రాసేవాడిపైనే విచారణ | cm chandrababu clarifies on capital land grabings | Sakshi
Sakshi News home page

రాసేవాడిపైనే విచారణ

Published Mon, Mar 7 2016 2:50 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

రాసేవాడిపైనే విచారణ - Sakshi

రాసేవాడిపైనే విచారణ

అప్పుడే భయం ఉంటుంది.. రాసేవాడికి, క్రిమినల్‌కి ఒకటే చట్టం: సీఎం చంద్రబాబు
* మీరేదో రాస్తే.. ప్రభుత్వం విచారణ చేయించాలా?
* రాతలు నిరూపించాల్సిన బాధ్యత విలేకరులదే
* లింగమనేని పూలింగ్‌లో భూములు ఇస్తానంటే వద్దన్నా
* మా నేతలు సొంత డబ్బుతో కొంటే తప్పేంటి?
* హాయ్‌ల్యాండ్ ప్రస్తుతం సీబీసీఐడీ జప్తులో ఉంది
* లోకేశ్ భూములు కొట్టేశారనడంలో వాస్తవం లేదు
* అమరావతికి రావొద్దంటూ విదేశీ ప్రతినిధులకు
* విపక్ష నేత జగన్ ఈ-మెయిల్స్ పంపారు


 సాక్షి, హైదరాబాద్
 వార్తలు రాసే విలేకరులను ప్రాసిక్యూట్ చేస్తామని, రాసేవాడికి.. నేరం చేసిన వాడికి చట్టం ఒకటేనని ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సమాచారం తెచ్చివ్వమంటేనే మీడియాకు భయం ఉంటుందని, అప్పుడే ఒళ్లు దగ్గరపెట్టుకుని రాస్తారని విలేకరులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి బయటపెట్టిన ‘రాజధానిలో భూ దురాక్రమణ’పై విచారణ కమిషన్ వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆదివారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భూదందాపై వార్తలు రాసిన విలేకరులే వాటిని నిరూపించాలని, ఇష్టప్రకారం వార్తలు రాస్తే విలేకరులను ప్రాసిక్యూట్ చేస్తామన్నారు. బ్రాండ్ ఇమేజిని దెబ్బతినే విధంగా రాస్తూ, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. కడిగిన ముత్యంలాగా బయటకు రావడానికి భూదందాపై విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తారా? అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి ఆగ్రహంతో ఊగిపోయారు.

‘మీరేదో చేసేసి.. కడిగిన ముత్యం లాగా రావాలని ఎవరు చెప్పారయ్యా? నీదగ్గర సమాచారం ఉంటే ఇవ్వు. లేదంటే నిన్ను ప్రాసిక్యూట్ చేస్తాం. రాస్తున్న వారికి ఒకటే చట్టం.. నేరం చేసిన వాడికీ ఒకటే చట్టం. రాసేవాడు ప్రివిలేజ్డ్ కాదు. నువ్వు ఒకటి రాశావు కాబట్టి.. రాసిన వారి మీద విచారణ చేపట్టాలి అంటే.. నిరూపించమని అడుగుతాం. మొత్తం సమాచారం తెచ్చివ్వమని అడగాలి. అప్పుడు మీడియాకు భయం ఉంటుంది. ఒళ్లు దగ్గరపెట్టుకొని రాస్తారు. మీరు రాశారని అందరినీ విచారించాలా? కడిగిన ముత్యంలాగా, ఆణిముత్యంలాగా ప్రభుత్వం రావాలా? ప్రభుత్వానికి ఇదే పనా? ప్రభుత్వం పనిచేయాలా? వద్దా? ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని పని చేస్తుంటే.. ప్రజలకు నష్టం. ప్రభుత్వం పరిపాలన చేయాలా? లేక విచారణలు చేస్తూ కూర్చోవాలా? ఎవరైనా బాధ్యతగా రాయాలి. రాసినప్పుడు నిరూపించాలి. బాధ్యత లేకుండా రాస్తుంటాం.. టీవీల్లో వేస్తుంటాం.. అంటే కరెక్ట్ కాదు. ఒక పత్రిక స్వార్థంతో కొన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు. భూమితో రైతులకు అటాచ్‌మెంట్ ఉంటుంది. రాష్ట్రం బాగుపడుతుందని పూలింగ్‌లో భూములు ఇచ్చారు. వారికి ఇప్పుడు బాధ కలుగుతోంది** అంటూ మండిపడ్డారు. సాక్షి ప్రస్తుతం ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉందని, అది ప్రభుత్వ ఆస్తి అని పునరుద్ఘాటించారు.

 అవును.. కొన్నారు.. నిజమే
 రాజధాని ప్రాంతంలో వేమూరి రవికుమార్, సుజనా చౌదరి, మురళీమోహన్, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర భూములు కొనడం వాస్తవమేనని ముఖ్యమంత్రి అంగీకరించారు. వారి సొంత డబ్బుతో భూములు కొనుగోలు చేశారని చెప్పారు. భూముల క్రయవిక్రయాల మీద నిషేధం లేనప్పుడు, డబ్బున్నవాళ్లు భూములు కొనుక్కోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. లింగమనేని గెస్ట్‌హౌస్‌ను ప్రభుత్వ ఆస్తిగా పేర్కొన్నారు. ఆ గెస్ట్‌హౌస్ ల్యాండ్‌పూలింగ్‌లో వచ్చిందని, అందువల్లే తాను అందులో ఉంటున్నానన్నారు. మంత్రులు నారాయణ, పుల్లారావు భూములు కొన్నట్లు నిరూపిస్తే.. తిరిగి ఇచ్చేస్తామని సవాల్ చేశారన్న విషయాన్ని గుర్తుచేశారు. హాయ్‌ల్యాండ్ తన కుమారుడు లోకేశ్ భూములు కొట్టేశారని ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. ప్రస్తుతం అది సీబీసీఐడీ జప్తులో ఉందని తెలిపారు.

రాజధానిలో భూ అక్రమాలు జరగలేదన్నారు. బెదిరించి భూములు లాక్కున్నారన్న ఆరోపణలు ఖండించారు. గుంటూరు-విజయవాడ మధ్యలో ఉన్న వారిని బెదిరించగలమా? అంటూ ఎదురు ప్రశ్నించారు. బెదిరించి తమ భూమిని లాక్కున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే, తక్షణం స్పందిస్తామని, తగిన భద్రత కల్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అక్రమ దందాపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసే ప్రసక్తే లేదన్న ఆయన.. ప్రభుత్వానికి అగ్నిపరీక్ష అక్కర్లేదని తేల్చేశారు. అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీయడానికే ఇలాంటి వార్తలు రాస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాజధాని శంకుస్థాపనకు పిలిస్తే కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాలేదని.. పైగా అమరావతికి రావద్దంటూ చైనా, జపాన్, సింగపూర్ తదితర దేశాల ప్రతినిధులకు టెలిగ్రామ్‌లు, ఈ-మెయిల్స్ పంపించారని ఆరోపించారు. ఇడుపులపాయలో 610 ఎకరాల అసైన్డ్ భూమిని ప్రభుత్వానికి అప్పగించడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చట్టాన్ని మార్చారని, శిక్ష పడకుండా తప్పించుకున్నారని విమర్శలు చేశారు. అసైన్డ్ భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తూ అప్పటి శాసనసభలో దివంగత సీఎం వైఎస్‌ఆర్ చేసిన ప్రకటనను చదివి వినిపించారు.

 సొంతవారిని వెనకేసుకొచ్చిన సీఎం
 రాజధాని భూ దురాక్రమణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తనవారిని ముఖ్యమంత్రి వెనకేసుకొచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల గురించి సీఎం ఏమన్నారంటే..

 - రాజధాని ప్రకటన చేయకముందే అమరావతి మండలంలో వేమూరు రవికుమార్ కొన్నమాట వాస్తవమే. ఆయన ఎన్నారై. కుటుంబ సభ్యులందరి పేర్లతో భూములు కొన్నారు. మాకు సంబంధం లేదు.

 - నేను కొనుక్కున్నాని పయ్యావుల కేశవ్ ధైర్యంగా చెప్పారు.

 - తాను కూడా కొనుక్కున్నానని ధూళిపాళ్ల నరేంద్ర చెప్పారు.

 - 2002, 2003లోనే లింగమనేని రమేశ్ భూములు కొన్నారు. ల్యాండ్‌పూలింగ్‌లో భూములు తీసుకోమని రమేశ్ అడిగారు. తీసుకోనని నేనే స్పష్టంగా చెప్పాను. నేను గ్యాస్ టర్మినల్ ఇచ్చాను కాబట్టి లింగమనేని ఇల్లు ఇచ్చారని ఆరోపణ. ఇల్లు ఇవ్వడం ఏమిటి? అది ప్రభుత్వ ఆస్తే. ఇస్తే భూసమీకరణలో, ఇవ్వకుంటే భూసేకరణలో తీసుకొనే వాడిని. లింగమనేని గెస్ట్‌హౌస్ ప్రభుత్వ ఇల్లు కాబట్టే, తాత్కాలికంగా నేను ఉంటున్నాను.

 - సుజనా చౌదరి ఎక్కడో దూరంగా కొన్నారు.

 - ఎన్నికలు జరగకముందే డెవలెప్‌మెంట్ ఒప్పందం చేసుకున్నామని మురళీమోహన్ చెబుతున్నారు.

 - సాక్షి బయటపెట్టిన భూ దందా కథనాల వల్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. భూముల ధరలు పెరుగుతాయని సీఎంను నమ్మి ఇస్తే, ధరలు పెరగడం లేదని రైతులు అడుగుతున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇలాంటి రాతలు రాసి రాజధాని అభివృద్ధి చేయడానికి ఎవరూ రాకుండా చేయడం కుట్ర కాదా?

 అసైన్డ్ భూముల అసలు యజమానులకే ప్యాకేజీ
 1954కు పూర్వం అసైన్డ్ భూములు చాలా చేతులు మారాయి. రిజిస్ట్రేషన్లూ జరిగాయి. ఆ భూములకు ప్రస్తుత యజమానికే ప్యాకేజీ ఇస్తాం. 1954 తర్వాత అసైన్డ్ భూములు పొందినవారికి విక్రయ అధికారం లేదు. రిజిస్ట్రేషన్లు చేయడం కూడా చట్ట విరుద్ధం. ఈ భూముల అసలు యజమానుల (అసైనీల)కే ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అందుతుంది.

 ‘జర్నలిస్టులను వేధించడం సరికాదు’
 హైదరాబాద్:  రాష్ట్ర రాజధాని అమరావతిలో భూదందాపై మంత్రులు, అధికార పార్టీ నేతలు తమ నిజాయతీని చిత్తశుద్ధితో నిరూపించుకోవాలని ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఆర్ వెంకటేశ్ గౌడ్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు కోశాధికారి అస్కాని మారుతి అన్నారు. అంతేకాని నిష్పక్షపాతంగా వార్తలు రాసే జర్నలిస్టులను వేధించడం సబబు కాదని పేర్కొన్నారు.   అక్రమాలను వెలుగులోకి తెస్తున్న పత్రికలపై అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని, అందుకు సీఎం కూడా అతీతుడు కాదన్నారు. భూదందాలో తన ప్రమేయం లేనపుడు ప్రజలకు సరైన ఆధారాలు చూపాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement