కాంగ్రెస్ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
ప్రతిపక్షం లేకుండా చేసే కుట్ర జరుగుతోంది: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ చాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి, షబ్బీర్ అలీ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, పార్టీ సీనియర్లు డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్, బి.బిక్షమయ్య ఇతర ముఖ్యనేతలు వారిని అభినందించారు. ప్రమాణ స్వీకారం అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రశ్నించేందుకు ప్రతిపక్షం లేకుండా చేసేందుకు అధికార టీఆర్‌ఎస్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుసరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని మండిపడ్డారు.
ప్రజల పక్షాన పోరాడుతాం: కోమటిరెడ్డి, దామోదర్ రెడ్డి
టీఆర్‌ఎస్ బెదిరింపులకు ఎదురొడ్డి తమను గెలిపించిన ప్రజల పక్షాల మండలిలో పోరాడతామని ఎమ్మెల్సీలు రాజగోపాల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు. తమను ఓడించేందుకు టీఆర్‌ఎస్ కుట్రలు, ప్రలోభాలు, బెదిరింపులకు దిగిందని, వాటికి భయపడకుండా తమను గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.