ఏలూరు (మెట్రో) : తన కుమారులకు సంబంధించిన పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం మంజూరు చేసి, సమస్య పరిష్కారం చేయాలని కోరితే లంచం అడుగుతున్నారని, కొంతమేర లంచం ఇచ్చినా మిగిలిన సొమ్ములు ఇస్తేనే పనులు చేస్తామని వీఆర్వో దుర్గారావు తిప్పుతున్నాడని ఏలూరుకు చెందిన ఒక మహిళ కలెక్టర్ భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఏలూరు–1 వీఆర్వోను కలెక్టర్ కార్యాలయానికి పిలిపించి లంచం విషయంపై ఆరా తీశారు. బాధిత మహిళను పిలిచి ఎంత లంచం డిమాండ్ చేశాడని ప్రశ్నించారు. రూ.10 వేలు అడిగారని, రూ. 2,500 ఇచ్చానని, మిగిలిన సొమ్ములు ఇస్తేనే కానీ పనిచేయనని చెబుతున్నాడని తెలిపింది. దీనిపై స్పందించిన కలెక్టర్ తన జేబులో ఉన్న రూ.5 వేలు తీసి తక్షణమే పని చేయాలని, బాధిత మహిళ తరఫున తాను లంచం సొమ్ములు ఇస్తున్నానని చెప్పారు. దీంతో కంగుతిన్న వీఆర్వో తాను లంచాన్ని అడగలేదని చెప్పుకొచ్చాడు. కలెక్టర్ ఇచ్చిన సొమ్ములు ఇవ్వబోయాడు. ఈ సొమ్ములు తీసుకుని సోమవారం సాయంత్రానికి పనిచేయాలని లేకుంటే మంగళవారం నుంచి ఉద్యోగం చేయడానికి వీఆర్వోగా ఉండవని హెచ్చరించారు. ఈ విషయంపై విచారణ నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావును ఆదేశించారు. లంచం సొమ్ముల విషయంపై కలెక్టర్ భాస్కర్ ఏలూరు ఆర్డీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవో స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సంబంధిత వీఆర్వో దుర్గారావుపై చేయి చేసుకున్నట్టు తెలిసింది. దీనిపై ఆగ్రహించిన వీఆర్వో సంఘ నేతలు స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేçÙన్ ముందు ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత వీఆర్వోపై కేసు నమోదు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. దీనిపై త్రీటౌన్ ఎస్సై ఎం.సాగర్‌బాబును వివరణ కోరగా డీఎస్పీ ఆదేశాల మేరకు తాము వీఆర్వోపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. లంచం తీసుకున్న కేసులో కేసు నమోదు చేయనున్నట్టు ఆయన తెలిపారు.