కవాడిగూడ: వలస దోపిడీ పాలనను 60 ఏళ్లు భరించిన వాళ్లు.. స్వపరిపాలన వచ్చిన రెండేళ్లకే ప్రజలను రెచ్చగొట్టేలా అసహనాలను వ్యక్తం చేయడం సరైంది కాదనీ, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్రలో భాగమేనని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ లెక్చరర్స్ సంఘం ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టులను అడ్డుకునేందుకు విపక్షాలు చేస్తున్న చర్యల పై మేథావులు స్పందించాలన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి పునాది అని, జాతి ప్రయోజనాలే ధ్యేయంగా చివరి వరకూ పోరాడిన మహనీయుడని కొనియాడారు. సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీని వాస్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి తన ప్రాంతం తరుపున వాదించేందుకు నియమించుకున్న అడ్వకేట్ ప్రొఫెసర్ జయశంకర్ అని అభివర్ణించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం వీసీ ప్రొఫెసర్ సీతారామారావు మాట్లాడు తూ లెక్చరర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సర్వీసు రూల్స్ సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, డాక్టర్ అయాచితం శ్రీధర్, రూబీ, సైదులు తదితరులు పాల్గొన్నారు.