తెలుగుదేశం మహానాడులో చంద్రబాబు మాట్లాడిన తీరులో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల అమలుపై ఏమాత్రం పశ్చాత్తాపం, నిజాయితీ కనిపించలేదని కాంగ్రెస్ పార్టీ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు.
హైదరాబాద్: తెలుగుదేశం మహానాడులో చంద్రబాబు మాట్లాడిన తీరులో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల అమలుపై ఏమాత్రం పశ్చాత్తాపం, నిజాయితీ కనిపించలేదని కాంగ్రెస్ పార్టీ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. ఆయన శుక్రవారం ఇందిరాభవన్ లో విలేకరులతో మాట్లాడారు. మహానాడు అంటే పార్టీ ప్రజలకు ఏమిచేసిందో..ఇంకా ఏమి చేయాల్సి ఉందో తెలపేది గా ఉండాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేని పరిస్థితి తలెత్తిందో సమీక్షించి ప్రజలకు వాస్తవాలను చెప్పి భరోసా ఇస్తారనుకుంటే.. తన తప్పులను ఇతరుల మీద వేస్తూ.. చంద్రబాబు తనను తాను పొగుడుకున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ మౌలిక సిద్దాంతాలను వదిలిపెట్టిందని.. ముఖ్యంగా రైతులను, సామాన్య ప్రజానీకం విషయంలో చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేసి పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు
అదేవిధంగా ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ మాట్లాడుతూ.. పరిటాల హత్యకు కారుకులెవరో తేల్చాలన్నారు. రవి హత్య కేసులో ఆరోపణలు వచ్చిన వారిని టీడీపీలో చేర్చుకుని ఎంపీ గా అవకాశం ఇచ్చిన బాబు పరిటాల అభిమానులకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మహానాడు వేదికగా చంద్రబాబు ప్రయత్నించారన్నారు.
గత రెండేళ్ల పాలనలో అవినీతితో తెలుగు ప్రజల దోపిడి పార్టీగా టీడీపీ మారింది కాబట్టే చంద్రబాబుకు మహానాడు పండుగ నాడుగా కనపడిందన్నారు. ఎన్టీఆర్ ను గొప్ప నటుడిగా, దివంగత ముఖ్యమంత్రిగా గౌరవిస్తాం కానీ.. ఆయన ఒక్కడే తెలుగు జాతికి ఏకైక నాయకుడని చెప్పడం తగదని, దీనికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.