నయీంను కాపాడింది కాంగ్రెస్సే
నయీంను కాపాడింది కాంగ్రెస్సే
Published Sun, Oct 9 2016 10:21 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
శాలిగౌరారం : సమైక్య రాష్టంలో దశాబ్దకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే నరహంతక నయీంను పెంచి పోషించిందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం మండలంలోని ఊట్కూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నయీం కేసు విచారణలో తమపేర్లు ఎక్కడ బయట పడతాయోనని కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అంతర్మథనంలో ఆందోళన చెందుతూ బయటకు మాత్రం టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆరోపిస్తూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌పార్టీ ఉద్యమ కాలంలో న యీం వల్ల రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యులను పోగొట్టుకొని తీరని నష్టానికి గురైందన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నాడు ఐదు సంవత్సరాలుగా భువనగిరి ఎంపీగా పనిచేశారని, అప్పుడు న యీం అంటే ఏమిటో కోమటిరెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. కాంట్రాక్టుల కోసం పదువులను ఆశించే కోమటిరెడ్డి బ్రదర్స్‌కు నయీంతో సంబంధాలు కచ్చితంగా ఉన్నాయని, సిట్ విచారణలో అసలు విషయం బయటపడుతుందన్నారు. నయీం నరహంతకుడని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరహంతకులను అంతమొందించేందుకు నరకాసురవధ చేపట్టిందన్నారు. సమావేశంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు యానాల పాపిరెడ్డి, నార్కట్‌పల్లి ఎంపీపీ రేగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి, కట్టంగూరు జెడ్పీటీసీ మాద యాదగిరి, సింగిల్‌విండో చైర్మన్ లోకసాని రంగారెడ్డి, నాయకులు అయితగోని వెంకన్న, పూజర్ల శంభయ్య, భూపతి యాదయ్య, కోక యాదయ్య, వేముల లింగయ్య, ఇద్దయ్య, దార అశోక్, యారాల జీవన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Advertisement