సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ లోకేష్‌కుమార్
- అనుమతులకు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలి
- సంబంధిత శాఖల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి
- అధికారులకు మండప నిర్వాకులు సహకరించాలి
- –కలెక్టర్ డీఎస్ లోకేష్ కుమార్
ఖమ్మం కల్చరల్: వినాయక చవితి పండగను పురస్కరించుకుని నగరంలో గణేష్ మండపాల ఏర్పాటు అనుమతుల కోసం ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని ఉత్సవ నిర్వాహకులకు . జిల్లా కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ సూచించారు. వినాయక మండపాల ఏర్పాటు,గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా అంశాలపై స్తంభాద్రి ఉత్సవ కమిటీ,సంబంధిత అధికారులతో శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ ్రçపజ్ఞ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ దేవరాజన్ దివ్యతో కలిసి కలెక్టర్ లోకేష్‌కుమార్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో ఏర్పాటు చేయనున్న వినాయక మండపాలకు, పోలీస్‌శాఖ నుంచి అనుమతి పొందాలన్నారు.విద్యుత్ సరఫరాకు విద్యుత్‌శాఖ నిర్దేశించిన రుసుముతో దరఖాస్తు చేయాలని ఉత్సవ కమిటీ బాధ్యులకు సూచించారు.మండపాలలో మైక్‌ను వినియోగించుకునేందుకు పోలీస్‌వారి అనుమతి తప్పనిసరన్నారు.ప్రతి మండపంలో అగ్నిమాపక పరికరాలు, ఇసుక బకెట్లును తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని చెప్పారు. లైటింగ్ కెపాసిటీని బట్టి విద్యుత్ వైరింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. గణేష్ నిమజ్జనం ప్రదేశాలలో క్రేన్స్, లైటింగ్, జనరేటర్, సౌండ్‌సిస్టమ్ ఏర్పాటుతో పాటు గజఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా శోభాయాత్ర జరిగే విధంగా బందోబస్తు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. నవరాత్రి ఉత్సవాలు ముగిసేవరకు మండపాల వద్ద ప్రతిరోజు పారిశుద్ద్య పనులను చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ను ఆదేశించారు. సమావేశంలో ఆర్‌డీఓ వినయ్‌క్రిష్ణారెడ్డి, డీఎస్పీ సురేష్‌కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ బి.శ్రీనివాస్, స్తంభాద్రి ఉత్సవ కమిటీ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఉదయ్‌ప్రతాప్, వినోద్‌లాహోటీ, సభ్యులు జయపాల్‌రెడ్డి, విద్యాసాగర్, గోపాల్ పాల్గొన్నారు.