‘విమోచన’ను అధికారికంగా నిర్వహించాలి
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి
తహసీల్దార్‌కు వినతిపత్రం
ఘట్‌కేసర్ టౌన్: నిరంకుశ నిజాం పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు. దీనిపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు చించుకున్న సీఎం కేసీఆర్‌కు.. అధికారంలోకి రాగానే ఈ విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. దేశమంతా స్వాతంత్ర్యం సంబరాల్లో మునిగి తేలుతుంటే నియంత నిజాం మాత్రం ప్రజల మనోభావాలను అణగదొక్కాడన్నారు. మతోన్మాద ఖాసీం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు ప్రజలపై అఘాయిత్యాలు చేసి హైదరాబాద్ సంస్థానానికి తానే రాజునని ప్రకటించుకున్నాడన్నారు. ప్రజలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాలు పెరిగిపోవడంతో అప్పటి కేంద్రం హోంమంత్రి సర్దార్ వల్లబాయ్ పటేల్ చొరవ తీసుకొని భారత సైనిక దళాలను పంపి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేశారని గుర్తు చేశారు. భారతదేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం లభిస్తే.. హైదరాబాద్ సంస్థానంలో ఉన్న తెలంగాణ ప్రజలకు 17 సెప్టెంబర్ 1948న నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిందన్నారు. తెలంగాణతో పాటు విముక్తి లభించిన మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని 8 జిల్లాలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విమోచన దినోత్సవాలను నిర్వహిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించక పోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమే అధికరకారికంగా విమోచన దినాన్ని నిర్వహించాలని, తెలంగాణ చర్రిత, తెలంగాణ వీరుల జీవిత విశేషాలను పాఠ్యాంశాలుగా పెట్టాలని, తెలంగాణ త్యాగధనుల స్వస్థలాల్లో స్ఫూర్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కంభం లక్ష్మారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గుండ్ల బాల్‌రాజ్‌ముదిరాజ్, గిరిజన మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంపీటీసీ బిక్కునాయక్, ఎంపీటీసీ కరుణాకర్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు ఎదుగిన శ్రీరాములు, గొంగల్ల రమేష్, రాష్ట్ర నాయకుడు అచ్చిన నర్సింహ్మ, బీజేవైఎం మండల అధ్యక్షుడు పసులాది చంద్రశేఖర్‌ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి రాంరతన్‌శర్మ, సగ్గు మోహన్‌రావ్, రఘువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.