నన్ను చితక్కొట్టారు.. దుస్తులు ఊడదీశారు!
పోలీసుల ఎదుటే తీవ్రంగా కొట్టారు
♦ సుప్రీం కోర్టు విచారణ కమిటీకి చెప్పిన కన్హయ్య
♦ మీరుండగా దాడెలా జరిగింది?: మందలించిన సుప్రీం కమిటీ
న్యూఢిల్లీ: పటియాలా హౌస్ కోర్టు ఆవరణలో ఫిబ్రవరి 17న పోలీసుల ఎదుటే తనను విపరీతంగా కొట్టారని జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్.. సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన విచారణ కమిటీకి తెలిపారు. ‘ఫిబ్రవరి 15న పోలీసులు నన్ను కోర్టు ఆవరణలోకి తీసుకురాగానే లాయర్ల దుస్తుల్లో ఉన్న కొందరు నాపై దాడి చేశారు. అంతే కాదు పక్కనున్నవారినీ పిలిచారు. నన్ను కాపాడేందుకు ప్రయత్నించిన పోలీసులకూ దెబ్బలు తప్పలేదు’ అని చెప్పారు. తెలిపారు. తనపై దాడి పూర్తిగా రాజకీయ ప్రభావిత వ్యక్తులు చేసిన దాడేనని.. పటియాలా కోర్టులో జరిగిన ఘటనను విచారించాలంటూ సుప్రీం కోర్టు కపిల్ సిబల్‌తోపాటు ఆరుగురు లాయర్లతో ఏర్పాటు చేసిన కమిటీకి వెల్లడించారు.
17న జరిగిన ఘటనలో.. విచారణకు మరికొంత సమయం ఉన్నందున పక్కనున్న గదిలో వేచి చూస్తుండగా ఓ లాయరు వచ్చి తనను కొట్టారన్నారు. కోర్టు గది ద్వారం గుండా వచ్చిన లాయర్లు తనపై దాడిచేసి దర్జాగా వెళ్లిపోతున్నా పోలీసులు పట్టించుకోలేదనిని చెప్పారు. ‘నేను ఈ దేశపు యువకుడిని. నాకు రాజ్యాంగంపై గౌరవం ఉంది. దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడను. బయట కొందరు వ్యక్తులు నన్ను దేశ ద్రోహి అంటున్నారు. మీడియాలో ఓవర్గం నన్ను ద్రోహిగా ముద్రవేసింది’ అని పేర్కొన్నారు. దీంతో డీసీపీ జతిన్ నర్వాల్‌ను పిలిపించిన సిబల్..‘ఇంతమంది పోలీసులున్నా కన్హయ్యపై దాడి ఎలా జరగనిచ్చారు’ అని అడిగారు. ‘మీరిప్పుడు ఢిల్లీ పోలీస్ చీఫ్ బస్సీ కింద పనిచేయటం లేదన్నది గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలి’ అని డీసీపీకి లాయర్ల బృందం హెచ్చరించింది. తనపై దాడి చేసిన లాయర్, ఆ సమయంలో ఉన్న పోలీసులను గుర్తు పట్టగలరని కన్హయ్య తెలిపారు. జేఎన్‌యూ వివాదాన్ని ఉగ్రవాద వ్యతిరేక ప్రత్యేక సెల్‌కు బదిలీ చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. కాగా, ఫిబ్రవరి 9 జేఎన్‌యూలో వివాదాస్పద కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యార్థులు ఉమర్, అనిర్బన్ భట్టాచార్యల పోలీసు కస్టడీని మరో రెండ్రోజులపాటు పొడగిస్తున్నట్లు ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది.
స్మృతిపై విపక్షాల హక్కుల తీర్మానం
హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకేసుకు సంబంధించి పార్లమెంటులో మంత్రి స్మృతి ఇరానీ చెప్పిన విషయాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని విపక్షాలు మండిపడ్డాయి. ఇరానీపై హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్, సీపీఎం, జేడీయూ నిర్ణయించాయి.