డ్రగ్స్ ఇచ్చి.. విద్యార్థినిపై అత్యాచారం
దేశ రాజధానిలో మరో ఘోరం జరిగింది. ప్రతిష్ఠాత్మకమైన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఓ పీహెచ్‌డీ విద్యార్థినికి డ్రగ్స్ ఇచ్చి, హాస్టల్ గదిలోనే అత్యాచారం చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అన్మోల్ రతన్ అనే ఆ విద్యార్థి.. తాను చూడాలనుకుంటున్న సినిమా ఉందని మెసేజ్ ఇచ్చాడని, తనతో పాటు బ్రహ్మపుత్ర హాస్టల్‌కు రావాల్సిందిగా కోరాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అంతకుముందు ఆమె ఎవరిదగ్గరైనా ఆ సినిమా ఉందా అని ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టడంతో అతడు తన దగ్గర ఉందని చెప్పాడు. పెన్‌డ్రైవ్‌లోకి సినిమా కాపీ చేసుకోడానికి తాను అన్మోల్ రతన్ గదికి వెళ్లినప్పుడు అతడు తనకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చాడని బాధితురాలు ఫిర్యాదుచేసింది.
కాసేపటికే తాను స్పృహ కోల్పోయానని, తాను స్పృహలో లేనప్పుడే అతడు తనమీద అత్యాచారం చేశాడని తెలిపింది. తనకు మెలకు వచ్చిన తర్వాత గట్టిగా అరిచేందుకు ప్రయత్నించానని, కానీ రతన్ తన నోరు నొక్కేశాడని చెప్పింది. జరిగిన విషయం గురించి ఎవరికైనా చెబితే బాగోదంటూ ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్‌కు చెందిన అతడు బెదిరించాడు. ఎట్టకేలకు ఆమె వసంత్ కుంజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వాళ్లు 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్యపరీక్షలకు పంపారు. ఎఫ్ఐఆర్ దాఖలు కాగానే ఏఐఎస్‌ఏ రతన్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దుచేసింది.
అయితే ఈ వ్యవహారంపై తనకు ఫిర్యాదు ఏమీ రాలేదని జేఎన్‌యూ రిజిస్ట్రార్ ప్రమోద్ కుమార్ తెలిపారు. యూనివర్సిటీకి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, యూనివర్సిటీ సెక్యూరిటీ విభాగాన్ని కూడా తాను అడగ్గా వాళ్ల నుంచి ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు.