► పార్కుల పనులు ‘పంచాయతీరాజ్’కు..
► నాణ్యతా ప్రమాణాల కోసం కీలక నిర్ణయాలు..
► నగర సుందరీకరణకు రూ.వంద కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులంటేనే కొందరు నేతలు, అధికారుల పంట పండుతోంది. ఇంజనీరింగ్ అధికారులకైతే ‘ఫిక్స్‌డ్’ పర్సెంటేజీలు కాగా, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనులకు సంబంధిత ప్రజాప్రతినిధికి పెద్ద మొత్తంలో ముట్టజెప్పాల్సిందే. దీంతో ఆయా అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకమవుతోంది. రూ.కోట్లు వెచ్చించి నగరంలో నిర్మించిన రోడ్లు మూడు, నాలుగు నెలల్లోనే గుంతల మయం అవుతుండగా, డ్రైనేజీలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి.
ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్‌కు మంజూరైన నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనుల నుంచి ఇంజనీరింగ్ విభాగాన్ని తప్పించింది. ఈ పనులను ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించాలని నిర్ణయించారు. ఇటీవల కలెక్టర్ యోగితారాణా, స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త కార్పొరేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్‌శాఖలఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మంజూరు చేసిన నిధులు కావడంతో పనుల్లో నాణ్యత పక్కాగా ఉండేలా చూడాలని నిర్ణయించారు.
43 అంతర్గత రహదారులు..
నిజామాబాద్ నగర సుందరీకరణ కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రూ.వంద కోట్ల నిధులను మంజూరు చేశారు. ఇందులోభాగంగా నగరంలో 43 అంతర్గత రహదారులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ పనులను ఆర్ అండ్ బీ శాఖకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ రహదారుల జాబితాను ఆర్ అండ్ బీకి అప్పగించారు.
ఈ మేరకు అంచనాలను తయారు చేయాలని ఆర్ అండ్ బీ ఉన్నతా«ధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఈ శాఖ అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే రోడ్ల పరిశీలన పూర్తి కాగా, మ్యాపుల్లో గుర్తింపు వంటి ప్రక్రియను పూర్తి చేశారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పక్కనే అసంపూర్తిగా నిలిచిపోయిన కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేసే పనులను కూడా ఆర్ అండ్ బీకి అప్పగించారు. నగరంలో కూడళ్ల (జంక్షన్) అభివృద్ధి, కూరగాయలు, మాంసం మార్కెట్ల అభివృద్ధి పనులను కూడా ఈ శాఖకే అప్పగించారు.
రాజీవ్ ఆడిటోరియం పీఆర్‌కు..
రాజీవ్‌గాంధీ ఆడిటోరియం అభివృద్ధి పనులను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంతో చేయించాలని భావిస్తున్నారు. అలాగే నగరంలో ఉన్న పార్కుల అభివృద్ధి పనులను కూడా పీఆర్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు అంచనాల తయారీల్లో నిమగ్నమయ్యారు. కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అనుకున్న మేరకు అధికారులు సిబ్బంది అందుబాటులో లేరు.
పైగా పెద్ద మొత్తంలో అభివృద్ధి నిధులు ఒక్కసారిగా రావడంతో ఈ పనులను పర్యవేక్షించేందుకు ఇంజనీరింగ్ విభాగానికి తలకు మించిన భారంగా తయారవుతోంది. దీంతో పనులు పూర్తవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అసంపూర్తి పనులతో నగర వాసులు పడరాని పాట్లు పడుతున్నారు. వీటన్నింటికి ప్రత్యామ్నాయ మార్గంలో ఈ అభివృద్ధి పనులను వివిధ శాఖలకు అప్పగించాలని నిర్ణయించడంతో సకాలంలో పనులు పూర్తవుతాయని జిల్లా అధికార యంత్రాంగం భావిస్తోంది.