సదాశివపేట: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కూలిన ప్రతి ఇంటికి నష్టపరిహారం అందజేస్తామని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఇళ్లు కూలిన ఆరుగురు లబ్ధిదారులకు రూ.5,200లను తక్షణ సహాయంగా అందజేశారు. అనంతరం ఇళ్లు కోల్పోయిన వారిని ఆయన పరామర్శించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లు కూలిన ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు. పట్టణ పరిధిలో శుక్రవారం సాయంత్రం వరకు పాక్షిక, పూర్తిగా దెబ్బతిని నిరాశ్రాయులైన వారికి ప్రభుత్వం పరిహారం మంజూరు చేసిందన్నారు. ఇప్పటి వరకు పట్టణంలో 32 ఇళ్లు పాక్షికంగా, ఏడు పూర్తిగా వర్షాలకు కూలిపోయాయన్నారు.
పట్టణ, మండల పరిధిలో 106 కూలిన ఇళ్లను అధికారులు గుర్తించారని తెలిపారు. లబ్ధిదారులు నేరుగా తహసీల్దార్, లేదా మున్సిపల్ అధికారులను ఆధార్‌కార్డు, ఇళ్ల గుర్తింపు పత్రాలతో సంప్రదిస్తే ప్రభుత్వం పరిహారం మంజూరు చేస్తోందని వివరించారు. నిరాశ్రాయులైన వారిని గుర్తించి ఇతర ప్రాంతాలకు తరలించి తాత్కాలిక నివాసం, భోజన వసతి కల్పించాలని ఎమ్మెల్యే మున్సిపల్, రెవెన్యూ అధికారులను అదేశించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, కమిషనర్ ఇస్వాక్‌ఆబ్‌ఖాన్, తహసీల్దార్ గిరి, ఆర్‌ఐ, వీరేశం, కౌన్సిలర్లు, ఖలీమ్, కుద్దుస్, చీల స్వరూప, మేఘన, మాజీ కౌన్సిలర్ చీలమల్లన్న టీఆర్‌ఎస్ నాయకులు చిన్న, విరేశం, మొబిన్, సుభాశ్ తదితరులు పాల్గొన్నారు.