'ఓటుకు కోట్లు' కేసు ఏమైంది?
హైదరాబాద్: 'నిన్నటివరకు చంద్రబాబుపై అంతెత్తు ఎగిరిపడ్డారు. ఇవ్వాళేమో అమరావతి శంకుస్థాపనకు వెళతామంటున్నారు. అసలు పిలుపు రాకముందే ఎందుకో అంత ఉత్సాహం!' అంటూ మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. చంద్రబాబు నుంచి పిలుపు రాకముందే అమరావతి వెళ్తామంటున్న కేటీఆర్.. ఓటుకు నోట్లు కేసు ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆదివారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన గుత్తా.. తమ పార్టీ నేతలపై కేటీఆర్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఉమార్ రెడ్డిలను ఉద్దేశించి కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓవైపు తండ్రి కేసీఆర్ జానారెడ్డిని పొగుడుతుంటే, కేటీఆర్ మాత్రం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ తీరు మార్చుకుంటే మంచిదని హితవుపలికారు.
మీ ఊళ్లో అడుగుదామా?
శనివారం నల్లగొండ జిల్లాలో ఏర్పాటుచేసిన సబలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘అయితే ఇటీవల నేను చేసిన వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందిస్తూ.. ‘నీకేం తెలుసు నా సంగతి.. మీ అయ్యను అడిగితే చెప్తడు’ అని అన్నారు. మా అయ్యనెందుకు? ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లో ఉన్న అయ్యలనడిగితే మీ చరిత్ర, కాంగ్రెస్ నేతల చరిత్ర చెప్తరు..’’ అని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉత్తరకుమార్‌రెడ్డి అని ఎద్దేవా చేస్తూ.. 'ఈయన కార్లో కాదా ఎన్నికలప్పుడు రూ.3 కోట్లు దొరికింది.. ఎక్కడివి ఆ కట్టలు మర్చిపోయిండా? అలాంటి ఆయన టీఆర్‌ఎస్‌ను అవినీతిలో దేశముదురు అంటాడా? మేం మాట్లాడితే మీరు తట్టుకోలేరు. ఉద్యమంలో సింగిల్‌గా ప్రారంభమైనా, ఇప్పుడు ప్రతి గ్రామంలో 100 మంది కేసీఆర్లున్నరు. మాకు ఐదేళ్లు పాలించాలని ప్రజలు అధికారం ఇస్తే.. మీరు 15 నెలలకే బొబ్బలు పెడ్తరా?’’ అని విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే.