ముఖ్యమంత్రి పర్యటనా ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
Published Thu, Aug 11 2016 12:53 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాజమహేంద్రవరంలో పర్యటించనున్న నేపధ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ బుధవారం పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. రామకృష్ణ ధియేటర్ వెనుక నిర్మించిన ప్రభుత్వ గృహ సముదాయాలను పరిశీలించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి గూడు కల్పించేందుకు ముఖ్యమంత్రి అన్ని విధాల కృషి చేస్తున్నారన్నారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి రూ. 1000 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. నగరంలో నల్లా ఛానల్ మళ్లింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సబ్ కలెక్టర్ విజయకృష్ణన్, అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి, హౌసింగ్ పీడీ సెల్వరాజ్, ఈఈ బిహెచ్ శ్రీనివాస్, పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు వారి వెంట ఉన్నారు.
సీఎం పర్యటనలో భద్రతకు 700 మంది పోలీసులు
రాజమహేంద్రవరంలో ట్రయల్ రన్
రాజమహేంద్రవరం క్రైం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాజమహేంద్రవరంలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనా ప్రాంతాల్లో బుధవారం ట్రయల్‌రన్ నిర్వహించారు. అర్భన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపిన వివరాల ప్రకారం.. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో సుమారు 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తులో సివిల్ పోలీసులతో పాటు ఏజీఎస్, స్పెషల్ బ్రాంచ్, ఎ.ఆర్. పోలీసులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల సేవలను వినియోగిస్తున్నారు. మధురపూడి విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి కారులో రాజమహేంద్రవరం చేరుకొని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటించే రామకృష్ణ థియేటర్ వెనుక ఉన్న గృహ సముదాయం వద్ద, ఇన్నీసుపేట నుంచి సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ వరకు, ఆర్‌సీసీ మేజర్ డ్రైన్, ఆవ ఛానల్ వద్ద రోడ్డు నిర్మాణ శంకుస్థాపనల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Advertisement
Advertisement