కలర్స్‌ | colours | Sakshi
Sakshi News home page

కలర్స్‌

Published Wed, Jul 20 2016 6:59 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

కలర్స్‌

కలర్స్‌

  • పాఠశాలల్లో ప్రత్యేక దినోత్సవాలు
  • ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు
  • అవగాహన, ఆనందం 
  • సప్తగిరికాలనీ : జీవితం రంగులమయం. సంతోషం, దుఃఖం, హాస్యం, ప్రమాదం.. ఇలా ఒక్కో దానికి ఒక్కో రంగు. జీవితంలో సప్తవర్ణాలది విడదీయరాని బంధం. తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, ఉదా, నీలం.. దేనికదే ప్రత్యేకం. ఈ రంగులపై ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాఠశాలలు ప్రత్యేకంగా కృషి చేస్తున్నాయి. విద్యాసంస్థల్లో రంగుల దినోత్సవాలు నిర్వహిస్తున్నాయి. వారంలో ఒక రోజును ఎంపిక చేసి ఒక కలర్‌పై ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ కలర్స్‌ డే గురించి కలర్‌ఫుల్‌గా తెలుసుకుందాం..
     
    ఒలింపిక్‌ రంగులు
    ఒలింపిక్స్‌ అంటే చాలా మందికి తెలుసు. నాలుగేళ్లకోసారి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే క్రీడల లోగోలో ఐదు వలయాలు ఉంటాయి. ఒక్కో వలయం ఒక్కో రంగు ఉంటుంది. ఆ రంగు ఒక్కో ఖండాన్ని సూచిస్తుంది. నేటి కాలంలో విద్యాసంస్థలు చేపడుతున్న రంగుల దినోత్సవాల్లో ముఖ్యంగా ఈ ఐదు రంగులకు ప్రాధాన్యతనిస్తున్నారు. పసుపు రంగు–ఆసియా, ఎరుపు–అమెరికా, నీలం–యూరప్, నలుపు–ఆఫ్రిక, ఆకుపచ్చ–ఆస్ట్రేలియా ఖండాలకు సూచికలని విద్యార్థులకు బోధిస్తున్నారు.
     
    నిర్వహణ ఇలా..
    రంగుల దినోత్సవాలకు వారంలో ఒక రోజు ఎంపిక చేసుకుంటున్నారు. ఆ రోజు ఒక రంగును ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన రంగుల దుస్తులను విద్యార్థులు వేసుకుని వస్తారు. దీంతోపాటు ఆ రంగుకు సంబంధించి ఇంట్లో, బయట కనిపించే ప్రతి వస్తువును పాఠశాలకు తీసుకొస్తారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులందరు ఒక చోటు కూర్చుంటారు. వారు తెచ్చిన వస్తువులను అందంగా ఒక చోట అలంకరిస్తారు.
     
    టీచర్స్‌ ఏం చెబుతారు 
    ఒక చోట కూర్చున్న విద్యార్థులకు ఉపాధ్యాయుల ఆ రంగు ప్రత్యేకతను వివరిస్తారు. ఉదాహరణకు రెడ్‌ కలర్‌ తీసుకుంటే...రంగులలో పెద్దన్న పాత్ర రెడ్‌ అని విద్యార్థులకు చెబుతారు. టమాట, ఆపిల్‌ రెడ్‌ కలర్‌ ఉంటాయని చెబుతారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు కనిపించే ట్రాఫిక్‌ సిగ్నల్‌లోనూ రెడ్‌ రంగు ఉంటుందని వివరిస్తారు. రెడ్‌ సిగ్నల్‌ పడగానే వాహనాలు ఆపాలని తెలుపుతారు. అదే విధంగా రెడ్‌ సిగ్నల్‌ ఎక్కడ కన్పించిన ఆది ప్రమాదానికి సంకేతమని వివరిస్తారు. ఇలా రెడ్‌ కలర్‌ ప్రాముఖ్యతను వివరిస్తారు.
     
    రంగుల సారాంశం 
    ఎరుపు : ప్రమాద హెచ్చరికగా, ఫ్యాషనబుల్‌ పవర్‌ఫుల్‌
    ఆరేంజ్‌ : స్నేహపూరితం, ఉత్సాహవంతం 
    పసుపు : సంతోషం, తెలివికి నిదర్శనం
    నీలం : మంచి ఆలోచనలకు, ప్రశాంతతకు చిహ్నం
    నలుపు : కోపానికి, నిరసన, సంతాపానికి, తదితర వాటికి చిహ్నం
    తెలుపు : శాంతికి చిహ్నం, కొత్తదనానికి నిదర్శనం అంటు ఇవే కాకుండా అన్ని రంగుల సారాంశాన్ని ఇలా విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరిస్తారు.
     
    హల్‌చల్‌గా ముస్తాబు
    కలర్స్‌ డే నిర్వహించే రోజు ఆ రంగుతో ముస్తాబు చేస్తారు. బెలూన్‌లు, కలర్‌ పేపర్‌లు, డెకరేషన్‌ అదే రంగులో అదిరేలా చేస్తారు. రంగులకు సంబంధించిన వస్తువులు, వాటి ప్రత్యేకతను తెలిపేలా అమర్చుతారు.  
     
    అవగాహన కోసం
    రంగులపై చిన్న వయసులోనే అవగాహన కల్పించేందుకు వెరైటీగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నేటి కాలంలో కలర్స్‌కు ప్రాముఖ్యత పెరిగింది. ఒక్కో కలర్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంది. అది ఏమిటో విద్యార్థులకు తెలిపేందుకే ఈ ప్రయత్నం.  
    – ఎల్‌.రాజయ్య, లెజెండ్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌
     
    తెలిసింది
    శాటర్‌డే నాడు మా స్కూల్‌ బ్లూ కలర్‌ డే చేశారు. మా టీచర్‌ బ్లూ కలర్‌ గురించి వివరించారు. స్కూల్‌లో అందరం బ్లూ డ్రెస్సులు వేసుకొచ్చాం. ఇంకా బ్లూ బెలూన్‌లు కూడా తెచ్చాం. స్కూల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఆకాశంలా అనిపించింది.
    – హాసిని
     
    వారానికి ఒక రోజు 
    స్కూల్‌లో వీక్లీ ఒక రోజు కలర్‌ డేను పెట్టారు. మొన్న రెడ్, నిన్న గ్రీన్‌ డేలు చేశారు. అందరం చాలా ఎంజాయ్‌ చేశాం. అసలు మాకు రంగులకు ఒక ప్రత్యేకత ఉంటుందని తెలియదు. స్కూల్‌ లో రంగుల డేలు చేయడంతో వాటి గురించి తెలిసింది.  
    – ప్రణయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement