న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ఏఐఎస్ఎఫ్ నాయకుడు కన్హయ్యకుమార్‌పై పెట్టిన కేసులు ఉపసంహరించి, అతణ్ని వెంటనే విడుదల చేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజాతో పాటు జేడీయూ నేత త్యాగి.. శనివారం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమై జేఎన్యూ వివాదంపై చర్చించారు. ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన కన్హయ్యకుమార్‌ను విడుదల చేయాలని రాజ్నాథ్ను కోరారు.
అనంతరం వామపక్ష నేతలు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే ఏఐఎస్ఎఫ్ నేతను అరెస్ట్ చేశారని ఆరోపించారు. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డవారిని గుర్తించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్‌గురు ఉరితీతను తప్పుబడుతూ జేఎన్‌యూ క్యాంపస్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారనే ఫిర్యాదు మేరకు కన్హయ్యకుమార్పై ఢిల్లీ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరో 8 మంది విద్యార్థులను జేఎన్యూ బహిష్కరించింది.
'విద్యార్థి సంఘం నేతను విడుదల చేయండి'
Published Sat, Feb 13 2016 1:17 PM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM
Advertisement