజేపీ ప్రభుత్వం అమలు చేయాల్సినది అది. మీరు చేస్తున్న చర్యలను వాజపేయి కొలబద్దతో పరీక్షించి చూసుకోవడం. ఈ పరిస్థితిలో అటల్ బిహారీ వాజపేయి అయితే ఎలా వ్యవహరించి ఉండేవారని యోచించండి. అప్పుడు మీ ముందు ఎంచుకోవడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. అవి ఆయన వారసుల ప్రభుత్వం అనుసరిస్తున్న వాటికంటే పూర్తిగా భిన్నమైనవై ఉంటాయి. 1997 మొదట్లో, బీజేపీ-అకాలీదళ్ కూటమి అప్పుడే పంజాబ్‌లో అధికారంలోకి వచ్చింది (నేటి బీజేపీ-పీడీపీ కూటమిలాగా అందుకు కూడా నాడు అవకాశం లేదనే అనిపించింది). భింద్రన్‌వాలా అనుకూల అవాంఛ నీయ పరిణామాలు బద్దలై, స్వర్ణ దేవాలయానికీ వ్యాపించాయి. పంజాబ్ ఉగ్రవాదాన్ని సన్నిహితంగా పరిశీలించిన నేను బెంబేలెత్తిపోయాను. నేన ప్పుడు సంపాదకునిగా ఉన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఆ పరిణామాలపై తీవ్ర దాడిని ప్రారంభించింది. అప్పటికింకా కేంద్రంలో ప్రతిపక్షంగానే ఉన్న బీజేపీ, అకాలీదళ్‌తో మైత్రిని పునరాలోచించాలని సైతం కోరింది. ఒకరోజు మధ్యాహ్నం, తన నివాసానికి రావాలని వాజపేయి నాకు కబురంపారు. అద్వానీ, మదన్‌లాల్ ఖురానాలు కూడా అక్కడున్నారు. తేనీరు సేవిస్తూ వాజపేయి నాకు ఉపన్యాసం ఇచ్చారు. ‘హిందువులు, సిక్కులు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు’ పంజాబ్‌లో గొంతులపైకి కత్తులు దూసుకుంటు న్నారు. సిక్కు మిలిటెంట్లు బీజేపీ నేతలను హతమారుస్తున్నారు. ఇప్పుడు బీజేపీ, అకాలీదళ్ చేతులు కలపడం పంజాబ్‌కు, భారత్‌కు మంచిదా, కాదా? పెద్దగా లెక్కచేయాల్సిన అవసరంలేని ఈ చికాకులను మనం విస్మరించాలి. సంపాదకులవారూ, మీరు కాస్త పరిణతి సాధించాలండీ! అన్నారు. ఈ పరిణామాలు అదుపు తప్పిపోతే ఏం జరుగుతుంది? ఆ చికాకులు కలిగిస్తున్న వారు అకాలీల మీద ఆధారపడటం లేదా? అని నేనడిగాను. ఆ విషయాలన్నీ ‘‘ఖురానా జీ చూసుకుంటారు... ఈ సమస్యలను పరిష్కరించగల దృఢ సంకల్పం ఆయనకుంది’’ అని బదులిచ్చారు. ఆయనైతే హైదరాబాద్ ఉదంతంతో ఎలా వ్యవహరించేవారో ఆలోచిం చించి చూడండి. ఆ విశ్వవిద్యాలయం వ్యవహారాలలో ఇద్దరు కేబినెట్ మంత్రులు ఏబీవీపీ పక్షం వహించారని గమనిస్తే ఆయన ఆగ్రహించి ఉండేవారు. వేముల ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ఆయనే మొట్టమొదట ఆవేదనను, సహానుభూతిని వెల్లడించి ఉండేవారు. ఇక జేఎన్‌యూ విషయం లోనైతే... కుర్రాళ్లను మాట్లడనివ్వండి, వాళ్లే ఎదుగుతారు, రేపు ఐఏఎస్ క్యాడర్లో చేరుతారు అని సరిపెట్టుకునే వైఖరి చేపట్టేవారు. కశ్మీరీ సమస్యపై ప్రభుత్వం రాజ్యాంగ ప్రమాణాల ప్రాతిపదికపైనే మాట్లాడుతామని పట్టు బడుతుంటే తాము ఇక చర్చలు ఎలా జరుపుతామని కశ్మీర్ వేర్పాటువాదులు ప్రశ్నించినప్పుడు ఆయన ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకోండి. రాజ్యాంగం ఎందుకు, మీతో నేను మానవతావాద ప్రమాణాలతో మాట్లాడు తానని వాజపేయి అన్నారు. సంఘర్షణను పరిష్కరించే వైఖరంటే అదీ. ఇటీవల మనం చూస్తున్నది సంఘర్షణను తెచ్చిపెట్టే వ్యూహాల కోసం సాగిస్తున్న అన్వేషణగానే ఎక్కువగా కనిపిస్తోంది. శేఖర్ గుప్తా Twitter@ShekarGupta -
కన్హయ్యపై దాడి పోలీసుల వైఫల్యమే
ఎన్హెచ్ఆర్సీ నిజ నిర్ధారణ బృందం వెల్లడి న్యూఢిల్లీ: పటియాలా హౌజ్ కోర్టులో జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యపై దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ బృందం పేర్కొంది. రాజ్యాంగానికి విధేయుడనని కోర్టుకు తెలిపేలా కన్హయ్యపై పోలీసులు మానసికంగా ఒత్తిడి తీసుకువచ్చారని ఢిల్లీ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేసింది. కోర్టులో కన్హయ్య ఇచ్చిన వాంగ్మూలం ఆయన స్వచ్ఛందంగా ఇచ్చింది కాదని పేర్కొంది. పటియాలా కోర్టు హింసలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, విధి నిర్వహణలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించినట్లు స్పష్టంగా తెలుస్తోందని కమిటీ తేల్చిచెప్పింది. కన్హయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యుల భద్రత పైనా ఆందోళన వ్యక్తం చేసింది. నిజనిర్ధారణ బృంద నివేదికను ఎన్హెచ్ఆర్సీ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు, తిహార్ జైలు డీజీకి పంపించింది. ఎన్హెచ్ఆర్సీ కమిటీ గురువారం కన్హయ్యను తిహార్ జైళ్లో కలిసింది. కాగా, జేఎన్‌యూలో ప్రముఖ జర్నలిస్ట్ సాయినాథ్ విద్యార్థులకు జాతీయవాదంపై తరగతులు నిర్వహించారు. మరోపక్క.. జేఎన్‌యూ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశం వివావాదస్పదమైంది. సంయుక్త కార్యదర్శి, ఏబీవీపీ నేత సౌరభ్ శర్మ శుక్రవారం విద్యార్థి సంఘం భేటీని ఏర్పాటు చేసి పలు తీర్మానాలు చేశారు. వాటిలో జేఎన్యూకు అప్రతిష్ట తీసుకువచ్చిన విద్రోహ శక్తులను గుర్తించి, శిక్షించాలని, వర్సిటీలో ఇటీవలి ఘటనపై దర్యాప్తు జరపాలని, చట్టబద్ధ ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదనే తీర్మానాలు కూడా ఉన్నాయి. దీన్ని అతిపెద్ద వంచనగా విద్యార్థి సంఘం తాత్కాలిక అధ్యక్షురాలు షెహ్లా రషీద్ పేర్కొన్నారు. ఆ భేటీ నిబంధనలకు వ్యతిరేకమన్నారు. -
మోదీ మతోన్మాది: చాడ
హైదరాబాద్: దేశద్రోహం ఆరోపణల కింద అరెస్టు అయిన జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి కన్హయ్య కుమార్ ను విడుదల చేయాలంటూ సీపీఐ రాజ్ భవన్ ముట్టడికి యత్నించింది. శుక్రవారం ఉదయం సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చాడ మాట్లాడుతూ ప్రధాని మోదీ మతోన్మాది అని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం కరువైందన్నారు. కన్హయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
'నా ప్రాణానికి ముప్పు.. జైల్లో పెట్టండి'
న్యూఢిల్లీ: తన ప్రాణానికి ముప్పు పొంచివుందని జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్ ఆందోళన వ్యక్తం చేశాడు. తాను తప్పు చేస్తే జైల్లో పెట్టాలని, మీడియాలో తనకు వ్యతిరేకంగా వస్తున్న కథనాలకు అడ్డుకట్ట వేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన కుమార్ పై న్యాయవాదులు దాడి చేశారు. తనపై దాడి చేసిన లాయర్లను న్యాయస్థానంలో అతడు గుర్తించాడు. దేశ సమగ్రతపై తనకు నమ్మకం ఉందని కుమార్ హిందీలో ఒక ప్రకటన విడుదల చేశాడు. అతడు బెయిల్ కు దరఖాస్తు చేసుకుంటే వ్యతిరేకించబోమని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. కుమార్ కు కోర్టు మార్చి 2 వరకు కస్టడీ విధించడంతో అతడిని తీహార్ జైలుకు తరలించారు. పటియాలా కోర్టులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాత్రి 7 గంటలకు అతడిని జైలుకు తీసుకెళ్లారు. తీహార్ జైల్లో అతడికి 3వ నంబర్ సెల్ కేటాయించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా, ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణించాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. దీన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన అపాయింట్ మెంట్ కోరామని ట్విటర్ ద్వారా తెలిపారు. పటియాలా కోర్టులో చోటుచేసుకున్న ఘటనలపై మరోసారి నివేదిక కోరానని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. -
'షూట్ చేయండి... ఉరి తీయండి'
న్యూఢిల్లీ: 'అతడిపై మేము దాడికి పాల్పడ్డాం' అని జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్‌పై దాడిని చేసిన లాయర్లు గర్వంగా ప్రకటించుకున్నారు. రాజద్రోహం కేసు విచారణ కోసం బుధవారం పటియాలా హౌస్ కోర్టుకు తీసుకువచ్చిన కన్హయ్యపై న్యాయవాదులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. దాదాపు 200 మంది లాయర్లు అతడిని చుట్టుముట్టి నినాదాలు చేశారు. 'అతడిని కాల్చి చంపండి, ఉరి తీయండి' అంటూ పెద్ద ఎత్తున నినాదాలిచ్చారు. అక్కడితో ఆగకుండా అతడిపై దాడికి ప్రయత్నించారు. 'మా పని పూర్తయింది' అంటూ దాడి చేసిన లాయర్లు వ్యాఖ్యానించారు. న్యాయవాదుల దాడిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించలేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. జర్నలిస్టులు, విద్యార్థులపై సోమవారం దాడి చేసిన న్యాయవాదుల్లో చాలా మంది ఈ రోజు దాడి చేసిన వారిలో ఉన్నారని చెబుతున్నారు. లాయర్ల దాడిలో కన్హయ్య కుమార్(28)కు గాయాలయ్యాయని వార్తలు వస్తున్నాయి. పటియాలా హౌస్ కోర్టులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో శాంతి భద్రతలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఆరుగురు ప్రముఖ లాయర్లతో కూడిన బృందాన్ని పటియాలా కోర్టుకు పంపించింది. -
'విద్యార్థి సంఘం నేతను విడుదల చేయండి'
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ఏఐఎస్ఎఫ్ నాయకుడు కన్హయ్యకుమార్పై పెట్టిన కేసులు ఉపసంహరించి, అతణ్ని వెంటనే విడుదల చేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజాతో పాటు జేడీయూ నేత త్యాగి.. శనివారం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమై జేఎన్‌యూ వివాదంపై చర్చించారు. ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన కన్హయ్యకుమార్‌ను విడుదల చేయాలని రాజ్‌నాథ్‌ను కోరారు. అనంతరం వామపక్ష నేతలు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే ఏఐఎస్ఎఫ్ నేతను అరెస్ట్ చేశారని ఆరోపించారు. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డవారిని గుర్తించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్‌గురు ఉరితీతను తప్పుబడుతూ జేఎన్‌యూ క్యాంపస్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారనే ఫిర్యాదు మేరకు కన్హయ్యకుమార్పై ఢిల్లీ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరో 8 మంది విద్యార్థులను జేఎన్‌యూ బహిష్కరించింది.