ఏలూరు సిటీ : కలెక్టర్ కె.భాస్కర్ వ్యవహార శైలి ఉద్యోగ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. ముడుపులు ఇవ్వనిదే పనిచేయడం లేదనే ఆరోపణ ఎదుర్కొన్న ఒక వీఆర్వోను ఇటీవల తన కార్యాలయానికి పిలిపించుకుని అతడికి లంచంగా రూ.5 వేలు ఇచ్చిన కలెక్టర్.. తాజాగా ప్రభుత్వం కేటాయించిన డిజిటల్ కీ తెరిచి వెళ్లిన ఉద్యోగి పేరిట ఆన్‌లైన్‌లో రాజీనామా లేఖ సమర్పించారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు.
వ్యవసాయ, ఉద్యాన శాఖలతోపాటు సర్వశిక్ష అభియాన్, డీఈవో, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి ఈ–ఫైలింగ్ విధానం అమలుపై ఆరా తీశారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాల యంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బి.విజయలక్ష్మి ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టుగా ఆమె పేరిట కలెక్టర్ లేఖ రాసి దానిని తక్షణమే ఆమోదించాలని కోరుతూ జిల్లా రిజిస్ట్రార్‌కు ఆన్‌లైన్‌లో పంపించారు. జూనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మి శుక్రవారం సెలవు పెట్టారు. కలెక్టర్ ఆ కార్యాలయాన్ని తనిఖీ చేస్తుండగా.. విజయలక్ష్మికి ప్రభుత్వం కేటాయించిన డిజిటల్ కీ, మెయిల్ ఐడీ తెరిచి ఉండటాన్ని గమనించారు. సెలవులో ఉండి డిజిటల్ కీ ఎలా తెరిచి వెళ్లారని ప్రశ్నిం చారు. విజయలక్ష్మి మెయిల్ ఐడీ నుంచి ఆమె పేరిట రాజీనామా లేఖను కలెక్టర్ స్వయంగా కంపోజ్ చేసి ఆన్‌లైన్‌లో జిల్లా రిజిస్ట్రార్‌కు పంపించారు. ఆ సమయంలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో లేకపోవడంతో ఆమె వచ్చాక.. విజయలక్ష్మి రాజీనామా లేఖను తనకు ఆన్‌లైన్‌లో పంపాలని జాయింట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లును కలెక్టర్ ఆదేశించారు.
ఈ ఫైలింగ్‌లో నిర్లక్ష్యంపై ఆగ్రహం
ఈ–ఫైలింగ్ విధానంపై వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. కనీసం ఫైల్ ఎలా తయారు చేయాలో సిబ్బందికి అవగాహన లేకపోవడం శోచనీయమన్నారు. ఇలా అయితే భవిష్యత్‌లో రికార్డులు ఎలా భద్రంగా ఉంటాయని జేడీ వై.సాయిలక్ష్మీశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వశిక్షాభియాన్ జిల్లా కార్యాలయం ఆర్థిక విభాగంలో నలుగురు పనిచేస్తుంటే ఒకేసారి ఇద్దరు సెలవుపెడితే ఎలాగంటూ పీవో బ్రహ్మానందరెడ్డిని ప్రశ్నించారు.
ఎవరిష్టం వచ్చినట్టు వారు కార్యాలయంలోని బీరువాలకు తాళాలు వేసుకుని వెళ్లిపోతే ఎలాగని నిలదీశారు. డీఈవో కార్యాలయాన్ని పరిశీలించిన ఆయన తలుపుల నిండా ఉద్యోగ సంఘాల క్యాలెం డర్లు అతికించి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రూ.72 లక్షలతో నిర్మించిన డీఈవో కార్యాలయ నూతన భవనాన్ని పరిశీ లించారు. ఇతర నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని డీఈవో డి.మధుసూదనరావును ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆన్‌లైన్‌లోనే జరగాలని ఏడాది నుంచి చెబుతున్నా పాత విధానాన్ని అమలు చేస్తున్న ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు.
కలెక్టర్ కొరడా
Published Sat, Sep 3 2016 12:27 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement