'షూట్ చేయండి... ఉరి తీయండి'
న్యూఢిల్లీ: 'అతడిపై మేము దాడికి పాల్పడ్డాం' అని జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్‌పై దాడిని చేసిన లాయర్లు గర్వంగా ప్రకటించుకున్నారు. రాజద్రోహం కేసు విచారణ కోసం బుధవారం పటియాలా హౌస్ కోర్టుకు తీసుకువచ్చిన కన్హయ్యపై న్యాయవాదులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. దాదాపు 200 మంది లాయర్లు అతడిని చుట్టుముట్టి నినాదాలు చేశారు.
'అతడిని కాల్చి చంపండి, ఉరి తీయండి' అంటూ పెద్ద ఎత్తున నినాదాలిచ్చారు. అక్కడితో ఆగకుండా అతడిపై దాడికి ప్రయత్నించారు. 'మా పని పూర్తయింది' అంటూ దాడి చేసిన లాయర్లు వ్యాఖ్యానించారు. న్యాయవాదుల దాడిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించలేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. జర్నలిస్టులు, విద్యార్థులపై సోమవారం దాడి చేసిన న్యాయవాదుల్లో చాలా మంది ఈ రోజు దాడి చేసిన వారిలో ఉన్నారని చెబుతున్నారు.
లాయర్ల దాడిలో కన్హయ్య కుమార్(28)కు గాయాలయ్యాయని వార్తలు వస్తున్నాయి. పటియాలా హౌస్ కోర్టులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో శాంతి భద్రతలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఆరుగురు ప్రముఖ లాయర్లతో కూడిన బృందాన్ని పటియాలా కోర్టుకు పంపించింది.