'నా ప్రాణానికి ముప్పు.. జైల్లో పెట్టండి'
న్యూఢిల్లీ: తన ప్రాణానికి ముప్పు పొంచివుందని జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్ ఆందోళన వ్యక్తం చేశాడు. తాను తప్పు చేస్తే జైల్లో పెట్టాలని, మీడియాలో తనకు వ్యతిరేకంగా వస్తున్న కథనాలకు అడ్డుకట్ట వేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన కుమార్ పై న్యాయవాదులు దాడి చేశారు. తనపై దాడి చేసిన లాయర్లను న్యాయస్థానంలో అతడు గుర్తించాడు. దేశ సమగ్రతపై తనకు నమ్మకం ఉందని కుమార్ హిందీలో ఒక ప్రకటన విడుదల చేశాడు.
అతడు బెయిల్ కు దరఖాస్తు చేసుకుంటే వ్యతిరేకించబోమని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. కుమార్ కు కోర్టు మార్చి 2 వరకు కస్టడీ విధించడంతో అతడిని తీహార్ జైలుకు తరలించారు. పటియాలా కోర్టులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాత్రి 7 గంటలకు అతడిని జైలుకు తీసుకెళ్లారు. తీహార్ జైల్లో అతడికి 3వ నంబర్ సెల్ కేటాయించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
కాగా, ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణించాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. దీన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన అపాయింట్ మెంట్ కోరామని ట్విటర్ ద్వారా తెలిపారు. పటియాలా కోర్టులో చోటుచేసుకున్న ఘటనలపై మరోసారి నివేదిక కోరానని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.