
వైవీయూలో సామూహిక జాతీయ గీతాలాపన
వైవీయూ :
యోగివేమన విశ్వవిద్యాలయంలోని అబ్దుల్ కలాం కేంద్ర గ్రంథాలయ ప్రాంగణంలో సామూహిక జాతీయ గీతాలాపన చేసి దేశభక్తిని ఎలుగెత్తి చాటారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో యావత్ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని జాతీయ గీతాన్ని రాగయుక్తంగా ఆలపించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కుల, మత, లింగ బేధాలకు అతీతంగా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య జి. గులాం తారీఖ్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో ఐకమత్యానికి, త్యాగ పురుషులను గుర్తుంచుకోవడానికి దేశం పట్ల విద్యార్థులకు గౌరవ భావం కలిగించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు.
రిజిస్ట్రార్ ఆచార్య వై. నజీర్‌అహ్మద్ మాట్లాడుతూ డెబ్బై ఏళ్ల స్వాతంత్య్రభావన, త్యాగమూర్తుల గొప్పతనం, దేశప్రతిష్టలను భావితరాల వారికి అందించడానికి జాతీయ గీతాలాపన తప్పనిసరి అని వివరించారు. ఈ కార్యక్రమాన్ని వ్యాయామ విభాగం అధ్యాపకులు డా. రామసుబ్బారెడ్డి, చాంద్‌బాషాలు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.