కన్పించకుండా పోయిన జెఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ‍్మద్ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ‘చౌకీదార్’(కాపలదారు) ప్రచారాన్ని ఉదృతం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్యాంపెయిన్ పట్ల సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం కన్పించకుండా పోయిన ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ తల్లి ఫాతిమా నఫీస్ మోదీని ఉద్దేశించి ‘కాపలాదారు నా కుమారుడు ఎక్కడ’ అంటూ ప్రశ్నించారు. యూనివర్సిటీ హస్టల్‌లో ఉంటున్న నజీబ్ మూడు సంవత్సరాల క్రితం అనుమానాస్పద రీతిలో మాయమయ్యాడు. ఈ కేసును పరిష్కరించేందుకు ఢిల్లీ హై కోర్టు సిట్‌ను కూడా నియమించింది. కానీ ఇప్పటి వరకూ అతని ఆచూకీ లభించలేదు.
నజీబ్ తల్లి ఫాతిమా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘కాపలాదారుగా చెప్పుకుంటున్నావ్ కదా.. మరి నా కుమారుడు నజీబ్ ఎక్కడ. తను కనిపించకుండా పోవడానికి కారణమైన ఏబీవీపీ అవివేకులను ఇంతవరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదు. నా బిడ్డను వెతకడంలో మూడు అత్యున్నత శాఖలు ఎందుకు విఫలం చెందాయి’ అంటూ ‘#WhereIsNajeeb’ అనే హాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు ఫాతిమా. చదవండి.. (పేరుకు ముందు ‘చౌకీదార్’)
27 ఏళ్ల నజీబ్ అహ్మద్ ఢిల్లీ జేఎన్‌యూలో బయో టెక్నాలజీ చదవుతున్నాడు. ఈ క్రమంలో 2016, అక్టోబర్ 15న నజీబ్‌కు, ఏబీవీపీ విద్యార్థులకు మధ్య చిన్న వివాదం చోటుచేసుకుంది. ఆ తరువాత నుంచి నజీబ్ కనిపించకుండా పోయాడు. దాంతో ఫాతిమా 9 మంది విద్యార్థుల మీద ఫిర్యాదు చేశారు. అంతేకాక ఆమె అభ్యర్థన మేరకు ఢిల్లీ హై కోర్టు ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సిట్‌ను కూడా నియమించింది. కానీ ఇప్పటివరకూ నజీబ్ ఆచూకీ తెలియలేదు. ఈ కేసు విషయంలో సీబీఐ కూడా ఎటువంటి పురోగతి సాధించలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment