మరుగులోనూ కక్కుర్తి! | corruption in toilets construction in sircilla | Sakshi
Sakshi News home page

మరుగులోనూ కక్కుర్తి!

Published Wed, Jan 24 2018 8:12 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

corruption in toilets construction in sircilla - Sakshi

ఎల్లారెడ్డిపేటలో మరుగుదొడ్డి నిర్మాణం పరిశీలిస్తున్న అధికారులు

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, మహిళల ఆత్మగౌర వం కోసం సర్కారు చేపట్టిన ‘ఇంటింటా మరుగుదొడ్డి’ సర్పంచులకు కాసుల వర్షం కురిపించింది. జిల్లాలో 90శాతం పైగా ఐఎస్‌ఎల్‌ నిర్మించుకోగా ఇందులో 1250 మంది లబ్ధిదారులకు ఒక్కపైసా చేతికి అందలేదు. వీరికి అందాల్సిన సుమారు రూ.1.50 కోట్లు స్థానిక ప్రజాప్రతినిధులు తమ జేబులో వేసుకున్నట్లు  తెలిసింది. అధికారులు వారితో కుమ్మక్కైనట్లు ఆరోపణలు వచ్చాయి.

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) : వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడంలో జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇందుకోసం అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు నాయకులు సైతం పోటీ పడి ఐఎస్‌ ఎ ల్‌ కట్టించారు. కానీ, లబ్ధిదారులకు బిల్లులు ఇప్పించడంలో తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా 1250మందికి అందాల్సిన బిల్లులు రూ.1.50 కోట్లు నేటికీ వారికి చేతిలో పడలేదు.


1,250 మందికి అందని బిల్లులు..
జిల్లాలో 2012 వరకు 1,07,872 మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. ‘ఇంటింటా మరుగుదొడ్డి’ నినా దంతో రాష్ట్రప్రభుత్వం 2015లో వ్యక్తిగత మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రతపై గ్రామాల్లో విసృత ప్రచారం నిర్వహించింది. జిల్లాలో సుమారు 30 వేల కుటుంబాలకు మరుగుదొడ్లు లేవని తేల్చింది. మం త్రి కేటీఆర్, జిల్లాస్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరీ మరుగుదొడ్లను నిర్మించా రు. ఇలా నాలుగు నెలల వ్యవధిలోనే 25,563 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. ఆ తర్వాత వందశా తం మరుగుదొడ్లు నిర్మించినట్లు మంత్రి కేటీఆర్‌ 2016లో ప్రకటించారు. రాష్ట్రంలో సిద్దిపేట తర్వాత సిరిసిల్ల రెండోస్థానంలో ఉన్నట్లు అధికారులు వెల్లడిం చారు. అయితే, 1,250 మంది అప్పు చేసి మరుగుదొడ్లను నిర్మించుకోగా వారికి నేటికీ బిల్లులు అందలేదు. మరో 600 మంది అనుమతిలేకున్నా ఐఎస్‌ ఎల్‌ను కట్టుకున్నారని అధికారులు బిల్లులు తిరస్కరించారు. ఇంకొందరు దరఖాస్తు చేసుకున్నా గడువు ముగిసిందనే కారణంతో నిరాకరించారు.


ఆఘమేఘాలపై పనులు.. పక్కదారి పట్టిన నిధులు..
సిరిసిల్ల నియోజకవర్గంలో రెండు నెలల వ్యవధిలోనే నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించాలనే లక్ష్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకుసాగారు. 2015లో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఒక్కో యూనిట్‌కు రూ.12 వేలు చెల్లించేందుకు నిధులు సిద్ధం చేసుకున్నా రు. ఒకేసారి వేలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడంతో రింగులు, బేషిన్ల కొరత ఏర్పడింది. సర్పంచ్‌లే రింగులు తయారు చేసే కంపెనీల వద్దకు వెళ్లి.. నాసిరకం వాటిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. వాటిని తరలించే క్రమంలో 20శాతం విరిగిపోగా మరికొన్ని గుంతల్లో పెట్టాక శిథిలమయ్యాయి. విరిగిన వాటిస్థానంలో కొత్తవి ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ నిధులు ఎవరు చెల్లించాలనే ఆందోళన నెలకొంది. ఈనేపథ్యంలోనే మెటీరియల్‌ పేరుతో నిధులు కాజేశారనే అపవాదును సర్పంచులు మూటకట్టుకున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో బిల్లులు చెల్లించాల్సిన ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈలు.. అడ్వాన్స్‌ పేరిట ప్రజాప్రతినిధులకు బిల్లులు చెల్లించారు. అయినా లబ్ధిదారులకు బిల్లులు అందలేదు.


సర్పంచుల జేబుల్లోకి ఐఎస్‌ఎల్‌ బిల్లులు!
ప్రభుత్వం ఐఎస్‌ఎల్‌ బిల్లులను మండల పరిషత్‌లకు పంపిణీ చేసింది. అక్కడి నుంచి నేరుగా గ్రామపంచాయతీ సర్పంచ్‌ వీడీసీ ఖాతాల్లో నిధులు జమచేశారు. ఈ నిధులను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా అధికారులతో కుమ్ముక్కై సర్పంచులు కాజేశారు. ఇందుకు బాధ్యులుగా గుర్తించి గంభీరావుపేట ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ రాజ్‌కుమార్‌తోపాటు ఓ సర్పంచ్‌ను సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌ అయిన రాజ్‌కుమార్‌.. రాష్ట్రస్థాయి అధికారుల సిఫారసుతో కొద్దినెలల్లోనే పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. వీరేకాదు.. జిల్లావ్యాప్తంగా ఇట్లాంటివారు చాలామంది ఉన్నారు.


అప్పు చేసి కట్టించిన
అధికారులు, ప్రజాప్రతినిధులు రెండేళ్లకింద వచ్చి మరుగుదొడ్డి కట్టుకోవా లని చెప్పిండ్రు. వాళ్ల మాటలు నమ్మి అప్పు చేసి లెట్రిన్‌ కట్టించిన. ఒక్కరూపాయి రాలే. ఎవలను అడిగతినా తెల్వదంటున్నడు. అప్పుడు కట్టుకోవాలని చెప్పిన సార్లు.. ఇప్పుడు కనవడ్తలేరు. – లోకుర్తి రేణ, కంచర్ల

విచారణ జరుగుతోంది
ఐఎస్‌ఎల్‌ బిల్లుల చెల్లింపుల్లో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరుగుతోంది. కొన్ని మండలాల్లో పూర్తిస్థాయిలో ప్రభుత్వమే బిల్లులు చెల్లించింది. అయితే, బిల్లులు అందలేదని కొందరు లబ్ధిదారులు చెబుతున్నారు. వీటిపై విచారణ చేపట్టి అర్హులకు బిల్లులు అందజేస్తాం. – సురేశ్, స్వచ్ఛ భారత్‌ జిల్లా కో ఆర్డినేటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement