బిల్లుల మంజూరు ఎప్పుడో..!
► పనులు పూర్తయినా మంజూరు కాని బిల్లులు
► పెండింగ్‌లో పాఠశాలల మరుగుదొడ్ల నిర్మాణ బిల్లులు
► రెండు సంవత్సరాలుగా విడుదల కాని వైనం
తిర్యాణి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడానికి స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద మరుగుదొడ్ల నిర్మాణాలు చేయాలని విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు మరుగుదొడ్లు మంజూరు చేశారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 1.25 లక్షల నిధులు మంజూరు చేశారు. తిర్యాణి మండలానికి 90 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను 2015 మే లో ప్రారంభించారు. ఈ నిర్మాణాలను జూన్‌లోగా పూర్తి చేయాలని హడావుడిగా పనులు ప్రారంభించారు.
వర్షాకాలం ప్రారంభం నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులు గుత్తేదారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో మండలంలోని అన్ని గ్రామాల్లోని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడానికి గుత్తేదారులు నానా తంటాలు పడ్డారు. అధిక రేట్లకు ఇసుక, సిమెంట్, ఇటుక కొనుగోలు చేసి పనులు పూర్తి చేసి అప్పగించారు. ఎలాగోలాగ కష్టాలు పడి మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేశారు.
అప్పటి వరకు బాగానే ఉంది. అయితే మరుగు దొడ్ల నిర్మాణాలకు మొదటి విడతగా రూ. 25 వేలు, రెండో విడతగా రూ. 50వేలు చెల్లించారు. మిగతా డబ్బులు పెండింగ్‌లో ఉంచారు. కొన్ని పాఠశాలకు రూ. 25 వేలు మాత్రమే చెల్లించి మిగతావి పెండింగ్‌లో ఉంచారు. గుత్తేదారులు ఇంజ నీరింగ్ అధికారులు ఇచ్చిన ప్లాన్ ప్రకారం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసి అధికారులకు అప్పగించ డం కూడ జరిగింది. ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థులు మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నారు. కాని గుత్తేదారులకు రావాల్సిన బిల్లులు చెల్లించడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారో తెలియడంలేదు.
రికార్డులు అందలేదనే సాకుతో బిల్లులు పెండింగ్..
ఇంతకాలం మరుగుదొడ్డి నిర్మాణాలకు సంబంధించిన ఎంబీ రికార్డులను సకాలంలో అందించలేదనే కారణంతో బిల్లులు ఆగిపోయి ఉండవచ్చని అధికారులు చెప్పుకొచ్చారు. కాని సంబందిత ఏఈ శ్రీధర్‌ను అడిడితే ఎంబీ రికార్డులు సకాలంలోనే ఆదిలాబాద్‌లో విద్యాశాఖ ఈఈ కార్యాలయంలో అందించామని తెలిపారు. పనులకు సంబంధించిన రికార్డులు సకాలంలో అందించినా అధికారులు బిల్లులు విడుదల చేయడంలో అశ్రద్ధ చేస్తున్నారని గుత్తేదారులు వాపోతున్నారు. కాగ మండలంలో 76 పాఠశాలల మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు మొత్తం రూ. 28.50 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ విద్యా సవత్సరం ప్రారంభానికి ముందే బిల్లులు వచ్చేలా చూడాలని గుత్తేదారులు కోరుతున్నారు.
వారంలో వచ్చే అవకాశం ఉంది
తిర్యాణి మండలంలోని పాఠశాలల మరుగుదొడ్ల నిర్మాణ పెండింగ్ బిల్లుల విషయమై అధికారులకు నివేదికలు ఇస్తున్నాం. ఇటీవలే జిల్లా అధికారులతో సమీక్ష సమావేశంలో ప్రస్తావించాం. అధికారులు స్పందించారు. రికార్డుల ఆధారంగా పెండింగ్ బిల్లులు చెల్లించడారికి చర్యలు తీసుకుంటామన్నారు.
– ఎన్.శంకర్, మండల విద్యాశాఖ అధికారి, తిర్యాణి