రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబే బాధ్యుడు
► కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల : రాష్ట్రంలో జరుగుతున్న అన్నదాతల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రైతన్నలు అప్పులు చేసి పంటలు పండించి గిట్టుబాటు ధరలేక దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎన్నిక సమయంలో రుణాలన్ని మాఫీ చేస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రుణమాఫీ వడ్డీలకు కూడా సరి పోలేదన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంటుందన్నారు.వాటిని ప్రభుత్వం స్వీకరించి లోపాలను సరిచేసుకోవాల్సి ఉంటుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అలా కాకుండా విమర్శలు చేసిన వారిపై తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తోందన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అవినీతి కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తల హస్తమున్నట్లు తెలుస్తోందన్నారు. చంద్రబాబు, ఆయన అనుచరులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ప్రజల కోసమే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీని స్థాపించి నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అవినీతి పాలనకు ప్రజలు అంతం పలుకుతారని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.