- డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ
పుట్టపర్తి టౌన్ : సీఎం చంద్రబాబు పుట్టపర్తి పర్యటనకు వచ్చినపుడు మరో వాటికన్ సిటీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారని,అయితే పుట్టపర్తిలో మాత్రం ప్రభుత్వ సంస్థలు ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ విమర్శించారు. పట్టణంలో సాయిఆరామం టూరిజం హోటల్‌కు అనుబంధంగా కొనసాగుతున్న లేపాక్షి హస్తకళల కేంద్రాన్ని త్వరలోనే మూసివేయాలని నిర్ణయించడంతో సోమవారం ఆయన ఆ కేంద్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి, పర్యాటక మంత్రి గీతారెడ్డి తదితరులు సత్యసాయిపై గౌరవంతో ఇక్కడ టూరిజం హోటల్, లేపాక్షి హస్తకళల భవన సముదాయాన్ని చేపట్టారన్నారు. సత్యసాయిచే ప్రారంభింపజేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దడానికి బదులు ఉన్న వాటిని తరలించడానికి పూనుకుంటే ఇక అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రెండున్నరేళ్లుగా పుట్టపర్తిలో ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యధోరణికి నిదర్శనమన్నారు. లేపాక్షి హస్తకళల కేంద్రాన్ని ప్రభుత్వం తరలించే కుట్రలు చేస్తే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.