ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిజ నిర్ధారణ బృందం వెల్లడి
న్యూఢిల్లీ: పటియాలా హౌజ్ కోర్టులో జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యపై దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ బృందం పేర్కొంది. రాజ్యాంగానికి విధేయుడనని కోర్టుకు తెలిపేలా కన్హయ్యపై పోలీసులు మానసికంగా ఒత్తిడి తీసుకువచ్చారని ఢిల్లీ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేసింది. కోర్టులో కన్హయ్య ఇచ్చిన వాంగ్మూలం ఆయన స్వచ్ఛందంగా ఇచ్చింది కాదని పేర్కొంది. పటియాలా కోర్టు హింసలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, విధి నిర్వహణలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించినట్లు స్పష్టంగా తెలుస్తోందని కమిటీ తేల్చిచెప్పింది.
కన్హయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యుల భద్రత పైనా ఆందోళన వ్యక్తం చేసింది. నిజనిర్ధారణ బృంద నివేదికను ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు, తిహార్ జైలు డీజీకి పంపించింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ కమిటీ గురువారం కన్హయ్యను తిహార్ జైళ్లో కలిసింది. కాగా, జేఎన్‌యూలో ప్రముఖ జర్నలిస్ట్ సాయినాథ్ విద్యార్థులకు జాతీయవాదంపై తరగతులు నిర్వహించారు. మరోపక్క.. జేఎన్‌యూ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశం వివావాదస్పదమైంది. సంయుక్త కార్యదర్శి, ఏబీవీపీ నేత సౌరభ్ శర్మ శుక్రవారం విద్యార్థి సంఘం భేటీని ఏర్పాటు చేసి పలు తీర్మానాలు చేశారు. వాటిలో జేఎన్‌యూకు అప్రతిష్ట తీసుకువచ్చిన విద్రోహ శక్తులను గుర్తించి, శిక్షించాలని, వర్సిటీలో ఇటీవలి ఘటనపై దర్యాప్తు జరపాలని, చట్టబద్ధ ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదనే తీర్మానాలు కూడా ఉన్నాయి. దీన్ని అతిపెద్ద వంచనగా విద్యార్థి సంఘం తాత్కాలిక అధ్యక్షురాలు షెహ్లా రషీద్ పేర్కొన్నారు. ఆ భేటీ నిబంధనలకు వ్యతిరేకమన్నారు.
కన్హయ్యపై దాడి పోలీసుల వైఫల్యమే
Published Sat, Feb 20 2016 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM
Advertisement