నేరగాళ్ల ట్రా'కింగ్'
సాక్షి, సిటీబ్యూరో: నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చోరీలు చేసిన ఓ నిందితుడు ఖమ్మంలో పోలీసులకు పట్టుబడ్డాడు... ఆ విషయం హైదరాబాద్ పోలీసులకు తెలియకపోవడంతో ఇక్కడి కేసులు పెండింగ్‌లోనే ఉండిపోతాయి.
► రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్న ఓ నేరగాడు వరంగల్ పోలీసులకు చిక్కి కొన్ని రోజుల తర్వాత అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ విషయం సిటీ పోలీసులకు తెలియకపోతే అతడి ‘స్వైర విహారం’ కొనసాగుతుంది.
► సిటీలో ఓ నేరం జరిగిన వెంటనే అలాంటి నేరాలు చేసే మోడెస్ ఆపరెండీ (ఎంఓ) క్రిమినల్స్ ఏఏ జిల్లాల్లో ఉన్నారో తెలుసుకోవడానికి అయ్యే ఆలస్యం నిందితుడికి కలిసి వస్తుంది.
ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కారంగా, నేరాల దర్యాప్తును వేగవంతం చేయడానికి ఉద్దేశించిందే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టం (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్టు. దీన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సి ఉండగా... అనేక కారణాల నేపథ్యంలో ఆలస్యమవుతోంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న సిటీ పోలీసులు చొరవ తీసుకున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలను అనుసంధానిస్తూ సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.
‘ముంబై ఎటాక్స్’ తర్వాత పుట్టిన ఆలోచన...
ముంబై ఎటాక్స్‌గా పిలిచే 2008 నాటి 26/11 దాడుల తరవాత కేంద్ర ప్రభత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రూ.రెండు వేల కోట్ల అంచనా వ్యయంతో 2009లో ప్రారంభించిన దీన్ని 2012 నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే దీని అమలుకు అప్పటికే ఉన్న క్రిమినల్స్, క్రైమ్ రికార్డుల్ని డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో బీహార్, రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాలు వెనుకబడటంతో ప్రాజెక్టు అమలు ఆలస్యమవుతోంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై సిటీ పోలీసు విభాగం దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసుస్టేషన్లు, ప్రత్యేక విభాగాలను ఒక్కతాటి పైకి తీసుకువచ్చి, అనుసంధానించింది.
ప్రాజెక్టు లేకపోవడంతో సమస్యలెన్నో...
ప్రస్తుతం ఓ జిల్లా/కమిషనరేట్ పరిధిలో అధికారులకు చిక్కిన, వాంటెడ్‌గా ఉన్న నేరగాళ్ళ వివరాలు పక్క జిల్లా/కమిషనరేట్ వారికీ పూర్తిగా తెలియని పరిస్థితి ఉంది. పాత నేరగాళ్ళు, వాంటెడ్ క్రిమినల్స్ డేటాబేస్‌లు అందరికీ అం దుబాటులో లేకపోవడమే దీనికి కారణం. ఫలితంగానే ఓ ప్రాంత పోలీసులకు వాంటెడ్‌గా ఉన్న అనేక మంది కరుడుగట్టిన నేరగాళ్ళు మరో ప్రాంత పోలీసులకు చిన్న చిన్న కేసు ల్లో చిక్కినా గత చరిత్ర వెలుగులోకి రాని కారణంగా తేలిగ్గా బెయిల్ పొంది బయటకు రావడంతో పాటు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అంతర్ జిల్లా నేరగాళ్ళు చేసే అనేక సొత్తు సంబంధ నేరాలు కొలిక్కి రావట్లేదు.
విభాగాల సమన్వయానికి ఓ వేదికగా...
సిటీలో సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు అమలుకు నిర్ణయించిన నగర పోలీసులు తమ వద్ద ఉన్న సమాచారాన్ని డిజిటలైజ్ చేశారు. దాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ సైతం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన జిల్లాలను సైతం వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్) ద్వారా అనుసంధానించారు. ఈ సర్వర్‌లోని సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు తమ ట్యాబ్‌్సలోనూ చూసుకునేలా ఏర్పాటు చేశారు. దీంతో ఎఫ్‌ఐఆర్ నుంచి చార్‌్జషీట్ వరకు ప్రతి అంశమూ అందరికీ అందుబాటులోకి వచ్చింది. కోర్టు కానిస్టేబుళ్ళకు సైతం ట్యాబ్స్ ఇవ్వడం ద్వారా కేసుల సమాచారాన్ని అప్‌డేట్ చేయించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
జైల్ రిలీజ్ అలర్ట్స్ సైతం...
దీంతో ఓ నేరం జరిగిన వెంటనే ఈ తరహా నేరాలు ఇంకా ఎక్కడైనా జరిగాయా?ఎవరు చేస్తారు?వారు ప్రస్తుతం ఎక్క డ ఉన్నారు? అనే అంశాలను క్షణాల్లో తెలుసుకునే ఆస్కా రం ఏర్పడింది. రాష్ట్ర, జిల్లా, నగరాల స్థాయిల్లోని క్రైమ్ రికారŠడ్స్ బ్యూరోలో ఉన్న పాత నేరగాళ్ళ వేలి ముద్రలు సైతం వీపీఎన్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. మరోపక్క ఈ ప్రాజెక్టులో జైళ్ళ శాఖను సైతం అనుసంధానిం చారు. ఫలి తంగా ప్రతి రోజూ జైళ్ళ నుంచి విడుదలవుతున్న వారి వివరాలు వచ్చి చేరుతున్నాయి.
వీటి ఆధారంగా జైల్ రిలీజ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఓ నేరగాడు శిక్ష పూర్తి చేసుకుని /బెయిల్‌పై విడుదలైన వెంటనే ఆ సమాచారం అతడు నేరాలు చేసే, నివసించే, వాంటెడ్‌గా ఉన్న పోలీసుస్టేషన్లతో పాటు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సీసీఎస్,టాస్క్‌ఫోర్స్ వంటి ప్రత్యేక విభాగాలకు సందేశాల రూపంలో వచ్చి చేరుతుంది. దీంతో అతడిపై నిఘా ఉంచడానికి ఆస్కారం ఏర్పడుతుంది.