- కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు రైతుల విన్నపం
కొబ్బరి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
Published Tue, Oct 18 2016 10:04 PM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM
అమలాపురం :
‘కొబ్బరి కాయను రూ.ఆరుకు అమ్మినా ఇప్పుడవుతున్న పెట్టుబడులకు గిట్టుబాటు కాదు.. అటువంటిది పది నెలలుగా మేము రూ.3 లోపే విక్రస్తున్నాం. ఇలా అయితే మేము సాగుచేయలేం. కొబ్బరి విస్తారంగా పండే ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అప్పుడే కొబ్బరికి ధరకు, సాగుకు భరోసా వస్తుంది’ అని భారతీ కిసాన్ సంఘ్ (బీకేఎస్) కు చెందిన దక్షిణభారత కొబ్బరి రైతుల బృందం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుకు చెందిన కొబ్బరి రైతుల బృందం మంగళవారం కలిసింది. కొబ్బరి ధరల పతనం, పరిశ్రమల ఏర్పాటుకు చేయూత అందకపోవడం వంటి విషయాలను వారు కేంద్రమంత్రికి వివరించారు. బృందంలో సభ్యుడు, బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మి స్థానిక విలేకరులకు ఫోన్‌లో వివరించారు. కొబ్బరి పరిశ్రమలు ఏర్పాటు చేసి దానిలో రైతులను భాగస్వామ్యులను చేయాలని అప్పుడే కొబ్బరి లాభసాటి ధర వస్తుందని వివరించారు. కొబ్బరినూనెను వంటనూనెగా గుర్తించాలని, దీనిలో ఉన్న పోషకాలు, ఇతర ఆరోగ్యకరమైన పోషకాలపై ప్రజలకు అవగాహనకల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేయించాలని రైతులు కోరారు. దీనిపై స్పందించిన సీతారామన్ కోకోనట్ డవలప్‌మెంట్ బోర్డు (సీడీబీ) ఆధ్వర్యంలో కంపెనీలు ఎందుకు ఏర్పడడం లేదని ప్రశ్నించారు. అలాగే ఇంత తక్కువ మద్దతు ధరను కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ (సీఏసీపీ) ఎలా నిర్ణయించిందని మంత్రి ప్రశ్నించారు. సీఏసీపీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరకుండా మద్దతు ధరలు నిర్ణయిస్తుందని, ఇందుకు తాము ఉదాహరణలతో సహా వివరించామని జమ్మి తెలిపారు. దీనిపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. కేంద్రవ్యవసాయ శాఖమంత్రి రాధమోహన్‌సింగ్, ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర రైల్వేశాఖమంత్రి సురేష్ ప్రభులతో మాట్లాడేందుకు సీతారామన్ అవకాశం కల్పించారని జమ్మి వివరించారు.
Advertisement