బాబుకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు | citu fires on chandrababau naidu | Sakshi
Sakshi News home page

బాబుకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు

Published Fri, Sep 23 2016 10:53 PM | Last Updated on Sat, Jul 28 2018 3:21 PM

బాబుకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు - Sakshi

బాబుకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు

అనంతపురం అర్బన్‌ : ‘అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని, కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని సీఐటీయూ చేపట్టిన నిరాహార దీక్ష సభలో రాజకీయ నాయకులు ధ్వజమెత్తారు. రావతార్‌ మసాలా ఫ్యాక్టరీలో తొలగించిన 183 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ ఆద్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష   శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరింది. దీక్షకు సంఘీభావంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి హరినాథ్‌రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

సభకు సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ అధ్యక్షత వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ చంద్రబాబు నేతత్వంలోని అత్యంత దుర్మార్గ పాలన కొనసాగుతోందన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాలను అణచివేసందుకు సిద్ధపడుతోందన్నారు. రావతార్‌ ఫ్యాక్టరీలో తొలగించిన కార్మికులకు అండగా నిలివాల్సిన ప్రజాప్రతినిధుల యాజమాన్యానికి తొత్తులుగా మారారన్నారు. సమస్యను పరిష్కరించాల్సిన కలెక్టర్, ఎస్పీ కూడా అధికార పార్టీ నేతలకు వంత పాడుతున్నారని మండిపడ్డారు. కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే రాయలసీమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు.

ఎమ్మెల్యే విశ్శేశ్వరరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరుస్తున్నారన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు అహంకారంతో పాలన సాగిస్తూ అన్ని వర్గాలను చులకన భావంతో చూస్తున్నారని దుమ్మెత్తిపోశారు. 1000 మందికి ఉపాధి కల్పించే ఒక్క పరిశ్రమా కూడా ఈ రెండేళ్లలో ఏర్పాటు కాలేదన్నారు. ఇలాంటి వంచక ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి హరినాథ్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చేసేది అభివద్ధి కాదు, వినాశనమన్నారు. సూట్లు వేసుకుని సూట్‌ కేసులు పట్టుకున్న వారే ఆయనకు కనిపిస్తారని ఎద్దేవా చేశారు.

సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, రాయలసీమ సబ్‌ కమిటీ కన్వీనర్‌ జి.ఓబుళు, సీపీఐ ఎంఎల్‌ జిల్లా కార్యదర్శి సి.పెద్దన్న, సీఐటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింగరావు, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర నాయకులు లలితమ్మ, అమర్‌నాథ్, డీసీసీ అధ్యక్షుడు కోటాసత్యనారాయణ, వైఎస్‌ఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్పపాడు హుసేన్‌పీరా, జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కేవీరమణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, ఆర్‌ఎస్‌పీ బాషా, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదరిశ ఉపేంద్ర, వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు రంగపేటగోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొని మాట్లాడారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement