సారీ చెప్పే కాలం కాదిది | sedition case against jnu student kanhaiya kumar | Sakshi
Sakshi News home page

సారీ చెప్పే కాలం కాదిది

Published Sat, Feb 20 2016 7:30 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM

సారీ చెప్పే కాలం కాదిది

సారీ చెప్పే కాలం కాదిది

జాతిహితం

జేఎన్‌యూ-కన్హయ్య-ఢిల్లీ పోలీసులు... సరిగ్గా 35 ఏళ్ల క్రితం నాటి భయా నకమైన 1981 రోజులను గుర్తుకు తెస్తున్నాయి. అప్పట్లో నేను, ఒకేసారి ఐదు చోట్ల తిరుగుబాట్లు చెలరేగుతున్న ఈశాన్యం వార్తా కథనాలను వెలువరిస్తూ ఉండే వాడిని. అధికారిక ప్రకటనల్లో జాతి వ్యతిరేక శక్తులు(ఏఎన్‌ఈ) అని మాత్రమే చెబుతూ తిరుగుబాటుదార్లను లేదా అజ్ఞాతంలో ఉన్నవారిని ఎంద రినైనా బంధించేవారు, విచారించేవారు, తరచుగా ఏదో ఒక పద్ధతిలో హత మార్చే వారు. రాజద్రోహ నేరం కేసు పెట్టడం అంటే మహా జంఝాటం, అంతకంటే ఇవన్నీ చేయడమే తేలిక. అయితే అది ఒక్కోసారి నమ్మశక్యం కానంతటి మూర్ఖత్వానికీ దారి తీసేది. అమాయక ప్రాణాలకు హానిని కలుగ జేయకపోతే అలాంటి సందర్భాలు గొప్ప హాస్యస్ఫోరకంగా కూడా ఉండేవి.
 

అలనాటి మంచిరోజుల కథ
ఆనాటి పరిస్థితుల్లో సైన్యం, పోలీసు, నిఘా విభాగాలలో పనిచేసేవారికి, విలేకరులకు మధ్య ఒక్కోసారి మైత్రీపూర్వకమైన, తరచుగా వైషమ్యపూరి తమైన అసాధారణ అనుబంధం ఉండేది. అయితే అనివార్యంగానే వారి మధ్య ఇచ్చిపుచ్చుకోవడం, సహకరించుకోవడం అనే అనుబంధం కూడా ఉండేది. ఈశాన్యంలో పనిచేసిన అత్యుత్తమ ఇంటెలిజెన్స్ అధికారులలో అజిత్ దోవల్ కాక, కోషీ కోషీ కూడా నాకు మిత్రులు.

 

తిరుగుబాటుకు వార్తల సేకరణ గురించి తెలిసిన వారెవరికైనా విలేకరులు, ఇంటెలిజెన్స్ అధికారులు వాస్తవాలను సరిపోల్చి చూసుకుంటారని తెలిసి ఉంటుంది. అలాగే మేమి ద్దరం తరచుగా మా నోట్స్‌ను ఇచ్చిపుచ్చుకుంటూ ఉండేవాళ్లం. మరీ ముఖ్యంగా ప్రమాదరహితమైన ఉబుసుపోక కబుర్లు చెప్పుకునే వాళ్లం. ఏ బంద్ రోజునో నేను ఆయన కార్యాలయానికి వెళుతుండేవాడిని లేదా ‘‘బౌద్ధ భిక్షువు’’కు (ఓల్డ్ మాంక్ రమ్‌కు  మేం పెట్టుకున్న పేరు) రోజువారీ నివాళు లర్పించడానికి కేపీఎస్ గిల్ ఇంట్లో సాయంకాలాలు కలుస్తూ ఉండేవాళ్లం.

 

ఒక సాయంత్రం మహా ఉద్వేగంగా కోషీ, నన్ను ఉన్న పళాన తన కార్యాలయానికి రమ్మని పిలిచారు. గొప్ప కథనం ఉందని, కల్నల్ ఎక్స్‌కు (సైనిక నిఘా విభాగంలో కోషీకి సమాన స్థాయి వారు) పెద్ద తీవ్రవాది దొరి కాడని, కాకపోతే ‘‘జాతి వ్యతిరేక శక్తులలో అతని హోదా’’ ఏమిటో కనిపెట్ట డానికి నా మేధస్సును ఉపయోగించాలన్నారు. అదేదో నన్ను అడగమని  ఆయనకు చెప్పారు. తామెన్నడూ విని ఉండని గ్రూపునకు చెందిన ఒక స్వయం ప్రకటిత నాగా లెఫ్టినెంట్ కల్నల్‌ను తమ కుర్రాళ్లు ‘‘పట్టుకు న్నార’’ని, కానీ తమ వద్ద ఉన్న జాబితాలో అతనెవరో గుర్తించలేకపోతు న్నామని ఆయన చెప్పారు.

 

ఆ తీవ్రవాది మాత్రం తాను సాల్వేషన్ ఆర్మీ (పేదల సంక్షేమానికి కృషి చేసే క్రైస్తవ సంస్థ) లాంటి ఏదో గ్రూపునకు చెందినవాడినని పదేపదే చెబుతున్నాడన్నారు. దీంతో, సిరియన్ క్రిస్టియన్ ఆయిన కోషీ నిస్సహాయమైన ఓ నవ్వు నవ్వి, సదరు కల్నల్‌కు ఆ సాల్వేషన్ ఆర్మీ ఎంత నిరపాయకరమైనదో వివరించి,  నిర్భాగ్యుడైన ఆ దైవ సైనికునికి క్షమాపణలు చెప్పి తక్షణమే విడుదల చేయమని చెప్పారు. తర్వాత ఓ గంటకల్లా ఆ పని జరిగిపోయింది. జీవితాంతం ఇతరులకు చెప్పాల్సిన కథగా అది మిగిలిపోయింది. అయితే, అవి మంచిరోజులు కాబట్టి అంత సమస్యాత్మక ప్రాంతంలోనూ ఆ కథ వెంటనే మర్యాదకరమైన, తార్కికమైన ముగింపునకు వచ్చేసింది.

 

నేటి హాస్యాస్పద గాథ

కన్హయ్య కుమార్ అరెస్టు విషయంలో జరిగింది కూడా సరిగ్గా అలాం టిదే, అంతగానూ హాస్యాస్పదమైనదే. కాకపోతే ప్రభుత్వమో లేదా కోర్టులో అతనిని విడుదల చేయమని చెప్పేవరకు వేచి ఉండాల్సి ఉంటుంది. హఫీజ్ సయీద్ పేరిట వెలువడ్డ ఒక నకిలీ ట్వీట్ , దేశంలోనే అత్యుత్తమమైన ఢిల్లీ పోలీసు యంత్రాంగాన్ని చవటాయలను చేసింది. అంతకంటే మరింత నకిలీ వీడియో దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఎన్నుకున్న అధ్యక్షునిపై రాజద్రోహ నేరం అభియోగాన్ని మోపేలా చేసింది. రాజద్రోహం అంటే దేశంపై యుద్ధం చేయడమని అర్థం. ఇప్పుడు, ఆయన్ను ఏం చేయాలో వాళ్లకు అర్థం కావడం లేదు.

 

సామాజిక, సంప్రదాయక మీడియాలో ఢిల్లీ పోలీసు అధినేత సహా అత్యున్నత స్థాయిలలోని వారంతా కన్హయ్య దేశద్రోహా నికి పాల్పడ్డాడని చెప్పారు. కాబట్టి, గువాహతిలో నాడు సైనిక కల్నల్ ‘సారీ’ చెప్పి ఆ అభాగ్యుడ్ని వదిలి పెట్టేసినంత తేలిక వ్యవహారం కాదిది. పైగా అది దయాదాక్షిణ్యాలున్న కాలం. కాగా, నేడు మనం దేశ మస్తిష్కాన్ని సన్నీ డియో లైజేషన్ (దేశభక్తి అంటూ రంకెలేయడం) చేస్తున్న కాలంలో ఉన్నాం.

ఈ సంస్కృతి నేడు నగ్నంగా నర్తిస్తోంది. కాబట్టి రోహిత్ వేముల ఆత్మహత్యపై వచ్చిన ఒత్తిడికి గురై ఉన్నప్పుడు, మొదట అతను దళితుడు కాదంటూ దాటవేయాలని చూసి, ఆ మీదట మొత్తం చర్చనంతా కులం మీదకు మరల్చారు. తర్వాత జేఎన్‌యూపై దాడితో చర్చను జాతీయవాదం కొరవడటంపైకి తిప్పారు. వామపక్ష చింతనకు కేంద్రంగా ఉన్న జేఎన్ యూలో గత పలు సంవత్సరాలుగా  వామపక్ష విద్యార్థి సంఘాలకు, అఖిల భారత విద్యార్థి పరిషత్ వంటి మితవాద విద్యార్థి సంఘాలకు మధ్య సంఘ ర్షణ పెరుగుతోంది.

 

ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎప్పుడు చూసినా విస్పష్ట రాజకీయాలు, భావజాల సంఘర్షణ దర్శనమిస్తూ ఉంటాయి. వాటిలోకెల్లా నాకు ఇష్టమైన పెద్ద గోడ చిత్రం... అటూ ఇటూ మార్క్స్, లెనిన్‌లూ మధ్య భగత్‌సింగ్ ఉన్నది. అది ఇప్పటికీ అక్కడే ఉన్నా ఎన్నడూ హింసకు దారితీయలేదు. భావజాల ఘర్షణ ఉన్నా ఆ విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమ విద్వద్వంతులను తయారుచేసింది. ఈ మేధోపరమైన, భావజాలపరమైన ఘర్షణా అందుకు కారణమూ అయి ఉండవచ్చు. బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలోకి రావడంతో ఏబీవీపీ కూడా కాంగ్రెస్ అంతగానూ అసహనంగా తయారైంది. ప్రధానంగా వామపక్ష భావాల సానుభూతిపరులపట్ల అది అసహనంతో ఉంది.
 

ప్రియుడు కొత్వాలయితే...
ప్రభుత్వాధికారాన్ని ఉపయోగించుకుని ఎక్కువగా ‘‘వామపక్షీకరణ’’ చెందిన విశ్వవిద్యాలయాలపై ఏబీవీపీ ఆధిపత్యాన్ని సాధించాలని కోరుకుంటోంది. ‘ప్రియుడు కొత్వాలయితే (పోలీసు కమిషనర్) ఎవరైతే నాకేం లెక్క’ అన్నట్టు (హిందీ మాట్లాడే దేశ ప్రధాన భూభాగంలో ప్రాచుర్యంలో ఉన్న నానుడి) వ్యవహరిస్తోంది. హైదరాబాద్‌లోనూ, జేఎన్‌యూలోనూ ప్రభుత్వం దురదృష్టవశాత్తూ పక్షపాతియైన కొత్వాల్‌లా వ్యవహరిస్తోంది. ఫలితం ఒక దళిత విద్యార్థి విగత జీవి కావడం, పేద కుటుంబానికి చెందిన మరో విద్యార్థి కటకటాల పాలవడం.

 

ఇంతా జరిగాక ఇప్పుడు వాళ్లకు ఏం చేయాలో తోచడం లేదు. మేం గందరగోళపడ్డామంటూ సారీ చెప్పాలి. లేదంటే ఎవరినో తప్పుపట్టి బలిపశువును చేసి, ఇతరుల సంగతి మరచిపోయి కన్హయ్యను విడుదల చేయాలి. అయితే అది హైదరాబాద్ తర్వాత వరుసగా రెండో ఓటమిని అంగీకరించినట్టవుతుంది. లేదంటే, రాజద్రోహ నేరానికి అతనిపై విచారణ జరిపించినట్టయితే ఉదారంగా పెద్ద వివాదాన్ని రాజేసినట్టవుతుంది. మొత్తా నికి కాస్త త్వరగానో లేక ఆలస్యంగానో ఏదో ఒక కోర్టు ఆయన్ను విడుదల చేయక తప్పదు. ప్రత్యేకించి రాజద్రోహ నేరం నిలిచే అవకాశం లేదు. ఏం చేసినా కన్హయ్య పొలిటికల్ స్టార్ అయిపోతాడు. కాబట్టి బీజేపీకి ఎంచుకోవ డానికి ఉన్న అవకాశాలు సరళమైనవే. 
 

ఇప్పుడిక వినమ్రంగా తప్పును అంగీకరించి  నష్టాలను తగ్గించుకోవడం చేయాలి. లేదా సమర్థించుకోడానికి వీలే లేని దాని కోసం పోరాడి చివరికి అన్ని తప్పులకూ కలిసి ఒకేసారి లెంపలు  వేసుకోవాల్సి ఉంటుంది. ఓపీ శర్మ లాంటి వాళ్లు విద్యార్థులను చితక బాదుతుంటే, పదవీ విరమణ చేయనున్న పోలీసు బాసులు వారికి రక్షణ కల్పించ నిరాకరించడాన్ని చూస్తుంటే... ఛాంద సులైన మామలు చెప్పినట్టు వినని పిల్లలపై యుద్ధం ప్రకటించినట్టుంది. పెద్దలకు, యువతరానికి మధ్య పోరాటం చివరకు అనివార్యంగా ఎలా ముగుస్తుందో మానవజాతి చరిత్ర బోధిస్తోంది.
 

వాజపేయి అయితే ఏం చేసేవారు?
ఒక మంచి ఆలోచన చెబుతా. సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు, ప్రత్యేకించి బీజేపీ ప్రభుత్వం అమలు చేయాల్సినది అది. మీరు చేస్తున్న చర్యలను వాజపేయి కొలబద్దతో పరీక్షించి చూసుకోవడం. ఈ పరిస్థితిలో అటల్ బిహారీ వాజపేయి అయితే ఎలా వ్యవహరించి ఉండేవారని యోచించండి. అప్పుడు మీ ముందు ఎంచుకోవడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. అవి ఆయన వారసుల ప్రభుత్వం అనుసరిస్తున్న వాటికంటే పూర్తిగా భిన్నమైనవై ఉంటాయి.

 

1997 మొదట్లో, బీజేపీ-అకాలీదళ్ కూటమి అప్పుడే  పంజాబ్‌లో అధికారంలోకి వచ్చింది (నేటి బీజేపీ-పీడీపీ కూటమిలాగా అందుకు కూడా నాడు అవకాశం లేదనే అనిపించింది). భింద్రన్‌వాలా అనుకూల అవాంఛ నీయ పరిణామాలు బద్దలై, స్వర్ణ దేవాలయానికీ వ్యాపించాయి. పంజాబ్ ఉగ్రవాదాన్ని సన్నిహితంగా పరిశీలించిన నేను బెంబేలెత్తిపోయాను. నేన ప్పుడు సంపాదకునిగా ఉన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక  ఆ పరిణామాలపై తీవ్ర దాడిని ప్రారంభించింది. అప్పటికింకా కేంద్రంలో ప్రతిపక్షంగానే ఉన్న బీజేపీ, అకాలీదళ్‌తో మైత్రిని  పునరాలోచించాలని సైతం కోరింది. ఒకరోజు మధ్యాహ్నం,  తన నివాసానికి రావాలని వాజపేయి నాకు కబురంపారు. అద్వానీ, మదన్‌లాల్ ఖురానాలు కూడా అక్కడున్నారు. తేనీరు సేవిస్తూ వాజపేయి నాకు ఉపన్యాసం ఇచ్చారు.

 

‘హిందువులు, సిక్కులు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు’ పంజాబ్‌లో గొంతులపైకి కత్తులు దూసుకుంటు న్నారు. సిక్కు మిలిటెంట్లు బీజేపీ నేతలను హతమారుస్తున్నారు. ఇప్పుడు బీజేపీ, అకాలీదళ్ చేతులు కలపడం పంజాబ్‌కు, భారత్‌కు మంచిదా, కాదా? పెద్దగా లెక్కచేయాల్సిన అవసరంలేని ఈ చికాకులను మనం విస్మరించాలి. సంపాదకులవారూ, మీరు కాస్త పరిణతి సాధించాలండీ! అన్నారు. ఈ పరిణామాలు అదుపు తప్పిపోతే ఏం జరుగుతుంది? ఆ చికాకులు కలిగిస్తున్న వారు అకాలీల మీద ఆధారపడటం లేదా? అని నేనడిగాను. ఆ విషయాలన్నీ ‘‘ఖురానా జీ చూసుకుంటారు... ఈ సమస్యలను పరిష్కరించగల దృఢ సంకల్పం ఆయనకుంది’’ అని బదులిచ్చారు.
 

 ఆయనైతే హైదరాబాద్ ఉదంతంతో ఎలా వ్యవహరించేవారో ఆలోచిం చించి చూడండి. ఆ విశ్వవిద్యాలయం వ్యవహారాలలో ఇద్దరు కేబినెట్ మంత్రులు ఏబీవీపీ పక్షం వహించారని గమనిస్తే ఆయన ఆగ్రహించి ఉండేవారు. వేముల ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ఆయనే మొట్టమొదట ఆవేదనను, సహానుభూతిని వెల్లడించి ఉండేవారు. ఇక జేఎన్‌యూ విషయం లోనైతే... కుర్రాళ్లను మాట్లడనివ్వండి, వాళ్లే ఎదుగుతారు, రేపు ఐఏఎస్ క్యాడర్‌లో చేరుతారు అని సరిపెట్టుకునే వైఖరి చేపట్టేవారు.

 

కశ్మీరీ సమస్యపై ప్రభుత్వం రాజ్యాంగ ప్రమాణాల ప్రాతిపదికపైనే మాట్లాడుతామని పట్టు బడుతుంటే తాము ఇక చర్చలు ఎలా జరుపుతామని కశ్మీర్ వేర్పాటువాదులు ప్రశ్నించినప్పుడు ఆయన ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకోండి. రాజ్యాంగం ఎందుకు, మీతో నేను మానవతావాద ప్రమాణాలతో మాట్లాడు తానని వాజపేయి అన్నారు. సంఘర్షణను పరిష్కరించే వైఖరంటే అదీ. ఇటీవల మనం చూస్తున్నది సంఘర్షణను తెచ్చిపెట్టే వ్యూహాల కోసం సాగిస్తున్న అన్వేషణగానే ఎక్కువగా కనిపిస్తోంది.  

శేఖర్ గుప్తా

Twitter@ShekarGupta

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement