'విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాలు పెంచాలి'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై పార్లమెంట్ చేసిన విభజన హామీ చట్టాలను బీజేపీ అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ధ్వజమెత్తారు. పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాలను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం విజయవాడలో బోండా ఉమ విలేకరులతో మాట్లాడారు. నాడు పార్లమెంట్‌లో ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్న కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్‌జైట్లీ ఎక్కడున్నారని ప్రశ్నించారు.
ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్ ఇస్తామని బీజేపీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముష్టి వేసినట్టు రాష్ట్రానికి రూ.2,500 కోట్లు ఇచ్చారని విమర్శించారు. తమ సహనానికి ఓ హద్దు ఉందనీ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము బీజేపీతో పొత్తు పెట్టుకున్నామనీ, సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటామని బోండా ఉమ తెలిపారు.