‘తూర్పు’ను స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుతాం
615 ఓడీఎఫ్ గ్రామాల్లో మార్చి 31కి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి
కలెక్టర్ అరుణ్‌కుమార్
పి.గన్నవరం : జిల్లాలోని 615 ఓడీఎఫ్ గ్రామాల్లో మార్చి 31లోగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ వివరించారు. దీనిపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలో మిగిలిన 400 గ్రామాల్లో కూడా డిసెంబర్ నెలాఖరు నాటికి వ్యక్తిగత మరుగుదొడ్లను నూరు శాతం పూర్తిచేసి స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతిపై పర్యవేక్షణలో భాగంగా శనివారం ఆయన పి.గన్నవరం ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. మండలంలోని ఆరు ఓడీఎఫ్ గ్రామాల్లో ఇంకా 1,100 మరుగుదొడ్లు నిర్మించాల్సిన నేపథ్యంలో మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
సీహెచ్‌సీలో డాక్టర్ల నియామకానికి చర్యలు
పి.గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, సిబ్బంది పోస్టుల నియామకానికి, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. స్థానిక ఆస్పత్రిలోని వార్డులను, రికార్డులను ఆయన తనిఖీ చేశారు. వైద్య సేవలు, ఓపీపై ఆయన ఆరా తీశారు. సీహెచ్‌సీలో గైనకాలజిస్ట్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్‌లు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆస్పత్రిని దత్తత తీసుకున్న అబ్దుల్ కలాం చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ భీమాల వెంకటేశ్వరరావు కలెక్టర్‌కు వివరించారు. స్కానింగ్ మిషన్ ఉన్నా..టెక్నీషియన్ లేకపోవడంతో గర్భిణులు అమలాపురంలోని ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి స్కానింగ్ తీయించుకుంటూ వ్యయ ప్రయాసలకు గురవుతున్నారని వెంకటేశ్వరరావు చెప్పారు. ఎక్స్‌రే మిషన్ అందించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. సీహెచ్‌సీకి ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం మంజూరైందని డిప్యూటీ సివిల్ సర్జన్ అప్పారి సూర్యనారాయణ కలెక్టర్‌కు చెప్పారు. ఆస్పత్రిలో ఉన్న బాలింతలతో ఆయన మాట్లాడారు.
కలాం ట్రస్ట్ సేవలు అభినందనీయం
జిల్లాలో బాగా పనిచేస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో పి.గన్నవరం సీహెచ్‌సీ ఒకటని కలెక్టర్ అన్నారు. ఆస్పత్రిని అభివృద్ధి చేస్తున్న కలాం చారిటబుల్ ట్రస్ట్‌ను ఆయన అభినందించారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీలో ట్రస్ట్‌కు భాగస్వామ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటనన్నారు. ఆస్పత్రి అభివృద్ధికి రూ.5 లక్షలు మంజూరు చేసినట్టు కలెక్టర్ చెప్పారు. ఎంపీపీ సంసాని లక్ష్మీగౌరి, తహసీల్దార్ బి.బేబీజ్ఞానాంబ, ఆర్‌ఐ జి.ఉమాశంకర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
వడదెబ్బ ప్రమాదాలపై అవగాహన కల్పించాలి
కాకినాడ సిటీ : వేసవిలో పిల్లలకు వడదెబ్బ తగలకుండా అవగాహన చర్యలు చేపట్టాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కోర్టు హాలులో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు.కలెక్టర్ మాట్లాడుతూ చలివేంద్రాలను వ్యాపార కూడళ్లల్లో, ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, బస్‌స్టేషన్, తదితర చోట్ల ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు, మజ్జిగ ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. మున్సిపల్ పాఠశాలల్లో తాగునీరు సరఫరా చేయాలని లోతట్టు ప్రాంతాల్లో తోపుడుబళ్లు, లోడింగ్ అన్ లోడింగ్ చేసే కార్మికులకు నీటి సరఫరాతో పాటు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన కల్పించాలన్నారు. పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు మందులు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ డీఎంఅండ్‌హెచ్‌ఓకు సూచించారు. డ్వాక్రా గ్రామైక్య సభ్యులు వేసవిలో తీసుకోవాల్సిన చర్యలు అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని డీఆర్‌డీఏ పీడీని ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలు ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటలలోపు పనులు పూర్తి చేయాలని వారికి తాగునీరు, మజ్జిగ టెంట్లు ఏర్పాటు చేయాలని డ్వామా పీడీని ఆదేశించారు. జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, డీఆర్‌ఓ చెన్న కేశవరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.