ఏమిటీ మతలబు
ఏమిటీ మతలబు
Published Fri, Feb 24 2017 12:29 AM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM
పరిహారం లెక్కల్లో భారీ వ్యత్యాసం ∙
మండిపడుతున్న బాధితులు
తుని రూరల్ :పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణంతో ఇళ్లు కోల్పోతున్న బాధితులు తమకు అందించే పరిహారం లెక్కల్లో మతలబులు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఈ నెల 14న కుమ్మరిలోవ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రచురించిన కాలనీ బాధితుల పరిహారం జాబితాపై తహసీల్దార్ కార్యాలయానికి అభ్యంతరాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఒకే విధమైన ఇళ్లకు ఒక్కొక్కరికి ఒక్కోలా పరిహారం నమోదు చేశారు. రెండు పోర్షన్ల ఇళ్లకు కొందరికి రూ.1.28 లక్షలుగా, మరికొంతమందికి రూ.ఐదు నుంచి రూ.ఆరు లక్షలుగా ఇంకొంతమందికి రూ.పది లక్షలకుపైగా రికార్డుల్లో నమోదు చేశారు. మరింత విచిత్రంగా రెండు పోర్షన్ల సాధారణ స్లాబు ఇంటి యజమానిని ఏకంగా కోటిశ్వరుడినే చేసేశారు. ఎంతో కాలంగా సొంత ఇళ్లల్లో నివాసం ఉంటున్న పది మంది బాధితుల పేర్లు పరిహారం జాబితాలో గల్లంతయ్యాయి. అంతూ, పొంతూలేని తప్పుడు లెక్కలను సరిచేసి తమకు న్యాయం చేయాలని గడిచిన వారం రోజుల్లో 50కిపైగా అభ్యంతరాలు తహసీల్దార్ కార్యాలయానికి చేరాయి. రాజకీయ జోక్యంతో అన్యాయం జరిగిందని భావిస్తున్న కొంతమంది కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే కాలువ పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకునే అవకాశం ఉంది.
పరిహారం జాబితాపై...
పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి వీలుగా తుని మండలం కుమ్మరిలోవ కాలనీలో 309 ఇళ్లు తొలగించాల్సి ఉంది. ప్రకటించిన పరిహారం జాబితాలో 304 పేర్లకే స్థానం లభించింది. బాధిత లబ్ధిదారులను గుర్తించేందుకు ఆరేడేళ్లుగా సర్వేలు చేస్తూ వచ్చారు. ఫిబ్రవరి మొదటి వారంలో బాధితులు, అధికారుల మధ్య ఒప్పందం కుదరడంతో సమస్య కొలిక్కి వచ్చింది. నష్ట పరిహారంతోపాటు అదనంగా రూ.ఐదు లక్షలు, ఇతర ఖర్చులకు రూ.136 లక్షలు, ఇళ్లస్థలాలు, ఇంటి రుణాలు ఇస్తామని అధికారులు ప్రకటించడంతో బాధితులు అంగీకరించారు. ఆ క్రమంలో గత నెలలో రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఇంజినీర్ల ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి కుమ్మరిలోవ కాలనీలో ఇళ్లకు అంగుళం అంగుళం కొలతలు వేశారు. ఎంతెంత పరిహారం ఇవ్వనున్నారో తెలిపే జాబితాలను పంచాయతీ కార్యాలయంలో ఈ నెల14న లబ్ధిదారులకు అందుబాటులో ఉంచారు. జాబితాలో తమ పేర్ల మీద ఉన్న మొత్తాలను చూసుకుని బాధితులు నివ్వెరపోయారు. ఉదాహరణకు నాలుగు సెంట్ల స్థలంలో రెండు ఫోర్షన్లు ఒకే విధమైన పెంకుటిళ్లకు రూ.ఆరేడు లక్షలు పరిహారం అందాల్సి ఉంది. అలాకాకుండా బాధితులు కోట గోవిందుకు రూ.1.28 లక్షలు, గొర్రిపాటి పైడియ్యకు రూ.3.20 లక్షలు, సుర్ల లక్షి్మకి రూ.4.60 లక్షలు, నాలం అచ్చన్నకు రూ.10.18 లక్షలు పరిహారంగా పేర్కొన్నారు. సూరెడ్డి అప్పారావుకు చెందిన రెండు ఫోర్షన్ల స్లాబు ఇంటికి రూ.98,82,045లు పరిహారంగా జాబితాలో చూపించారు. అదనంగా మరో రూ.6.36 లక్షలతో పరిహారం అందుకునే జాబితాలో అప్పారావు కోటీశ్వరుడయ్యాడు. పరిహారం లెక్కింపుల్లో అక్రమాలు జరిగాయని పలువురు బాధితులు అందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరి వారం రోజులైనా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించకపోవడంతో బాధితుల్లో అసహనం పెరుగుతోంది.
బినామీ పేర్లపై విచారణ పూర్తి
జాబితాలో 45 మంది అర్హుల పేర్లను తొలగించి 117 బినామీ పేర్లను సమోదు చేశారని అజ్ఞాత వ్యక్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 15న నాలుగు ప్రత్యేక రెవెన్యూ బృందాలు విచారణ చేశాయి. నివేదిక ఉన్నతాధికారులకు చేరింది.
బాధిత ఫిర్యాదులు వాస్తవమే...
ఈ విషయంపై తహసీల్దార్ బి.సూర్యనారాయణను వివరణ కోరగా తేడాలు వచ్చినట్టు బాధితులు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారన్నారు. వాటన్నింటినీ ఆర్ అండ్ బీ అధికారులకు పంపించామన్నారు. ఫిర్యాదులపై ఆర్డీఓ, కలెక్టర్లకు సమాచారం ఇచ్చి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.
Advertisement
Advertisement