ఢిల్లీ పెద్దలను కదలించేలా తరలిరండి
బంద్‌కు అన్ని వర్గాలూ సహకరించాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
కాకినాడ : ప్రత్యేక హోదా ఆవశ్యకత ఢిల్లీ వరకూ వినిపించేలా రాజకీయాలకు అతీతంగా పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాలు మరో పోరాటం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. స్థానిక రమణయ్యపేటలోని తన నివాసంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం, బీజేపీలు కపటనాటకమాడి ప్రజలను మరోసారి మోసం చేశాయని విమర్శించారు. ఆది నుంచి రెండు పార్టీలూ ప్రజలను మభ్యపెడుతూ, రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని విమర్శించారు. బంద్ సందర్భంగా అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
వైఎస్ విగ్రహాలపై ద్వంద్వవైఖరి
విజయవాడలో మహానేత వైఎస్ విగ్రహం కూల్చివేత అంశంలో ఒక విధంగా, ఎన్టీఆర్ విగ్రహాల విషయంలో మరో విధంగా వ్యవహరిస్తున్నారంటూ తెలుగుదేశం విధానాలపై కన్నబాబు మండిపడ్డారు. అక్కడేమో వైఎస్ విగ్రహాన్ని కూల్చివేసి, కాకినాడ సర్పవరం జంక్షన్‌లో రోడ్డు మధ్యలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి హంగులు ఏర్పాటు చేస్తున్నారంటూ మండిపడ్డారు. నిబంధనల ప్రకారం ఏర్పాటుచేసిన వైఎస్ విగ్రహాన్ని తిరిగి ప్రభు త్వ ఖర్చులతో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అత్తిలి సీతారామస్వామి మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధ్యం కాదని, ఇటీవల పార్లమెంట్‌లో జైట్లీ చేసిన ప్రకటనకు చంద్రబాబే కారణమన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి లింగం రవి, మాజీ సర్పంచ్ కోమలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.