కార్పొరేషన్ అవినీతిపై ఆందోళన
= వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అఖిలపక్షం నిర్ణయం
= రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు : మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ధ్వజం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంతపురం నగర పాలక సంస్థలో జరుగుతున్న అవినీతిపై పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని అఖిలపక్ష నేతలు తెలిపారు. అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ అవినీతి కారణంగా నగర పాలక సంస్థ నవ్వులపాలు అవుతోందన్నారు. దీనిపై ప్రముఖ దినపత్రికలలో వార్తా కథనాలు వస్తున్నా వారి తీరులో ఎటువంటి మార్పూ లేదన్నారు. గడిచిన మూడేళ్లలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ఉద్యోగులపై దౌర్జన్యాలకు కూడా పాల్పడుతున్నారన్నారు. కార్పొరేటర్లే కాంట్రాక్టర్లుగా మారి అవినీతి చేస్తున్నా ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. పాలకవర్గం గ్రూపులుగా విడిపోయి ‘మూడు ముక్కలాట’ ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి పనిలోనూ ఒక వర్గం చేపట్టాలని, మరో వర్గం వద్దంటూ అభివృధ్ధిని అడ్డుకుంటున్నారన్నారు. అవినీతిలో అందరూ భాగస్వాములుగా మారారని దుయ్యబట్టారు. అధికారులను నిర్బంధించి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారన్నారు. మేయర్ సమక్షంలోనే ఉన్నతాధికారిపై దాడి జరిగిందనే వాస్తవం తెలుస్తోందని, ఇలాంటి చర్యల ద్వారా నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. మాజీ మేయర్ రాగే పరశురాం మాట్లాడుతూ నేడు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా నగర పాలక సంస్థ అవినీతి అక్రమాలపైనే ప్రధాన చర్చ నడుస్తోందన్నారు. పాలకవర్గం అనుసరిస్తున్న తీరుతో కార్పొరేషన్ మొత్తం దివాళా తీసే పరిస్థితి ఉందన్నారు. గడిచిన మూడేళ్లలో రూ.15 కోట్ల నిధులను డ్రా చేశారన్నారు. వారికి ప్రజలు, మీడియా, విజిలెన్స్ అంటే భయం లేకుండా పోయిందన్నారు. కమిషనర్‌పై దాడి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను మేయర్, ఎమ్మెల్యే ఖండించినప్పటికీ ఈ విషయంలో అసలు దొంగలు ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దాదాగాంధీ మాట్లాడుతూ కార్పొరేషన్ లో పెత్తందారీ వ్యవస్థ రాజ్యమేలుతోందన్నారు. సీపీఐ నగర కార్యదర్శి లింగమయ్య మాట్లాడుతూ కొన్ని నెలల వ్యవధిలోనే ఏడుగురు కమిషనర్లు బదిలీపై వెళ్లిపోవడం ఇక్కడి పరిస్థితికి అద్దంపడుతోందన్నారు. డివైడర్ల పేరుతో రూ.43 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. సీపీఎం మొదటి జోన్ కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ నగర పాలక సంస్థ విచ్ఛలవిడి తనానికి అడ్డాగా మారిందన్నారు. ఈ అవినీతిలో సీఎంకూ భాగముందని ఆరోపించారు. కార్పొరేటర్ జానకి మాట్లాడుతూ కార్పొరేషన్ అవినీతిపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు విన్నవించినా వారు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. పైగా కార్పొరేటర్లపై అక్రమ కేసుల ను బనాయించి అరెస్టులు చేస్తున్నారన్నారు. కార్పొరేషన్ అవినీతిపై మంగళ వారం అఖి లపక్షం ఆధ్వర్యంలో విచారిస్తామని నేతలు తెలిపారు. విచారణ అనంతరం నగరపాలక సంస్థ కార్యాల యం ముందు మహాధర్నా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మల్లికార్జున, సరోజమ్మ, బాలాంజినేయులు, గిరిజమ్మ, పక్కీరమ్మ, వెంకటరమణమ్మ, పోతులయ్య పాల్గొన్నారు.